స్కూటర్ లాక్కెళ్లారని హిజ్రా ఆత్మాహుతి

10 Nov, 2016 14:37 IST|Sakshi
స్కూటర్ లాక్కెళ్లారని హిజ్రా ఆత్మాహుతి
పోలీసు స్టేషన్ ఎదుట ఘాతుకం
పోలీసుల తీరుపై ఆక్రోశం
ఆందోళనలతో సహచరుల ఆగ్రహం
 
పోలీసులు బలవంతంగా తన స్కూటర్‌ను లాక్కెళ్లడంతో ఆవేదనకు లోనైన ఓ హిజ్రా బుధవారం అగ్నికి ఆహుతి అయింది. పోలీసు స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పు అంటించుకోవడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కారణంగా హిజ్రా ఆహుతి కావడాన్ని జీర్ణించుకోలేక సహచర హిజ్రాలు ఆందోళనలకు దిగారు. వీరిని బుజ్జగించడం పోలీసు ఉన్నతాధికారులకు తలకు మించిన భారంగా మారింది.
 
చెన్నై: టీనగర్, పాండి బజార్‌ పోలీసులు మంగళవారం రాత్రి తిరుమలై పిళ్‌లై వీధిలో వాహనాల తనిఖీల్లో నిమగ్నమయ్యారు. అర్ధరాత్రి వేళ అటు వైపుగా వచ్చిన స్కూటర్‌ను ఆ పారు. ఆ స్కూటర్‌ను నడుపుకుంటూ వచ్చింది హిజ్రాగా గుర్తించారు. ఆ వాహనానికి  ధ్రువీవీకరణ పత్రాలు, లైసెన్స్ లు గానీ చూపించేందుకు ఆ హిజ్రా నిరాకరించింది. మద్యం మత్తులో ఉన్నట్టుగా నిర్ధారించుకున్న పోలీసులు ఆ స్కూటర్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని పాండి బజార్‌ స్టేషన్ కు తరలించారు.
 
ఇంత వరకు అంతా బాగానే ఉన్నా, బుధవారం ఉదయం ఐదు గంటల సమయంలో పాండి బజార్‌ స్టేషన్ కు వచ్చిన ఆ హిజ్రా తన స్కూటర్‌ను అప్పగించాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చింది. స్టేషన్ సిబ్బంది నిరాకరించి బయటకు బలవంతంగా పంపించడంతో, తీవ్ర మనోవేదనకు, ఆగ్రహానికి గురైన ఆ హిజ్రా  వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను పోలీసు స్టేషన్ ఎదుటే తన మీద పోసుకుని నిప్పు అంటించుకుంది. హఠాత్తుగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో అక్కడి పోలీసులు పరుగులు తీశారు. మంటల్ని ఆర్పేందుకు యత్నించారు. అంబులెన్స్ ను పిలిపించి , చికిత్స నిమిత్తం కీల్పాకం ఆసుపత్రికి తరలించారు. 
 
90 శాతం కాలిన గాయాలతో కీల్పాకం ఆసుపత్రిలో చేర్పించిన హిజ్రాకు అక్కడి వైద్యులు చికిత్స అందించారు. ఆ హిజ్రా చూలైమేడు సమీపంలోని నమశ్శివాయ పురంకు చెందిర తార(33)గా గుర్తించారు. చికిత్సపొందుతున్న తార పది గంటల సమయంలో మరణించింది. ఈ సమాచారంతో చెన్నై నగరంలో ఉన్న హిజ్రాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కోపోద్రిక్తులైన హిజ్రాలు వందలాది మంది కీల్పాకం ఆసుపత్రి వైపుగా దూసుకొచ్చారు.
 
పోలీసులు హతమార్చి, ఆహుతి చేయడమే కాకుండా, ఆత్మాహుతి నాటకం ఆడుతున్నట్టుందని ఆరోపించడం మొదలెట్టారు. దీంతో పోలీసుల్లో ఆందోళన బయలు దేరింది. అదే సమయంలో మరింత ఆగ్రహంతో పూందమల్లి హైరోడ్డుపై హిజ్రాలు ఆందోళనకు దిగడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి. ఉదయాన్నే విధుల నిమిత్తం కార్యాలయాలకు వెళ్లాల్సిన వాళ్లకు తంటాలు తప్పలేదు. పోలీసుల మీదకు హిజ్రాలు దూసుకు రావడంతో వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి.
 
ఏమి చేయాలో తోచని స్థితిలో పోలీసులు కాసేపు సంయమనం పాటించాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని హిజ్రాలను బుజ్జగించేం దుకు శ్రమించాల్సి వచ్చింది. తార స్కూటర్‌ను లాక్కెళ్లిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై విచారణ వేగవంతం చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని హిజ్రాలు ఉంచిన డిమాండ్‌కు పోలీసు ఉన్నతాధికారులు తలొగ్గక తప్పలేదు. పోలీ సు అధికారుల హామీతో ఆందోళనను విరమించారు.మృత దేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
 
Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు