ఇంటింటా సర్వే!

10 Dec, 2015 02:19 IST|Sakshi

 బాధితుల లెక్కింపు
  పర్యవేక్షణకు ఇద్దరు ఐఏఎస్‌లు
  రంగంలోకి 21 జిల్లాల అధికారులు
 
 సాక్షి, చెన్నై : వరద బాధితుల్ని లెక్కించేందుకు ఇంటింటా సర్వేకు బుధవారం చర్యలు చేపట్టారు. ఇద్దరు ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో మూడు వేల సిబ్బంది రంగంలోకి దిగారు. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, కడలూరు జిల్లాలు వర్షం కారణంగా తీవ్ర విలయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. ఇక్కడి ప్రజల్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఈ ప్రకటన మేరకు వరద బాధితుల్ని లెక్కించేందుకు చర్యలు చేపట్టారు. చెన్నై జిల్లా కలెక్టర్  సుందర వల్లి ఆధ్వర్యంలో  ఇద్దరు  ఐఏఎస్ అధికారులు, 21 జిల్లాల రెవెన్యూ అధికారులు, సబ్ కలెక్టర్లు పర్యవేక్షణలో మూడు వేల మంది సిబ్బందిని ఈ లెక్కింపు ప్రక్రియలోకి దించారు.
 
 బృందాలు బృందాలుగా ఈ సిబ్బంది బుధవారం ఉదయం నుంచి లెక్కింపు పర్వానికి శ్రీకారం చుట్టారు. అమైంజికరైలో కలెక్టర్ సుందర వల్లి పర్యటించి, అక్కడి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. తొలి ప్రక్రియగా చెన్నైలోని వరద బాధిత ప్రాంతాల్లో శరవేగంగా లెక్కింపు పర్వం సాగుతున్నది. ఇంటింటా బృందాలు వెళ్లి మరీ బాధితులకు ఎదురైన నష్టాలను, కష్టాలను పరిశీలించడమే కాకుండా, వారి రేషన్‌కార్డు, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్‌లను స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నది. ఈ విషయంగా కలెక్టర్ సుందర వల్లి మీడియాతో మాట్లాడుతూ,  ఇంటింటా సర్వే చేస్తున్నామని, బాధితులు అందరికి న్యాయం జరిగే విధంగా లెక్కింపు సాగుతున్నదన్నారు.
 
  ఈ బృందాలు అన్ని ఇళ్లకు వస్తాయని, అందరూ వారి వారి రేషన్‌కార్డు, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్‌ను తప్పని సరిగా అందించాల్సి ఉంటుందన్నారు. ఎవరివైనా రేషన్ కార్డులు, పాస్ బుక్‌లు  వరదల్లో కొట్టుకు వెళ్లి ఉంటే, అట్టి వారు ఆ వివరాలను ఈ బృందాలకు తెలియజేయాలని సూచించారు. ఈ బృందాలకు సంపూర్ణ సహకారం అందించాలని , ఎవరైనా ఇళ్లల్లో లేకున్నా, తాళం వేసుకుని వెళ్లి ఉన్నా, అట్టి వారికి సంబంధించి  మరో మారు సర్వే ద్వారా వివరాలు సేకరించడం జరుగుతుందన్నారు. అలాగే, వరదల్లో కొట్టుకు వెళ్లిన ఇతర ధృవీకరణ పత్రాల నకల్లను బాధితులకు అందించేందుకు తగ్గ చర్యలు వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు.
 
 రేషన్ కార్డు తప్పని సరేనా:  వరద బాధితులకు సంబంధించి రేషన్ కార్డు జిరాక్స్‌లను తప్పని సరిగా అధికారులు స్వీకరిస్తుండడంతో ఆ కార్డులు లేని వారికి సాయం అందడం కష్టంగా మారి ఉన్నది. రాష్ర్టంలో డిఎంకే హయాంలో కొత్త  రేషన్ కార్డుల మంజూరు ఆగింది. తదుపరి అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక పాత కార్డులకే అతుకులు వేస్తూ కాలం నెట్టుకు వచ్చారు. దీంతో కొత్త కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న కుటుంబాలు లక్షల్లో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్లలోపు కుటుంబాలకు మాత్రమే రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం వరదల్లో నష్ట పడ్డ వారిలో రేషన్‌కార్డుల లేని కుటుంబాలు వేలల్లో ఉన్నాయని చెప్పవచ్చు. అయితే,అట్టి కుటుంబాలకు రూ. ఐదు వేలు నష్ట పరిహారం దక్కేది డౌటే. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రేషన్‌కార్డులు లేని బాధితులకు ప్రత్యామ్నాయ సహకారం అందించేందుకు చర్యలు చేపట్టాలని వేలాది మంది బాధితులు వేడుకుంటున్నారు.
 

మరిన్ని వార్తలు