జల్లికట్టు కోసం..

9 Jan, 2017 02:26 IST|Sakshi
జల్లికట్టు కోసం..

► కదం తొక్కిన యువత
► మెరీనాలో భారీ ర్యాలీ
► నిరసన దీక్ష
►ఫేస్‌బుక్‌తో  వేలాది మంది ఏకం


సాక్షి, చెన్నై : తమిళుల సంప్రదాయ, సాహస క్రీడను రక్షించుకునేందుకు యువజనం నడుం బిగించింది. ఫేస్‌బుక్‌లో ఏకమైన వేలాది మంది చెన్నై వైపుగా ఆదివారం కదం తొక్కారు. మెరీనా తీరంలో శాంతియుత ర్యాలీ తో జల్లికట్టు కోసం పట్టుబట్టారు.  తమిళుల వీరత్వాన్ని చాటే సాహసక్రీడగా జల్లికట్టు ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. జల్లికట్టు సందడి లేనిదే సంక్రాంతి పర్వదినం లేదని చెప్పవచ్చు. అయితే,  ఈ క్రీడను రాక్షస క్రీడగా జంతు ప్రేమికులు అభివర్ణించడం చిక్కుల్ని తెచ్చిపెట్టింది. ఈ క్రీడకు సుప్రీంకోర్టు నిషేదం విధించడంతో జల్లికట్టు లేని సంక్రాంతిని గత ఏడాది జరుపుకోవాల్సి వచ్చింది.

ఈ ఏడాది తప్పనిసరిగా అనుమతి అంటూ ఎన్నికల సమయంలో నేతలు ఇచ్చిన వాగ్దానాలు బుట్టదాఖలయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కపట నాటకాల్ని ప్రదర్శిస్తూ, ఈ ఏడాది కూడా జల్లికట్టును దూరం చేసే ప్రయత్నాల్లో పడడం తమిళనాట ఆగ్రహాన్ని రేపిం ది. జల్లికట్టు ప్రేమికులు పోరుబాట సాగిస్తూ వస్తున్నారు. ప్రతి పక్షాలన్నీ గళాన్ని వినిపిస్తూ వస్తున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ ఓ వైపు సాగుతుంటే, మరో వైపు తాము సైతం అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడికి యువలోకం ముందుకు దూసుకు రావడం విశేషం.

కదం తొక్కిన యువత : జల్లికట్టు సాధనే లక్ష్యంగా విద్యార్థిలోకం, యువత, ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు ఏకమయ్యారు.  జల్లికట్టు సాధన నినాదంతో  కేర్‌ పేరిట ఓ ఫేస్‌బుక్‌ను ఏర్పాటు చేసి, భారీ నిరసనకు విద్యార్థి, యువలోకం కార్యచరణ సిద్ధం చేసింది. ఇందుకు స్పందించిన వాళ్లు స్వచ్ఛందంగా ముందుకు కదిలారు. రాజకీయాలకు అతీతంగా, ఏ సంస్థకు సంబంధం లేకుండా వేలాది మంది యువతీ యువకులు, విద్యార్థులు వేలాదిగా అన్నాసాలై మీదుగా మెరీనా వైపుగా ఉదయాన్నే కదిలారు. జల్లికట్టు తమ సంస్కృతి అన్న నినాదాలతో కూడిన  ప్లకార్డులను చేతబట్టి ముందుకు సాగారు. కొందరు అయితే, జల్లికట్టు తమ హక్కు అని, తమ సాహస క్రీడను దూరం చేయొద్దన్న నినాదాలతో టీ షర్టుల్ని ధరించి తరలి వచ్చారు.

మరి కొందరు యువత టీ షర్టులు, జీన్స్ ప్యాం ట్లతో, పంచెకట్టుతో జల్లికట్టు ఎద్దును అలంకరించి అక్కడి తీసుకొచ్చారు. డప్పులు వాయిస్తూ ముందుకు దూసుకెళ్లారు. లైట్‌ హౌస్‌ నుంచి మన్రో విగ్రహం వరకు ర్యాలీగా ముందుకు సాగారు. శాంతియుతంగా తమ నిరసనను తెలియజేస్తూ, జల్లికట్టుకు అనుమతి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. సంస్కృతి, సంప్రదాయాలు, మనోభావాలతో చెలగాటాలు వద్దు అని, దయ చేసి సంక్రాంతి పర్వ దినం రోజున జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టుకు విన్నవించారు. తమకూ, రాజకీయాలకు సంబంధం లేదని, కేవలం జల్లికట్టు సాధనే తమ లక్ష్యం అని గళాన్ని వినిపించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యల్ని వేగవంతం చేయాలని, జల్లికట్టుకు అనుమతి దక్కేలా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో విద్యార్థి, యువలోకం ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ ఏడాది తమకు అనుమతి దక్కుతుందన్న ఆశాభావంతో ఉన్నామని ఆకాంక్షించారు. ఫేస్‌బుక్‌ రూపంలో ఏకమైన ఈ యువ సమూహం ఒక్కసారిగా మెరీనా తీరం వైపుగా దూసుకు రావడంతో ఆ పరిసరాలు కిక్కిరిశాయి. ఆగమేఘాలపై పోలీసుల యంత్రాంగం  భద్రతా చర్యలు చేపట్టాల్సి వచ్చింది.

మరిన్ని వార్తలు