ఇండియా గేట్ వద్ద రెండున స్వచ్ఛ్ భారత్ ప్రతిజ్ఙ

27 Sep, 2014 22:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిలీ: వచ్చే నెల రెండో తేదీన ఇండియా గేట్ వద్ద ‘స్వచ్ఛ్ భారత్ ప్రతిజ్ఙ’ కార్యక్రమం జరగనుంది. ఇందులోభాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు బీజేపీ నేతలు అధికారులు దేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతామంటూ ప్రతిజ్ఞ చేయనున్నారు. స్వచ్ఛ్ భారత్ మిషన్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియా గేట్ వద్ద మారథాన్‌తోపాటు గాలిపటాలను ఎగురవేసే కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం పట్టణ అభివృద్ధి మంత్రిత్వశాఖ ఏర్పాట్లు చేస్తోంది.  ప్రతిష్టాత్మంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతను రాష్ట్ర బీజేపీ శాఖ స్వీకరించింది. వీలైనంత ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేవిధంగా చేయడం కోసం ఆ పార్టీ నేతలు శ్రమిస్తున్నారు. ఇండియా గేట్ వద్దకు కనీసం 15 వేల మందిని చేర్చాలని యోచిస్తున్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రజలకు దీనిపై అవగాహన కల్పిస్తున్నారు.
 
 జిల్లా మండల స్థాయిలలో కార్యకర్తల సమావేశాలు జరుగుతున్నాయి. వీలైనంత ఎక్కువమంది యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేవిధంగా చూడాలని బీజేపీ నేతలు కార్యకర్తలను కోరుతున్నారు. మరోవైపు వాల్మీకీ బస్తీలో స్వచ్చ్ భారత్ మిషన్ కోసం ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి.  ఈ కాలనీలో ఇప్పటికే మరమ్మతు పనులు  మొదలయ్యాయి. శిథిలావస్థలో ఉన్న రోడ్డు డివైడర్‌కు మరమ్మతులు చేశారు. ఇక్కడే ఉన్న పార్కులో గడ్డి కత్తిరించే పని కూడా ఇప్పటికే పూర్తి చేశారు. 300  కుటుంబాలు నివసించే ఈ కాలనీలో ప్రతి ఒక్కరూఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్‌డబ్ల్యూఎస్) సభ్యుడు ప్రధాన్ వీరేంద్ర రాజ్‌పుత్ తెలిపారు.
 
 20 మంది బీజేపీ కార్యకర్తలతో కలిసి ప్రధాని మోడీ వాల్మీకీ మందిర్ వద్ద  చీపురు పడతారని అంటున్నారు. ఈ ఆలయం పక్కనే మహ్మాత్మా గాంధీ నివసించిన గది కూడా ఉంది. ఇక్కడ గాంధీజీ 214 రోజులు గడిపారు .ఆ సమయంలో ఆయన వాల్మీకీ వర్గానికి చెందిన పిల్లలకు చదువు చెప్పారు. నరేంద్ర మోడీ ఆ రోజున మహాత్మా గాంధీ  గదిని సందర్శించడంతో పాటు డీఆర్‌డీఓ టెక్నాలజీతో నిర్మించిన మరుగుదొడ్డిని కూడా ప్రారంభిస్తారు. వికలాంగులకు కూడా అనువుగా ఉండే డిజైన్‌తో కూడిన ఈ టాయిలెట్ నిర్మాణ పనులు ప్రసుతం జోరుగా జరుగుతున్నాయి.  కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ కూడా ఎన్‌డీఎంసీ ఏరియాలో  వేర్వేరు చోట్ల జరిగే పారిశుధ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. ఏడుగురు బీజేపీ ఎంపీలు కూడా తమ తమ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో పారిశుధ్య కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
 

మరిన్ని వార్తలు