పురాతన పుస్తక భాండాగారం

12 Nov, 2014 00:56 IST|Sakshi
పురాతన పుస్తక భాండాగారం

* ఉర్దూ, సంస్కృత భాషల్లో.. 90 ఏళ్లనాటి భగవద్గీత
* ఉర్దూ, అరబిక్, పర్షియన్, ఇంగ్లిష్, టర్కిస్ భాషల డిక్షనరీలు
* అందుబాటులో మరెన్నో అరుదైన పుస్తకాలు

న్యూఢిల్లీ: అదిపాత ఢిల్లీలోని అత్యంత ఇరుకైన ప్రాంతం. అక్కడ నివసించే యువతకు.. భవిష్యత్ తరాలకు ఏమి ఇవ్వాలనే ఆలోచన తట్టింది.. వెంటనే ఆచరణలో పెట్టారు. వజ్ర సంకల్పంతో 1999లో ఓ చిన్న గదిలో గ్రంథాలయాన్ని ప్రారంభిం చారు. భవిష్యత్ తరాలకు పుస్తక సంపదను వారసత్వంగా (ఈ గ్రంథాలయాన్ని) అందజేశారు. ఈ ప్రయత్నానికి అందరూ చేదోడువాదోడయ్యారు. చేయిచేయి కలిపితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు. ఆ పుస్తక భాండాగారం ఇప్పుడు రెండు దశాబ్దాల వడికి చేరింది. అదే చాంద్‌నీ చౌక్‌లోని జమా మసీద్‌కు కొద్ది దూరంలోని ఇమ్లీ గలీలో ఉన్న‘షా వాలైలా’ గ్రంథాలయం. అరుదైన, అంతరించిపోతున్న పుస్తకాలను పుస్తక ప్రియులకు అందుబాటులో ఉంచుతోంది. ఇప్పుడు పరిశోధనా గ్రంధాలయంగా మారింది.
 
అందుబాటులో ఉన్న పుస్తకాలు: వివిధ పబ్లికేషన్లు, డిక్సనరీలు, వివిధ భాషలలో కథలు, పద్య కవితల పుస్తకాలను అందుబాటులో ఉంచుతోంది. అంతరించిపోయిన పుస్తకాలు, అరుదైన పుస్తకాలను సేకరించి అందుబాటులోకి తెస్తోంది. ఈ కృషిని నిరంతరం కొనసాగిస్తోంది. సుమారు 15,000 పుస్తకాలున్నాయి. హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం, ఉర్దూ, పర్షియన్, అరబిక్ భాషల పుస్తకాలున్నాయి.  ఈ లైబ్రరరీలో  సుమారు 70శాతం అంతరించిపోయిన, అరుదైన పుస్తక సంపద అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఢిల్లీ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్(డవైడబ్ల్యూఏ) ఆధ్వర్యంలో సికందర్ చాంగేజ్ నిర్వహిస్తున్నాడు.   ఆఖరి మొఘలు వంశంతో సన్నిహిత సంబంధాలున్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన అనుభవాలు ఇలా వివరించారు..

దాతల సహకారం: ‘మా వారసుల నుంచి వచ్చిన పుస్తక సంపదను  లైబ్రరరీని స్ధాపించినప్పుడు (సుమారు 2000 పుస్తకాలు) దానం చేశాన’ని చెప్పారు. ప్రజలు ముందుకొచ్చి పుస్తకాలను దానం చేస్తున్నారు. అన్ని రకాల, భాషల పుస్తకాలు, అరుదైనవి అందజేస్తున్నారు. ఇప్పటి వరకు అరుదైన పుస్తకాలు 15,000 వరకు ఉన్నాయి. ఈ లైబ్రరరీకి పుస్తకాలను దానం చేయడం ఆయన స్ఫూర్తితో..అలా మొదలై కొనసాగుతోనే ఉంది.
 
అరుదైన పుస్తక సంపద: 150 సంవత్సరాల క్రితం నాటి పద్య పుస్తకాలు(బహదూర్‌షా జాఫర్ కాలం నాటి) కూడా ఉన్నాయి. 90 ఏళ్ల నాటి ‘భగవద్గీత’ సంస్కృతం, ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంది. చివరి మొఘల్ రాజు బహదూర్ షా జాఫర్ సేకరించిన పద్యాల పుస్తకం  ఎర్రకోటలోని రాయల్ ప్రెస్‌లో 1885లో ముద్రించారు. ఇది పంజాబీ భాషలో అచ్చు అయ్యింది. అదేవిధంగా 225 ఏళ్ల క్రితం పర్షియన్ రచయిత క్వాజీ సయ్యద్ అలీ రచించిన‘సాయిర్-ఉల్-ఎక్‌తాబ్’ ఈ పుస్తకం అరుదైనది. సూఫీ బోధనల పుస్తకాలు ఉన్నాయి.. ఉర్దూ, అరబిక్, పర్షియన్, ఇంగ్లిష్, టర్కిస్ భాషలల్లో డిక్షనరీలున్నాయి.
 
1870లో బోపాల్‌కు చెందిన బేగం ఆరు భాషల్లో రచించిన ‘ఖాజానతుల్ లుగాత్’ అనే పుస్తకం ఉంది. ఈ అరుదైన పుస్తకాన్ని అంతర్జాతీయ ఆదరణ ఉంది. దేశీయ విద్యార్థులు, స్కాలర్లతోపాటు వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు ఈ పుస్తకంపై అధ్యయనం, పరిశోధనలు చేస్తారని నిర్వాహకులు పేర్కొన్నారు.సమస్యల వలయంలో..: అట్లాంటి లైబ్రరరీకి ప్రస్తుతం స్థలం కొరత సమస్యగా మారింది. కొన్ని పుస్తకాలను కట్టలుగటి ఉంచాల్సి వస్తుంది. అంటే ఈ పుస్తక బండాగారం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోందని మహ్మద్ నయూమ్ చెప్పారు.

మరిన్ని వార్తలు