మాంసం వండలేదని..

18 Jul, 2017 15:52 IST|Sakshi
మాంసం వండలేదని..
► భార్యను హత్య చేసిన భర్త
పొన్నేరి : మాంసం వండలేదనే క్షణికావేశంలో భార్యను హత్యచేసి భయంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎన్నూర్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఎన్నూరు సునామీ కాలనీకి చెందిన మోహన్‌ (33) ట్రాలీ బండి నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం మోహన్‌ సోదరి ఇంటికి వచ్చింది. దీంతో మటన్‌ తెచ్చి వండిపెట్టమని మోహన్‌ తన భార్య సరళ(27)కు చెప్పాడు, అయితే సరళ ఆ విషయం మరిచిపోయింది. రాత్రి ఇంటికి వచ్చిన మోహన్‌ కూర ఎందుకు చేయలేదని అడిగాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

ఆవేశంతో మోహన్‌ భార్య సరళ గొంతు నులమడంతో ఆమె చనిపోయింది. దీంతో భయపడిన మోహన్‌ ఫ్యాన్‌కు ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో వారి ముగ్గురు కుమార్తెలు మహాలక్ష్మి(9), అనుప్రియ(7), కావ్య(5)  నిద్రపోతున్నారు. ఉదయం లేచేసరికి తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెంది ఉండడంతో పిల్లలు కన్నీరు మున్నీరుగా పెద్దగా అరుస్తూ ఏడుస్తున్నారు. దీన్ని గమనించిన చుట్టుపక్కల వారు వచ్చి చూడగా భార్యభర్త ఇద్దరు విగతజీవులుగా ఉన్నారు.

దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకోసం చెన్నై స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు ఆడపిల్లల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం శోకసంద్రంగా మారింది. ఎన్నూరు పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నారు. 
Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు