నేనే సీఎం అభ్యర్థి

13 Apr, 2015 03:06 IST|Sakshi
నేనే సీఎం అభ్యర్థి

 రాష్ట్రంలో మూడో ఫ్రంట్ ఏర్పాటుకు టీఎంసీ, వామపక్షాలు కసరత్తుల్లో పడ్డాయి. డీఎండీకే అధినేత విజయకాంత్‌ను తమ ఫ్రంట్‌లోకి ఆహ్వానించగా, ఆయన తానే సీఎం అభ్యర్థి అన్న నిబంధనను పెట్టడం గమనార్హం.
 
 సాక్షి, చెన్నై : రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేల తర్వాత డీఎండీకేకు ఓటు బ్యాంక్ కాస్త ఎక్కువ. లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతైనా ఓటు బ్యాంక్‌ను మాత్రం ఆ పార్టీ పదిలం చేసుకుంది. దీంతో ఆ పార్టీకి మంచి డిమాండే ఉంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే నేత విజయకాంత్‌ను తమ వైపు తిప్పుకునేందుకు డీఎంకే తీవ్రంగానే ప్రయత్నిస్తున్నది. అయితే, సీఎం కావాలని కలలు కంటున్న కెప్టెన్ ఏ మేరకు ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతారోనన్నది ప్రశ్నార్థకం. ఈ పరిస్థితుల్లో గత వారం టీఎంసీ నేత వాసన్ ఇంట్లో సాగిన సీపీఎం నేత ఏచూరీ భేటీ విజయకాంత్‌కు కొత్త అవకాశం చేతికి చిక్కినట్టు అయింది.  
 
 థర్డ్ ఫ్రంట్ : డీఎంకే, అన్నాడీఎంకేలు అవినీతి ఊబిలో కూరుకున్న దృష్ట్యా, ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఓ  కూటమి ఏర్పాటుకు తమిళ మానిల కాంగ్రెస్(టీఎంసీ) నేత వాసన్ కొన్ని నెలలుగా పావులు కదుపుతూ వస్తున్నారు. వామపక్షాలను, మైనారిటీ సామాజిక వర్గ పార్టీలను, తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే నాయకుల్ని ఆహ్వానించి తరచూ ఏదో ఒక సదస్సును ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఈ సదస్సుల వేదికగా మతతత్వానికి, అవినీతికి ప్రత్యామ్నాయంగా కొత్త కూటమి ఆవిర్భవించాల్సిందేనని నాయకులు వ్యాఖ్యానించి ఉన్నారు. ఈ వ్యాఖ్యల్ని కార్యరూపంలో పెట్టేందుకు వామపక్షాల నేతలు, టీఎంసీ నేత వాసన్ సిద్ధం అయ్యారు.
 
  ఇందులో భాగంగానే గత వారం వాసన్ ఇంట్లో సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి భేటీ సాగినట్టుగా టీఎంసీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో థర్డ్ ఫ్రంట్ లక్ష్యంగా కసరత్తులు ఆరంభమైనా, నేతృత్వం ఎవరు వహించాలన్న అంశం చర్చకు వచ్చి ఉన్నది. వాసన్ నేతృత్వంలో కూటమి ఏర్పాటు దిశగా వామపక్షాలు ముందుకు వచ్చాయి. మైనారిటీ సామాజిక వర్గాల పార్టీలు, వీసీకే థర్ట్ ఫ్రంట్‌లోకి వచ్చే అవకాశం ఉన్నా, డీఎండీకేను తీసుకురావడం మీద నాయకులు తీవ్రంగా కుస్తీలు పడుతున్నట్టు సమాచారం. వాసన్‌కు విజయకాంత్‌కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న దృష్ట్యా, డీఎండీకేను కూటమిలోకి తీసుకొచ్చే బాధ్యతలు ఆయన భుజానే వేశారు.
 
 తన నేతృత్వంలో కాకుండా విజయకాంత్‌తో కలసి ఉమ్మడి నేతృత్వంలో థర్ట్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా వాసన్ కసరత్తులు చేపట్టినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. టీఎంసీ వర్గాల ఏకాభిప్రాయంతో విజయకాంత్ వద్దకు రాయభారం పంపినట్టు చెబుతున్నారు. థర్డ్ ఫ్రంట్‌ను ఆహ్వానించిన విజయకాంత్, నాయకత్వం మాత్రం తమ చేతిలోనే ఉండాలన్న నిబంధనను పెట్టినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అలాగే, థ ర్డ్ ఫ్రంట్ సీఎం అభ్యర్థిగా తన పేరును ముందుగానే ప్రకటించాలని స్పష్టం చేయడంతో వాసన్ దూతలు నోరు మెదపకుండా వెను దిరిగినట్టు సమాచారం.
 
 తనకు సీఎం అభ్యర్థిత్వం ఇస్తే థర్డ్ ఫ్రంట్‌లోకి వచ్చేందుకు సిద్ధం అని, లేని పక్షంలో ఒంటరిగా కూడా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు రెడీ అన్నట్టు వాసన్‌కు విజయకాంత్ సంకేతం పంపడం ఆలోచించ దగ్గ విషయమే. దీంతో వామపక్షాలతో చర్చించినానంతరం తదుపరి నిర్ణయాన్ని వెల్లడించే విధంగా విజయకాంత్‌కు వాసన్ సందేశం పంపినట్టుగా టీఎంసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల అనంతరం సీఎం ఎవ్వరన్నది తేల్చుకుందామని, ముందు మతత్వానికి , అవినీతికి వ్యతిరేకంగా ఒక కూటమి ఏర్పాటు చేద్దామన్న లక్ష్యంతో ఉన్నట్టు విజయకాంత్‌కు నచ్చ చెప్పి దారిలోకి తెచ్చుకునేందుకు వాసన్ అస్త్రాలను ప్రయోగిస్తున్నట్లు చెబుతున్నారు.  
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా