కలల హీరో కోసం ఎదురు చూస్తున్నా

13 Nov, 2015 08:21 IST|Sakshi
కలల హీరో కోసం ఎదురు చూస్తున్నా

చెన్నై : నా కలల హీరో కోసం ఎదురుచూస్తున్నా అంటున్నారు మిల్కీ బ్యూటీ హన్సిక. అందమైన అమ్మాయిలందరిలోనూ మంచి మనసు ఉంటుందని చెప్పలేం. ఈ రెండు కలసిన పాలరాతి బొమ్మ హన్సిక. నటిగా ఎంత ప్రతిభావంతురాలో వ్యక్తిగానూ అంత మానవత్వం కలిగిన హన్సిక తన ప్రతి పుట్టిన రోజుకూ ఒక అనాథ పిల్లను లేదా పిల్లాడిని దత్తత తీసుకుని వారి సంరక్షణ బాధ్యతల్ని మోస్తున్న అరుదైన నటి హన్సిక.

అలా ఇప్పటికి 23మంది పిల్లలను పెంచి పోషిస్తున్న ఈ ముంబాయి భామ దీపావళి పండగను వారి సమక్షంలో జరుపుకుని ఎనలేని ఆనందాన్ని అందించారట. ఒక పక్క నటిగా తన స్థాయిని పెంచుకుంటూ మరో పక్క సేవా కార్యక్రమాలతో మానవతావాదిగా పేరు తెచ్చుకుంటున్న హన్సికతో చిన్న భేటీ...
 
 
 ప్ర : నటిగా మీ బలం, బలహీనతలు?
జ: నటి కావడమే నా బలం. ఇక బలహీనతకు తావే లేదు.
ప్ర : మీ మనసుకు నచ్చిన కథానాయకుడెవరు?
జ: నాతో జత కట్టిన కథా నాయకులందరూ నాకు నచ్చినవారే. వారిలో ఒకరి పేరు చెప్పి మరొకరి కోపానికి గురికావడం నాకు ఇష్టం లేదు.
ప్ర : మీ అమ్మ డాక్టరు. మీరు నటనను వృత్తిగా ఎంచుకున్నారు. అప్పుడు మీ అమ్మ రియాక్షన్ ఏమిటి?
జ: ఆ విషయం గురించి సరిగా జ్ఞాపకం లేదు కానీ మా అమ్మ రియాక్షన్‌ను అర్థం చేసుకునేలోగానే నేను నటనా రంగంలోకి ప్రవేశం చేసేశాను. అమ్మ స్కిన్ డాక్టరు. పలువురు బాటీవుడ్ నటీనటులు అమ్మ వద్దకు సలహాలు, సూచనల కోసం వస్తుండేవారు. అలా వాళ్లను చూస్తూ ఎదిగిన దాన్ని నేను. అలానే సినిమా అవకాశం రావడంతో బాలతారగానే ఈ రంగంలోకి ప్రవేశించాను. ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్‌లలో తెలిసిన నటినైపోయాను. మొదట్లో నా కూతురు తనలా డాక్టరు కాలేకపోయిందనే చిన్న బాధ ఉన్నా ఆ తర్వాత అది పోయింది. ఇప్పుడు సంతోషంగానే ఉన్నారు.
ప్ర : మీ ప్రతి పుట్టిన రోజున అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవడం అనే సేవా దాతృత్వ కార్యక్రమం కొనసాగుతుందా?
జ: తప్పకుండా కొనసాగుతుంది. ఈ ఆలోచన నాకు చిన్నతనం నుంచే ఉండేది. భవిష్యత్‌లో కూడా నా శక్తి కొలదీ దత్తత స్వీకార ప్రక్రియ కొనసాగుతుంది.
ప్ర : ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు?
జ: స్క్వాష్ క్రీడ ఆడతాను. పెయింటింగ్ చేస్తాను. పిల్లలు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతాను.
ప్ర : మీ కలల హీరో ఎవరు?
 జ: కలల హీరోను ఇకపైనే అన్వేషించాలి. ఆ ఎవరనే వాడి కోసమే నేనూ ఎదురు చూస్తున్నాను.
 ప్ర : సరే మీ డ్రీమ్ పాత్ర అంటూ ఏమైనా ఉందా?
 జ: నా డ్రీమ్ పాత్ర ఏమిటన్నది నా అభిమానులే చెప్పాలి. ఇప్పటి వరకూ నాకు లభించిన అవకాశాలను   సద్వినియోగం చేసుకుంటూ వస్తున్నాను. అంతే కానీ నాకంటూ డ్రీమ్ పాత్ర అంటూ ఏదీలేదు. ఎప్పటికీ అభిమానుల తీర్పే నాకు ముఖ్యం.
 ప్ర : స్నేహం ద్రోహంగా మారితే దాన్ని ఎలా ఎదుర్కొంటారు?
 జ: నేను అవన్నీ దాటే వచ్చాను. కాబట్టి ఆ విషయం గురించి పెద్దగా పటించుకోను. మనసు బాధిస్తుంది. అయినా చిరు నవ్వుతోనే దాన్ని మరిచిపోయే ప్రయత్నం చేస్తాను.

మరిన్ని వార్తలు