ఐ డోంట్ కేర్..!

26 Mar, 2014 23:01 IST|Sakshi

న్యూఢిల్లీ: సహాయ పాత్రలతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన ఓ సమయంలో అగ్రహీరోలతో సమానమైన ప్రేక్షకాదరణను పొందారు. ఆశా పరేఖ్, మాలా సిన్హా, వహీదా రెహ్మాన్ వంటి అందాల తారల సరసన నటించి, బెంగాలీ అభిమానులకే కాకుండా బాలీవుడ్ అభిమానులనూ ఉర్రూతలూగించారు.
 
లేటు వయసులో రాజకీయాల్లోకి ప్రవేశించి, దేశ రాజధానికి గుండెకాయగా చెప్పుకునే న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. తాను గెలుస్తానన్న ఆత్మవిశ్వాసం తనకుందని, తృణముల్ కాంగ్రెస్ పార్టీ అంతకుమించి ప్రోత్సాహాన్ని తనకు అందిస్తోందన్నారు.
 
ప్రత్యర్థుల పేర్లు, వారి చరిత్రలు చూసి భయపడి వెనకడుగు వేసే వ్యక్తిత్వం తనది కాదన్నారు. వారెవరనే విషయాన్ని తాను అసలు పట్టించుకోనని చెప్పారు. న్యూఢిల్లీ నియోజవర్గంలో తన విజయావకాశాల గురించి, తాను చేస్తున్న ప్రచారం గురించి ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
 
 ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
‘క్యారెక్టర్ ఆర్టిస్టుగా బెంగాలీ చిత్రంతో సినిమాల్లోకి ప్రవేశించాను. ఆ తర్వాత ఒక్కోమెట్టు ఎదుగుతూ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాను. అగ్రహీరోల సరసన స్థానం సంపాదించుకున్నాను. సినీ పరిశ్రమలో పెద్దపెద్దవాళ్లున్నారని ఎప్పుడూ బెదరలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాను.
 
అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాను. అప్పటి నుంచే ప్రత్యర్థుల గురించి ఆలోచించడం మానేశాను. లేటు వయసులో రాజకీయాల్లోకి అడుగుపెట్టావని కొందరంటున్నారు... వయసు ప్రభావం రాజకీయాల్లో జయాపజయాలపై ఉండదనేది నా అభిప్రాయం. నిజానికి వయసు అనుభవాన్నిస్తుంది.
 
ఆ అనుభవంతోనే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. మిగతావారితో పోలిస్తే నేనే అత్యంత అనుభవమున్న వ్యక్తిని. ఇది నాకు అనుకూలాంశం. యువకులు ఆవేశపడతారు.. ఆందోళనకు దిగుతారు. కానీ వయసు మీదపడినవారు ఆలోచనతో ముందుకెళ్తారు. ప్రజలకు సేవ చేయడానికి అవసరమైనది కేవలం మంచి చేయాలన్న ఆలోచన మాత్రమే. అది నాకుంది.
 
 మూడో ఇన్నింగ్..
బెంగాలీ చిత్రసీమలోకి అడుగుపెట్టడం తొలి ఇన్నింగ్ అయితే బాలీవుడ్‌లోకి అడుగు పెట్టడం రెండో ఇన్నింగ్. ఇక తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చి జీవితంలో మూడో ఇన్నింగ్‌ను ప్రారంభించాను. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన చాలా రోజుల నుంచే ఉంది. అయితే ఇదే సరైన సమయమనే అభిప్రాయంతో ఇప్పుడు అడుగుపెట్టాను.
 
ఇక న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తాను. ఇక గెలుపోటములన్నవి ఇప్పుడే ఎవరూ నిర్ణయించలేని విషయం. ఎన్నికలు టీ20 మ్యాచ్‌లాంటిది. చివరి నిమిషం వరకు ఎవరు గెలుస్తారో? ఎవరు ఓడిపోతారో చెప్పడం కష్టం. నా గెలుపుకోసం నేను చేయాల్సిందంతా చేస్తున్నాను. పార్టీ నుంచి కూడా అవసరమైనంత సహకారం అందుతోంది.
 
ఇక నా ప్రత్యర్థుల విషయానకి వస్తే ఎవరు బలవంతులు? ఎవరు బలహీనులు? అనే విషయాలపై నేను దృష్టిపెట్టలేదు. రాజకీయాల్లో బలవంతులు, బలహీనులు ఉండరనేది నా అభిప్రాయం. ‘మా, మతి, మానుష్’(కన్నతల్లి, కన్నభూమి, మానవత్వం)  నినాదంతో ఎన్నికల్లోకి వెళ్తున్నాం. ఇదే నినాదంతో 2009 ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ భారీ విజయాలు నమోదు చేసింది. ఇప్పుడు కూడా ఆ మ్యాజిక్ జరగక మానద’న్నారు.
 
బెంగాలీల జనాభా ఎక్కువే...

ఈ నియోజకవర్గం నుంచి అభ్యర్థిని ఎంపిక చేసేముందు మరో ఆలోచన ఏదీ లేకుండా బిశ్వజీత్ పేరును ఎంపిక చేశారని మమతా బెనర్జీ చెప్పడం వెనుక అనేక వ్యూహాలు దాగి ఉన్నాయని రాజకీయ పండితులు చెబుతున్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో బెంగాలీల జనాభా ఎక్కువగానే ఉంది. ఇక్కడి చిత్తరంజన్ పార్కు ప్రాంతాన్ని మినీ బెంగాల్‌గా పిలుస్తారు.
 
దీంతోపాటు చటర్జీ అమ్ముల పొదిలో ‘బాలీవుడ్ హీరో ’ అనే మరో అస్త్రం ఉండనే ఉంది. దీంతోపాటు అన్నా హజారే వంటి ప్రముఖ సామాజిక కార్యకర్తలు దీదీ(మమతా బెనర్జీ)కి తమ మద్దతును ప్రకటించారు. ఇది కూడా న్యూఢిల్లీ నియోజకవర్గంలో చటర్జీకి కలిసిరావొచ్చంటున్నారు.

మరిన్ని వార్తలు