ఆలోచనలు మాత్రం ఆకాశమంత ఎత్తు..

13 Apr, 2017 22:46 IST|Sakshi
ఆలోచనలు మాత్రం ఆకాశమంత ఎత్తు..
- సైనికుల కవచ రోబో సృష్టి
- అమెరికా, జపాన్‌ సరసన భారత్‌ ఆకాంక్ష
- పదహారేళ్ల బాలుడి దేశభక్తి
 
 చెన్నై: దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా భారత్‌ సరిహద్దుల్లో ఇంకా ఉద్రిక్తత. కశ్మీర్‌లో చొరబాట్లు. భారత సైనిక శిబిరాలపై పాకిస్థాన్‌ ముష్కరుల ఆకస్మిక దాడులు. భారతమాత ముద్దుబిడ్డలైన సైనికుల ప్రాణాలకు నిరంతరం పొంచిఉన్న ముప్పు. దేశ ప్రజలు గుండెపై చేయివేసుకుని హాయిగా నిద్రపోతున్నారంటే సరిహద్దుల్లోని భారత సైనికులు ప్రాణాలు తెగించి రక్షణ కవచంగా నిలబడడమే. మరి ఈ సైనికులను కాపాడుకోవడం, ప్రాణరక్షణ కల్పించడం ఎలా. ఈ ఆలోచనలు ఒక పదహారేళ్ల బాలుడి మెదడును తొలిచేశాయి. దేశం మనకేమి ఇచ్చింది అనేదికాదు, మనం దేశానికి ఏమి ఇచ్చామని ప్రశ్నించుకుంది ఆ బాలుని హృదయం.

శత్రుదేశాల సైనికుల, ముష్కరుల చేతుల్లో భారత సైనికుల ప్రాణాలు పోకుండా ఏమీ చేయవచ్చు అని ఆలోచించాడు. ఆ దిశగా సాగిన అతని ఆలోచనలు కార్యరూపం దాల్చాయి. భిన్నమైన రోబోల వినియోగించడం ద్వారా భారత సైనికుల ప్రాణాలను కాపాడవచ్చు అంటున్నాడు చెన్నైకి చెందిన తిరుమురుగన్‌ అనే బాల మేధావి. ప్రస్తుతం ప్లస్‌టూ చదువులోనే సైనికులకు రక్షణ కవచం లాంటి మోడల్‌ రోబోను తయారుచేసి ఉపాధ్యాయులచే శభాష్‌ అనిపించుకున్నాడు.
 
ఏ పువ్వులో ఎటువంటి పరిమళం దాగి ఉంటుందో అన్నట్లుగా ఏ చిన్నారి మదిలో ఎంతటి ఉన్నతభావాలు నిగూఢమై ఉంటాయో అని అందరూ అచ్చెరువొందేలా ఎదిగాడు తిరుమురుగన్‌. తండ్రి గోపాలకృష్ణ దుబాయ్‌లో డ్రైవర్‌ ఉద్యోగం చేస్తూ చెన్నైలోని భార్య సెల్వి, కుమారుడు తిరుమురుగన్, కుమార్తెకు నెలకింతని పంపే డబ్బే ఆ కుటుంబానికి ఆధారం. ఆర్థికంగా చిన్నకుటుంబమైనా తిరుమురుగన్‌ ఆలోచనలు మాత్రం ఆకాశమంత ఎత్తున తిరుగుతుంటాయి.

పేద కుటుంబం నుంచి వచ్చిన ఈ బాలుడు పెద్ద మేధావి అనిపించుకున్నాడు. మూడో తరగతిలో బ్యాటరీ కారును తయారు చేసి తనలోని శాస్త్రవేత్తను బయటపెట్టాడు. 6వ తరగతిలో బహుళ ప్రయోజనాల రోబోను తయారుచేశాడు. గోడ తగలకుండా వెనక్కుతిరగడం, ఒక బ్లాక్‌లైన్‌ గీస్తే అందులోనే తిరగడం, గుంటలో పడకుండా వెనక్కురావడం వంటి లక్షణాలను ఈ రోబో కలిగి ఉంటుంది. రోడ్డు, నీళ్లలో ప్రయాణించే సబ్‌మెర్సిబుల్‌ కారును 8వ తరగతిలో తయారుచేశాడు.
 
ఇంట్లోలోనే కూర్చుని కంప్యూటర్‌ ద్వారా వీక్షిస్తూ రిమోట్, ఫోన్‌ సందేశాలతో పొలం పనులు నిర్వహించే రోబోను 9వ తరగతిలో సిద్ధం చేశాడు. తగిన సందేశాలు ఇస్తే ఈ రోబో భూమిని దున్ని, విత్తనాలు చల్లి, మళ్లీ మట్టికప్పుతుంది. మనుషులు ప్రవేశించలేని మ్యాన్‌హోళ్లలోకి ప్రవేశించి అక్కడి వస్తువు, మనుషులను గుర్తించగల ‘సై ప్‌బోట్‌’ ను అదే ఏడాది తయారుచేశాడు. అలాగే ఆ బాలుడు సిద్ధం చేసిన మరో రోబో ఇంట్లోని పసిపాప ఏడిస్తే వెంటనే స్పందిస్తుంది. ఏడుపు శబ్దాన్ని గ్రహిస్తూ నెట్టుకుంటూ పాప వద్దకు వెళ్లి జోలపాటను తనకు తానే ఆన్‌ చేసుకుంటుంది. ఈరోబో మేథమేటిక్స్‌ చేస్తుంది.
 
సైనిక సేవల దిశగా... తిరుమురుగన్‌
 
బాలమేధావిగా అనేక ప్రయోజనాలు కలిగిన రోబోలను తయారు చేస్తున్న నాకు దేశానికి సేవచేసే రోబోను తయారు చేయాలన్న ఆలోచన వచ్చింది. రోబోకు సంబంధించిన వార్తలను నెట్‌లో ఆసక్తిగా పరిశీలించడం నాకు అలవాటు. ఈ సమయంలో జపాన్‌ దేశం జైంట్‌ సైనిక రోబోను తయారు చేసిన వార్తను చదివాను. శాస్త్ర, సాంకేతికరంగాల్లో అగ్రస్థానంలో ఉన్న జపాన్‌ 12 అడుగుల జైంట్‌రోబోను తయారు చేయడంతో సరిపెట్టక ఇతర దేశాలకు సవాల్‌ విసిరింది. యూఎస్‌ జపాన్‌ సవాలును స్వీకరించి 15 అడుగుల రోబోను తయారుచేసేందుకు సిద్ధమయ్యారు. యూఎస్‌ రోబోను ఈ ఏడాది ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

జైంట్‌ రోబోల తయారీలో ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద ఈ రెండు దేశాలు మాత్రమే ఉన్నాయి. జపాన్‌ సవాలును ఒక భారతీయ పౌరుడిగా నేను స్వీకరించాను. యుద్ధ సైనికులు వాడగల తన 13 అడుగుల జైంట్‌ రోబోతో జపాన్‌ సరసన భారత్‌ను నిలబెట్టాలని నా కల. భారత్‌లో ఇంత వరకు 4 లేదా ఐదు అడుగుల రోబోలే గానీ జైంట్‌ రోబోను తయారు చేసినవారు లేరు. జపాన్, యూఎస్‌ల మధ్యన నెలకొన్న పోటీలో మనమెందుకు పాల్గొనగ కూడదనే ఉద్దేశంతో ఈ జైంట్‌ రోబోను తయారు చేశాను. సరిహద్దుల్లో మన సైనికులు శత్రుదేశాల ముష్కరుల దొంగదాడుల్లో అకారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. వారి భార్య, పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు. ఈ దారుణానికి సైనిక రోబోతో అడ్డుకట్టవేయాలనే ఆలోచన వచ్చింది.

ఈ ఆలోచన వెంటనే కార్యరూపం దాల్చింది. నేను తయారుచేసిన జైంట్‌రోబో 13 అడుగుల ఎత్తు, 500 నుంచి 600 కిలోల బరువు ఉంటుంది. రోబో ప్రయాణానికి మోటార్‌ సైకిల్‌ ఇంజిన్, టైర్లను వినియోగించాను. బాడీని ప్లైవుడ్‌తో చేశాను. రోబో లోపల రెండు కంపార్టుమెంట్ల అమరిక ఉంటుంది. అందులో ఇద్దరు సైనికులు అభిముఖంగా ఉంటారు. వారిలో ఒకరు రోబోను నడిపించే డ్రైవర్‌. మరొకరు వెపన్స్‌ ఆపరేటర్‌. బైక్‌ తరహాలో ఈరోబోను నడిపించవచ్చు. లోపల ఒక బటన్‌ ఉంటుంది. సైనికులు లోపలికి వెళ్లగానే ఆ బటన్‌నొక్కితే రోబో 13 అడుగుల ఎత్తుకు పెరుగుతుంది. రోబోకు ముందువైపున గన్‌మెన్, వెనుకవైపున డ్రైవర్‌ ఉంటాడు. రోబోకు నలువైపులా అమర్చిన ఆరు కెమెరాలను అనుసంధానం చేసిన ల్యాప్‌టాప్‌ గన్‌మెన్‌ వద్ద ఉంటుంది.

శత్రువుల రాకను ల్యాప్‌టాప్‌లో చూస్తూ ఎదుర్కొంటాడు. అలాగే డ్రైవర్‌ వద్ద ఉండే స్క్రీన్‌పై పరిసరాలను గమనిస్తూ రోబోను నడిపిస్తాడు. నేను ఆశించిన విధంగా 13 అడుగుల జైంట్‌ రోబో తయారైంది. నా గురువులు ఎంతో మెచ్చుకున్నారు. వారి ద్వారా అధికారిక గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాను. దేశ సరిహద్దుల్లో జవాన్లు వాడుకునే బుల్లెట్‌ ఫ్రూఫ్‌ మెటల్‌తో తయారు చేయాల్సి ఉంటుంది. యూఎస్‌ వారు తన రోబోను క్రీడా వినియోగానికి తయారుచేస్తున్నారు. జపాన్‌ వారు మిలిటరీ, క్రీడా వినియోగానికి అనుగుణంగా తయారు చేశారు. ఈ ఆసక్తి ఎలా కలిగింది అనే ప్రశ్నకు...నాన్న నా చిన్నప్పుడు టీవీ, డీవీడీలు రిపేరు చేస్తూంటే చూసేవాడిని, బ్యాటరీ లైటుకు పెడితే వెలుగుతుంది, అదే బ్యాటరీ మోటార్‌కు పెడితే పరుగులు తీస్తుంది ఇలా ఆలోచిస్తూ ఈ ప్రయోగాలన్నీ చేశాను అన్నాడు.
 
 
మురుగన్‌ సాధించిన అవార్డులు: 8వ తరగతిలో (2012) సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో టాప్‌–10లో ఎంపిక, రూ.2వేల నగదు బహుమతి. 9వ తరగతిలో వ్యవసాయ రోబోకు మొదటి బహుమతి. లైన్‌ఫాలోయర్‌ వెహికల్‌కు మొదటి బహుమతి. దేవాంగుల కోసం తయారుచేసిన పొల్యూషన్‌ ఫ్రీ వెహికల్‌కు ఫస్ట్‌ ప్రైజ్‌. వేలూరు విట్‌ యూనివర్సిటీవారు నిర్వహించిన జాతీయస్థాయి సైన్స్‌ పోటీల్లో 3వ స్థానంతోపాటు రూ.7వేల నగదు బహుమతి. 10వ తరగతిలో యంగ్‌ సైంటిస్టు అవార్డు.
 
కడుపు మాడ్చుకుని సహకారం: సెల్వి
 
నా భర్త నెలకు రూ.20వేలు పంపుతాడు. ఈ డబ్బుతోనే మా కుటుంబం బతకాలి. ఇద్దరి పిల్లల చదువులు, ఇంటిబాడుగ కుటుంబ అవసరాలకే ఆ డబ్బు చాలడం లేదు. నా కొడుకులోని ఆసక్తిని గమనించి కడుపుమాడ్చుకుని ప్రోత్సహిస్తున్నాను. నాబిడ్డ రకరకాల ప్రయోగాలకు నెలకు కనీసం రూ.5వేలు ఖర్చు అవుతుంది. తల్లిగా ప్రోత్సహిస్తే పెద్ద శాస్త్రవేత్త అవుతాడని ఆశ. ఎంతో నమ్మకం. సైనిక రోబో తయారీకి అవసరమైన డబ్బును సమకూర్చలేక పోయింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ‘అజంతా’ శంకరావు రూ.20 వేల ఆర్థిక సహకారం చేసి ప్రోత్సహిచండం వల్ల దానిని పూర్తి చేయగలిగాడు. మరింత ఆర్థిక సహకారం అందితే ఈ పేదింటి బిడ్డ గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగి దేశానికి సేవ చేయగలడు. నా బిడ్డను ప్రోత్సహించాల్సిందిగా పెద్ద మనస్సున్న దాతలను ప్రార్థిస్తున్నాను. నా ఫోన్‌ నంబర్‌..9790958697.
మరిన్ని వార్తలు