ఐటీ వలయం

11 Apr, 2017 03:20 IST|Sakshi
ఐటీ వలయం

మాజీ ఎంపీ రాజేంద్రన్, నటుడు శరత్‌కుమార్‌ హాజరు
ఆర్కేనగర్‌లో రూ.89 కోట్ల పంపిణీలో రాష్ట్ర మంత్రుల పాత్ర


ఆర్కేనగర్‌లో ఉప ఎన్నికల పుణ్యమా అని పలువురు అధికార పార్టీ ప్రముఖులు ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ వలయంలో చిక్కుకున్నారు. రూ.89 కోట్లు ఖర్చు చేసినట్లు ఆదాయపు పన్ను శాఖాధికారులకు ఆధారాలు దొరికిన నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్‌ విజయభాస్కర్, మాజీ ఎంపీ సిటిలంపాక్కం రాజేంద్రన్, సమత్తువ మక్కల్‌ కట్చి అధ్యక్షుడు, నటుడు శరత్‌కుమార్‌ చిక్కుల్లో పడ్డారు. ఐటీ శాఖ నుంచి నోటీసులు అందుకుని సోమవారం విచారణకు హాజరయ్యారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్‌ ఎన్నికల్లో అన్నాడీంకే(అమ్మ) అభ్యర్థి దినకరన్‌ భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నాడని, ఓటర్లకు డబ్బు పంచుతున్నాడని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, డీఎంకే, బీజేపీలు ఎన్నికల కమిషన్‌కు పదేపదే ఫిర్యాదులు చేశాయి. ఎన్నికల కమిషన్‌ ఆరాతీయడంతో నిజమేనని తేలింది. దీంతో ఈ నెల 7వ తేదీన ఆదాయపు పన్ను శాఖాధికారులు 35 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అధికార ప్రభుత్వానికి చెందిన వారిని లక్ష్యంగా వైద్య మంత్రి విజయభాస్కర్‌ సహా పలువురి ఇళ్లు, కార్యాలయాలపై దాడులు సాగాయి.

 తమ ఇంటి నుంచి కనీసం రూ.10 వేలు కూడా స్వాధీనం చేసుకోలేదని ఐటీ దాడుల రోజు మంత్రి విజయభాస్కర్‌ మీడియా ముందు బుకాయించారు. అయితే ఆర్కేనగర్‌లో రూ.89 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులకు పెద్ద ఎత్తున ఆధారాలు దొరికాయి. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి సహా ఏడుగురు మంత్రులు, ఎంపీ వైద్యలింగం తదితరులు 33193 మంది ఓటర్లకు రూ.13.27 కోట్లు పంచినట్లు తెలుసుకున్నారు. మంత్రి సెంగోట్టయ్యన్‌ బృందం 32,830 మందికి రూ.13.13 కోట్లు పంపకాలు సాగించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.

అంతేగాక మంత్రులు దిండుగల్లు శ్రీనివాసన్‌ రూ.12.83 కోట్లు, తంగమణి రూ.12.67 కోట్లు వేలుమణి రూ.14.91 కోట్లు, జయకుమార్‌ బృందం రూ.11.68 కోట్లు,  మాజీ మంత్రి వైద్యలింగం బృందం రూ.11.13 కోట్లు లెక్కన ఓటర్లకు పందేరం చేసినట్లు ఐటీ అధికారులు తేల్చారు. అంతేగాక మంత్రి విజయభాస్కర్, ఆయన అనుచరుల ఇళ్లలో రూ.4.5 కోట్లు నగదు లభ్యమైంది. ఒక మంత్రి, అధికార పార్టీకి చెందిన వారి ఇళ్ల నుంచి రూ.89 కోట్ల మేర ఆధారాలు లభించడం రాష్ట్ర రాజకీయ వర్గాలను నిశ్చేష్టులను చేసింది. పైగా ఈ వివరాలు సామాజిక మాధ్యమాల ప్రచారం కావడంతో ప్రజల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది.

మంత్రి సహా అందరికీ నోటీసులు
ఈ నెల 7వ తేదీన జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో సోమవారం తమ కార్యాలయానికి హాజరు కావాల్సిందిగా మంత్రి విజయభాస్కర్, మాజీ ఎంపీ రాజేంద్రన్, ఎంజీఆర్‌ మెడికల్‌ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌ గీతాలక్ష్మి, సమక అధ్యక్షుడు, నటుడు శరత్‌కుమార్‌లకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు మంత్రి విజయభాస్కర్‌ తదితరులు చెన్నై నుంగంబాక్కంలోని ఐటీ ప్రధాన కార్యాలయానికి వచ్చి అధికారుల ముందు హాజరయ్యారు.

 సరిగ్గా 11 గంటలకు మంత్రి విజయభాస్కర్, 11.30 గంటలకు శరత్‌కుమార్‌ వేర్వేరుగా చేరుకోగా నిజానిజాలను రాబట్టుకునేందుకు అధికారులు తీవ్రస్థాయిలో విచారణ జరిపినట్లు సమాచారం. ఒక మంత్రిని ఐటీ అధికారులు కార్యాలయానికి పిలిపించుకుని నిందితునిలా విచారించడం సంచలనమైంది. అలాగే మిగిలిన వారిని సైతం విచారించారు. మంత్రి సహా పలువురు ప్రముఖులు విచారణకు హాజరవుతున్న సందర్భంగా ఐటీ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

 మంత్రి నుంచి రూ.5లక్షలు పుచ్చుకుంది నిజమే
మంత్రి విజయభాస్కర్‌ నుంచి రూ.5 లక్షలను పుచ్చుకుంది నిజమేనని ప్రభుత్వ వైద్యుడు బాలాజీ మరో సంచలన ప్రకటన చేశారు. అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో ఉప ఎన్నికలు వచ్చాయి. జయ వేలిముద్రలతో అన్నాడీఎంకే అభ్యర్థులకు బీఫారం జారీచేశారు. ఈ వేలిముద్రలకు ప్రభుత్వ వైద్యుడు బాలాజీ సాక్షి సంతకం చేశారు.

 ఐటీ దాడుల సమయంలో అధికారులకు లభించిన ఆధారాల్లో రూ.5 లక్షలను జయలలిత వేలిముద్రలకు సాక్షి సంతకం చేసిన ప్రభుత్వ వైద్యుడు బాలాజీకి చెల్లించినట్లు పేర్కొని ఉంది. దీనిపై డాక్టర్‌ బాలాజీ మాట్లాడుతూ, మంత్రి విజయభాస్కర్‌ అనుచరుల నుంచి గత ఏడాది నవంబరు 1వ తేదీన రూ.5 లక్షలు పొందానని అంగీకరించాడు. అయితే ఈ సొమ్ము లండన్‌ డాక్టర్‌ హోటల్‌ ఖర్చుల కోసం స్వీకరించానని వివరించారు.

సీఎం, మంత్రులపై సీబీఐ కేసు పెట్టాలి
ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఇతర మంత్రుల అవినీతి, అక్రమాల బండారం బట్టయలైందని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించి, కోట్లాది రూపాయల నగదు బట్వాడా చేసిన సీఎం, మంత్రులపై సీబీఐ విచారణకు ఎన్నికల కమిషన్‌ సిఫార్సు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఐటీ దాడుల్లో అక్రమార్కులుగా తేలిన 9 మంది మంత్రులను అరెస్ట్‌ చేయాలని టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌ డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు