ఓటు అడిగితే.... రోడ్డు చూపండి

20 Aug, 2015 01:39 IST|Sakshi
ఓటు అడిగితే.... రోడ్డు చూపండి

‘నో రోడ్-నో ఓట్’ క్యాంపైన్‌ను ప్రారంభించిన విద్యాశ్రీ
నెటిజెన్ల నుంచి అనూహ్య స్పందన
నాలుగు రోజుల్లో 1.35 లక్షలకు పైగా లైక్‌లు

 
బెంగళూరు : బెంగళూరులో ప్రస్తుతం బీబీఎంపీ ఎన్నికల వేడి పెరుగుతోంది. నగరానికి ‘అద్భుత నగిషీలు’ చెక్కి సమస్యలన్నింటినీ పరిష్కరించేస్తామని అన్ని పార్టీలు హామీల వర్షాలను గుప్పిస్తున్నాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నుంచి కేంద్ర మంత్రుల దాకా ప్రతి ఒక్కరూ ఉద్యాననగరి వాసులపై వరాల జల్లులు కురిపిస్తున్నారు. అయితే ప్రతి ఎన్నికల తరహాలోనూ ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఎన్నికల హామీలు చెత్తబుట్టల్లోకి చేరిపోతాయనేది నగర వాసుల ఆవేదన. ఇలాంటి ఓ నగరవాసి ఆవేదన నుంచి ప్రారంభమైనదే ‘నో రోడ్-నో ఓట్’ క్యాంపైన్. నగరంలోని రాజరాజేశ్వరి నగర ప్రాంతానికి చెందిన 23ఏళ్ల విద్యాశ్రీ ఈ క్యాంపైన్‌ను ప్రారంభించారు. నాలుగు రోజుల క్రితం విద్యాశ్రీ ప్రారంభించిన ఈ క్యాంపైన్‌కు ప్రస్తుతం నెటిజన్‌ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఆమె నుంచి స్ఫూర్తి పొందిన ఎంతో మంది ఈ క్యాంపైన్‌లో తమ వంతు భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు.

 ఎలా మొదలైందీ క్యాంపైన్....
 బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర ప్రాంతానికి చెందిన విద్యాశ్రీ ఓ ప్రైవేటు విద్యా సంస్థలో ఆర్ట్ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. విధులకు హాజరయ్యేందుకు ప్రతి రోజు తన సొంత వాహనంలో దాదాపు 15కిలోమీటర్ల మేర ఆమె ప్రయాణిస్తుంటారు. రాజరాజేశ్వరి నగరలో రోడ్ల దుస్థితి కారణంగా తన ప్రయాణంలో ప్రతి రోజు ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూనే వస్తున్నారు. కొన్ని సార్లు రోడ్ల దుస్థితి ప్రమాదాలకు దారి తీసిన సందర్భాలను ఆమె చవి చూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ రాజకీయ నేతల్లో రోడ్ల దుస్థితిపై జాగృతి కల్పించడంతో పాటు రోడ్ల దుస్థితి కారణంగా సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియజెప్పేందుకు గాను ‘నో రోడ్-నో వోట్’ పేరిట నాలుగు రోజుల క్రితం ఆమె ఈ క్యాంపైన్‌ను ప్రారంభించారు.

 నెటిజన్‌ల నుంచి అనూహ్య స్పందన.....
 విద్యాశ్రీ ప్రారంభించిన ఈ క్యాంపైన్‌కు ఆమె స్నేహితులు చంద్రు, నేహాల్ మద్దతుగా నిలిచారు. నగరంలోని రోడ్ల దుస్థితిని తెలియజేస్తూ సోషల్ నెట్‌వర్కింగ్  సైట్‌లో ఆ ఫొటోలను పోస్ట్ చేస్తూ వచ్చారు. వీరు ప్రారంభించిన ఈ కార్యక్రమానికి నెటిజన్‌ల నుంచి అనూహ్య స్పందన లభించింది. నాలుగు రోజుల్లోనే విద్యాశ్రీ క్యాంపెన్‌ను ప్రశంసిస్తూ 1.35 లక్షల మంది ఆమె ఫేస్‌బక్ పేజ్‌ను‘లైక్’ చేశారు అంతేకాక విద్యాశ్రీ చేస్తున్న క్యాంపైన్‌కి తమ మద్ధతును తెలియజేసేందుకు ముందుకు వచ్చి తమ తమ ప్రాంతాల్లోని రోడ్ల దుస్థితిని తెలియజేసేలా ఫొటోలు తీసి వాటిని ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేస్తున్నారు.

 ప్రశ్నించమనే అడుగుతున్నాను....
 ‘నగరంలోని రోడ్ల దుస్థితిని నేతల దృష్టికి తీసుకొచ్చేందుకే నేను ఈ క్యాంపైన్‌ని ప్రారంభించాను. సామాన్య ప్రజలు ఎన్నికల సమయంలో మాత్రమే  రాజకీయ నాయకులకు కనిపిస్తారు. అందుకే నగర వాసులందరినీ నేను కోరేది ఒక్కటే...మీ ఇంటి దగ్గరికి ఓట్లు అడిగేందుకు వచ్చే నాయకులందరినీ(పార్టీలతో సంబంధం లేకుండా) మీ ప్రాంతంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిందిగా కోరండి. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లోని రోడ్లను అభివృద్ధి చేసిన వారికే మీ ఓటు వేస్తామని చెప్పండి. ఈ క్యాంపైన్ ద్వారా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు అభివృద్ధి చెందినా చాలు. అలాగని పూర్తిగా ఓటింగ్‌కు దూరంగా ఉండమని కూడా నేను చెప్పడం లేదు. ఓటు అడగానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ రోడ్ల దుస్థితిని తెలియజేసే, రోడ్డును అభివృద్ధి చేసే వారికే ఓటు వేస్తామని చెప్పేలా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడమే నా క్యాంపైన్ లక్ష్యం.’                 - విద్యాశ్రీ, ఆర్ట్ టీచర్
 

మరిన్ని వార్తలు