‘కావేరి’ని కాపాడుకోకపోతే నీటికి కటకట

14 Sep, 2013 01:51 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కావేరి నదిలో నీరు లేకపోతే బెంగళూరు నగరంలో జన జీవనం ముందుకు సాగదని, కనుక ఆ నదిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు పుండలీక హాలంబి అభిప్రాయపడ్డారు. ‘కావేరి జల విద్యుత్ యోజన-కర్ణాటక వాటా-సమస్యలు’ అనే అంశంపై బెంగళూరులోని చామరాజపేటలో ఉన్న కన్నడ సాహిత్య పరిషత్‌లో కావేరి కన్నడ హిత రక్షణా సమితి శుక్రవారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసంగించారు.

దశాబ్దాలుగా కన్నడిగులు నీటి కోసం అడుక్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత సమాఖ్యలో కర్ణాటక కొనసాగాలంటే కన్నడిగులకు న్యాయంగా దక్కాల్సిన వాటాను కేంద్రం అందజేయాలని డిమాండ్ చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు పలు సదుపాయాలను కల్పిస్తున్న కేంద్రం, కర్ణాటక విషయంలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత దేశంలో ఒక రాష్ర్టంగా కర్ణాటక మనుగడ సాగించాలా అనే సందేహం తలెత్తుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

రాష్ర్ట సమస్యలపై స్పందించనప్పుడు ఎంపీలందరూ రాజీ నామాలను కేంద్రం ముఖాన కొట్టి రావాలని డిమాండ్ చేశారు. అలాంటి ఎంపీలకు కన్నడిగులందరూ మద్దతునిస్తారని ఆయన భరోసా ఇచ్చారు. బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ. మోహన్ మాట్లాడుతూ కన్నడ భాష, భూ, జల విషయాల్లో ఎల్లప్పుడూ కన్నడిగుల తరఫున పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీ అశ్వత్థ నారాయణ మాట్లాడుతూ కావేరి జల విద్యుదుత్పానపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లేవనెత్తిన అభ్యంతరాలను కేంద్రం పట్టించుకోకూడదని డిమాండ్ చేశారు.
 

మరిన్ని వార్తలు