-

దేవుడే పంపించాడు

18 Jan, 2016 01:56 IST|Sakshi
దేవుడే పంపించాడు

మనుషుల్లో మానవత్వాన్ని పెంపొందించి రమ్మని భగవంతుడే తుపాన్‌ను పంపించారని ఇసైజ్ఞాని ఇళయరాజా వ్యాఖ్యానించారు. ఇటీవల తమిళనాడును తుపాన్ కుదిపేసిన విషయం తెలిసిందే. బాధితులను పలువురు పలు విధాలుగా ఆదుకునే ప్రయత్నం చేశారు. వారందరికి ధన్యవాదాలు తెలిపి ప్రసంశా పత్రాలను అందించే కార్యక్రమం గురువారం ఉదయం స్థానిక ఎగ్మోర్‌లోని ఎతిరాజ్ కళాశాల ఆవరణలో జరిగింది.
 
 ఇందులో ఇళయరాజా, నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ముఖ్య అతిథులుగా పాల్గొని వరద బాధితులకు ఆపన్న హస్తం అందించిన వారిని అభినందించారు. ఇళయరాజా మాట్లాడుతూ ఇటీవల వచ్చిన తుపాన్ చాలా మందిని బాధించిన మాట వాస్తవం అన్నారు. మరో పక్క అది మనుషుల్లోని మానవత్వాన్ని మేలుకొలపడానికి దోహద పడిందని వ్యాఖ్యానించారు. ప్రతి వ్యక్తిలోనూ మానవత్వం దాగి ఉంటుందని, దాన్ని ముందుగానే ప్రదర్శించి ఉంటే ఈ తుపాన్ వచ్చి ఉండేది కాదని అన్నారు.
 
 వానలు, వరదలు లాంటివి భగవంతుని ఆదేశానుసారంగా వస్తుంటాయన్నారు. ఆ భగవంతుడే మనుషుల్లోని మానవత్వాన్ని మేలుకొలిపి రమ్మని తుపాన్‌కు చెప్పి పంపించారని అన్నారు. తాను ప్రజల మధ్య ఉండటానికి ఇష్టపడనని అలాంటిది వరద బాధితులను కలుసుకోవడానికి సాహసించడం అన్నది భావమే కారణం అన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ఈ తుపాన్ సూచించిందన్నారు. అయితే అది దాని వల్ల కలిగిన నష్టం మాత్రం పూడ్చలేనిదని ఇళయరాజా అన్నారు.
 

మరిన్ని వార్తలు