కత్తి చిచ్చు

19 Sep, 2014 01:34 IST|Sakshi
కత్తి చిచ్చు

సాక్షి, చెన్నై: ఇళయదళపతి విజయ్ నటించిన కత్తి చిత్రం విడుదలలో చిచ్చు రాజుకుంది. తమిళ సంఘాలు ఆడియో విడుదలను అడ్డుకునేం దుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనతో విజయ్ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్, సమంత జంటగా కత్తి చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్ర నిర్మాత ల్లో ఒకరు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే బినామీ అన్న ప్రచారం రాష్ట్రంలో ఊపందుకుంది. ఈ వ్యవహారం కత్తి సినిమా విడుదలను ప్రశ్నార్థకం చేసే పరిస్థితులకు దారి తీస్తోంది. ఈ చిత్రానికి వ్యతిరేకంగా కోర్టుల్లో తమిళ సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే ఆ సంఘాలకు చేదు అనుభవం తప్పలేదు. మార్గం సుగమం కావడంతో దీపావళిని పురస్కరించుకుని చిత్రం విడుదలకు సన్నాహాలు ఆరంభమయ్యాయి. ఈ పరిస్థితుల్లో గురువారం కత్తి ఆడియో విడుదలకు నిర్ణయించారు. రాజా అన్నామలైపురంలోని ఓ హోటల్లో ఆడియో ఆవిష్కరణకు సర్వం సిద్ధం చేశారు. అయితే దీనిని అడ్డుకునేందుకు తమిళ సంఘాలు సిద్ధమయ్యాయి.
 
 రాజుకుంది : సద్ధుమణిగిందన్న వివాదం మళ్లీ రాజుకుంది. ఆడియో ఆవిష్కరణను అడ్డుకునేందుకు తమిళ సంఘాలు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆడియో ఆవిష్కరణ నిమిత్తం రాజా అన్నామలైపురం పరిసరాల్లో చిత్ర యూనిట్, విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఫ్లెక్సీలు, బ్యానర్లతో హోరెత్తించారు. సాయంత్రం మరి కాసేపట్లో ఆడియో విడుదల జరగనున్న సమయంలో తమిళ సంఘాలు రెచ్చిపోయాయి. ముందస్తుగా ఆ హోటల్ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తమిళ సంఘాలు అటు వైపుగా రానీయకుండా కట్టడి చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. అయినా కొందరు ఆందోళనకారులు పోలీసుల వలయాన్ని చేధిస్తూ తమ ప్రతాపాన్ని చూపించారను. ఆడియో విడుదలను అడ్డుకునే విధంగా ఆ హోటల్ వైపుగా చొచ్చుకెళ్లే యత్నం చేశారు.
 
 అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాగ్వాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు అక్కడి ఫ్లెక్సీలు, బ్యానర్‌లను చించి, ధ్వంసం చేసి, తగులబెట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు యత్నించారు. చివరకు తమిళ సంఘాల నాయకులను అరెస్టు చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. మళ్లీ అటువైపుగా ఆందోళనకారులు రాకుండా ఆ మార్గాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. చివరకు గట్టి భద్రత నడుమ కత్తి  ఆడియో ఆవిష్కరణ సజావుగా సాగింది. తమిళ సంఘాల తీరును విజయ్ అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ కత్తి చిచ్చు ఎలాంటి పరిస్థితులకు దారి తీయనున్నదో వేచి చూడాల్సిందే.  
 

మరిన్ని వార్తలు