ఉన్నత విద్యకు ప్రాధాన్యం

23 Nov, 2013 01:55 IST|Sakshi

టీ.నగర్, న్యూస్‌లైన్:  రాష్ట్రంలో ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత పేర్కొన్నారు. మద్రాసు విశ్వ విద్యాలయం సెంటినరీ హాలులో శుక్రవారం అన్నా వర్సిటీ 34వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ రోశయ్య, ముఖ్యమంత్రి జయలలిత, ఉన్నత విద్యాశాఖ మంత్రి పి.పళనియప్పన్, అన్నావర్సిటీ వైస్ చాన్సలర్ ఎం.రాజారాం, సిటీ సిండికేట్ - సెనేట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భం గా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించడంలో అన్నా విశ్వ విద్యాలయం తలమానికంగా నిలిచిందన్నారు. ఇక్కడ విద్యను అభ్యసించి పట్టాలను అందుకోవడం విద్యార్థులు అదృష్టంగా భావించాలన్నారు. భారతదేశంలో  విజ్ఞాన సముపార్జనలో తమిళనాడు ముందంజలో ఉందన్నారు.

తమ ప్రభుత్వం ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, విద్యార్థులకు ఆర్థిక సాయంతో పాటు అనేక ప్రోత్సాహకాలు అందజేస్తోందన్నారు. విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో ల్యాప్‌టాప్‌లను ఉచితంగా ఇస్తున్నామని వివరించారు. గ్రామీణ విద్యార్థుల విద్యావసరాల కోసం కొత్తగా నాలుగు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలను ఈ ఏడాదిలో ఏర్పాటుచేశామని చెప్పారు. మానవ వనరుల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు ఉన్నత స్థానాలు సాధించి తల్లిదండ్రులు, కళాశాలలకు పేరు తీసుకురావాలని కోరారు. అదేవిధంగా నూతన ఆలోచనలతో సరికొత్త అన్వేషణలు సాగించాలని పిలుపునిచ్చారు. తర్వాత 690 మంది పీహెచ్‌డీ పట్టభద్రులు, మొదటి ర్యాంకులు పొందిన 114 ఇంజినీరింగ్ పట్టభద్రులకు గవర్నర్ పట్టాలను, పుస్తకాలను అందచేశారు.

>
మరిన్ని వార్తలు