నగరంలో హగ్‌ఏ ట్రీ కార్యక్రమం

24 Apr, 2015 23:48 IST|Sakshi

- చెట్ల సంఖ్య తగ్గకుండా చూడటమే లక్ష్యం
- నిర్వహిస్తున్న కంపాషనేట్ లివింగ్ సంస్థ
- సహకరిస్తున్న స్కూలు పిల్లలు,ఆర్‌డబ్ల్యూఏ
- సర్వోదయ ఎన్‌క్లేవ్‌లో విజయవంతం
సాక్షి, న్యూఢిల్లీ:
నియంత్రణలేని పట్టణీకరణ కారణంగా నగరంలో చెట్ల సంఖ్య తగ్గిపోతూ కాలుష్యం పెరుగుతోంది. ఈ విషయం పై అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ నగరంలో చెట్లను రక్షించే బాధ్యతను మాత్రం కొంతమంది మాత్రమే స్వీకరిస్తున్నారు. అందులో కంపాషనేట్ లివింగ్ అనే ఎన్జీవో ఒకటి. సర్వోదయ ఎన్‌క్లేవ్‌లోని ఈఎన్‌జీఓ నగరంలో చెట్లను లెక్కించే పని చేపట్టింది.

పాఠశాల పిల్లలు, ఆర్‌డబ్ల్యూఏల సహకారంతో ఈ కార్యక్రమం చేస్తోంది. ఇందులో భాగంగానే హగ్‌ఏ ట్రీ కార్యక్రమాన్ని  ఆర్‌కేపురంలోని రామ్‌జస్ స్కూలు ఎకో క్లబ్‌తో కలిసి చేపట్టింది. నగరంలో పచ్చదనాన్ని కాపాడుకోవడానికి, చెట్లు తగ్గకుండా చూడడానికి వాటి సంఖ్యను లెక్కించడం ఎంతో ముఖ్యం. ఎన్‌డీఎంసీ ప్రాంతంలోని రోడ్లపక్క నున్న చెట్ల సంఖ్యను లెక్కించే పనిని 2005లో, 2010లో చేపట్టినప్పకీ మిగతా ఢిల్లీలో ఈ పనిని ఏ ప్రభుత్వ సంస్థ చేపట్టడం లేదు.

ఈ విషయాన్ని గుర్తించిన కొందరు పౌరులు కంపాషనేట్ లివింగ్ ఆధ్వర్యంలో చెట్టు లెక్కించే పని చేపట్టారు. చెట్ల సంఖ్యను లెక్కిస్తూ ఒక్కొక్క చెట్టుకు గుర్తింపు ఇచ్చే పనిని సర్వోదయ ఎన్‌క్లేవ్‌లో విజయవంతంగా నిర్వహించారు. ఆ తరువాత ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి గార్డెన్ అండ్ పార్క్స్ సొసైటీ ద్వారా నగరంలోని పలు పార్కులు, కొన్ని కాలనీలలోనున్న చెట్లను లెక్కిస్తోంది. చెట్లను లెక్కించే గ్రూపులకు చెట్లపై గుర్తు వేయడం కోసం సొసైటీ పెయింట్‌ను ఉచితంగా అందిస్తోంది.

మరిన్ని వార్తలు