ఇవ్వాల్సిందే...

3 Dec, 2013 03:01 IST|Sakshi

 =టన్ను చెరకుకు రూ.2,400 చెల్లించాల్సిందే
 =ఉల్లంఘిస్తే ‘ఫ్యాక్టరీ’లపై కఠిన చర్యలు
 =అధ్యయనం తర్వాతనే ఆ ధర నిర్ణయం
 =మూర్ఖత్వంతోనే ‘ప్రత్యేక’ డిమాండ్  : సీఎం సిద్ధు

 
మైసూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలోని చక్కెర ఫ్యాక్టరీలు టన్ను చెరకుకు రూ.2,400 వంతున రైతులకు చెల్లించి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని టీ. నరసీపుర తాలూకా తలకాడులో ఆయన పురాణ ప్రసిద్ధి పొందిన పంచ లింగ దర్శనం ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

టన్ను చెరకుకు రూ.2,500 చొప్పున చెల్లించడం సాధ్యం కాదని చక్కెర మిల్లుల యజమానులు చెప్పడాన్ని ప్రస్తావించినప్పుడు, ప్రభుత్వం అన్ని రకాలుగా అధ్యయనం చేసిన తర్వాతనే కొనుగోలు ధరను నిర్ణయించిందని చెప్పారు. కనుక ఈ ఆదేశాలను ఎవరూ ఉల్లంఘించకూడదన్నారు. ఒక వేళ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి టన్నుకు కర్మాగారాలు రూ.2,400 చెల్లించాలని, దీనికి అదనంగా రూ. వందతో పాటు రూ.150 ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందిస్తుందని వివరించారు.
 
 ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌పై మండిపాటు
 ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ మాదిరే కర్ణాటకను కూడా విభజించాలని బెల్గాం జిల్లాకు చెందిన మాజీ మంత్రి  ఉమేశ్ కత్తి డిమాండ్ చేయడాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు. ఆయన మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారని మండి పడ్డారు. ఇలాంటి డిమాండ్ల ద్వారా ఆయనకు గౌరవం పెరగదని అన్నారు.
 

మరిన్ని వార్తలు