ముంబై లో మరో ‘వెదర్ డాప్లర్ రాడార్’

13 May, 2015 00:03 IST|Sakshi

- ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం
- నగర శివారులో నిర్మాణానికి కసరత్తు
సాక్షి, ముంబై:
వాతావరణ వివరాలు తెలుసుకునేందుకు ముంబైలో మరో ‘వెదర్ డాప్లర్ రాడార్’ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నగర శివారు ప్రాంతంలోని ఓ కొండపై ఈ డాప్లర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వాతావరణ శాఖ డిప్యూటీ డెరైక్టర్ కృష్ణనంద హోసాల్కర్ తెలిపారు. మొదటి రాడార్ ఏర్పాటు చేసిన ప్రాంతంలో భవనాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండటంతో రెండో డాప్లర్‌ను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. 2005 జూలై 26న కురిసిన భారీ వర్షాలకు నగరం, శివారు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఘటనలో దాదాపు రెండు మంది ప్రాణాలు పోగా కోట్ల రూపాయల్లో ఆస్తి నష్టం వాటిళ్లింది. వర్షాలు, వరదలపై ముంద స్తు హెచ్చరికలు జారీ చేయలేదని వాతావరణ శాఖపై విమర్శలు వెల్లువెత్తాయి.

దీంతో వాతావరణ వివరాలు కచ్చితంగా తెలుసుకునేందుకు కొలాబా నేవీ నగరంలోని అర్చన భవనంపై రూ. 35 కోట్లు విలువచేసే వెదర్ డాప్లర్ రాడార్‌ను ఏర్పాటు చేశారు. డాప్లర్ ఏర్పాటు చేయడంవల్ల ఈ ప్రాంతంలో ఎత్తై భవనాలు నిర్మించడానికి వీలులేకుండా పోయింది. 15 టన్నుల బరువైన ఈ రాడార్ నుంచి వెలువడే రేడియేషన్ వల్ల చుట్టపక్కల ఉన్న బహుళ అంతస్తుల భవనాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. దీంతో బిల్డర్ లాబీలు 2014లో హైకోర్టును ఆశ్రయించాయి.

రాడార్‌ను మరోచోటికి మార్చాలని ప్రభుత్వం, బీఎంసీ, వాతావరణ శాఖను కోర్టు ఆదేశించింది. రాడార్‌ను శివారు ప్రాంతానికి తరలించడానికి బిల్డర్ లాబీలు అనేక ప్రయత్నాలు చేశాయి. అందుకు అవసరమైన సాయం చేసేందుకు కూడా సిద్ధపడ్డాయి. కానీ రాడార్‌ను చే యడం సాధ్యం కాదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో రెండో రాడార్ ఏర్పాటుకు పనులు వేగవంతం చేశారు. రాయ్‌గడ్, ఠాణే జిల్లాల్లో దీన్ని ఏర్పాటు చేయాలని స్థల సేకరణ పనులు పూర్తిచేశారు. అయితే రాడార్‌ను ముంబైలోనే ఏర్పాటుచేయాలని వాతావరణ శాఖ పట్టుబట్టింది. దీంతో కొద్ది నెలలుగా స్థల సేకరణ పనులు చేపట్టగా ఎట్టకేలకు ఉప నగరంలో స్థలాన్ని నిర్ణయించారు. 

మరిన్ని వార్తలు