రైల్వే స్టేషన్‌లో తెగిన ఓవర్ హెడ్ వైర్

22 May, 2015 23:51 IST|Sakshi
రైల్వే స్టేషన్‌లో తెగిన ఓవర్ హెడ్ వైర్

- థానేలో ఘటన.. పలు లోకల్ రైళ్లు రద్దు
- తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు
- ఆలస్యంగా ముంబై చేరుకున్న పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు
సాక్షి, ముంబై:
థానేలో శుక్రవారం ఉదయం ఫ్లాట్ నెంబరు రెండు వద్ద ఓవర్‌హెడ్ వైర్ తెగిపోవడంతో కొన్ని లోకల్ రైళ్లు రద్దు కాగా, మరి కొన్ని దారి మళ్లించి నడిపినట్లు అధికారులు తెలిపారు. వైర్ తెగిపోవడంతో స్లో అప్, డౌన్ లోకల్ రైళ్లతోపాటు మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఉదయం 9.53 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది హుటాహుటిన ఓవర్‌హెడ్ వైరుకు మరమ్మతు పనులు ప్రారంభించారు.

ఈ పనుల కోసం విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో థానే రైల్వేస్టేషన్‌లోని ఫ్లాట్‌ఫాం నెంబరు ఒకటి, రెండు, మూడు, నాలుగుపై లోకల్ రైళ్ల సేవలు ఆగిపోయాయి. అనంతరం స్లో లోకల్ రైళ్లన్నింటిని ఫాస్ట్ అప్, డౌన్ ట్రాక్‌లపై మళ్లించి నడిపించారు. సుమారు రెండు గంటల తర్వాత నాలుగో నెంబర్ ఫ్లాట్‌ఫాంపై ముంబై సీఎస్‌టీ వైపు స్లోలోకల్ రైళ్లను ప్రారంభించారు. మిగిలిన ఫ్లాట్‌ఫాంలపై చాలా సేపు లోకల్ రైళ్లు నడవలేదు. వీటన్నింటి కారణంగా దూరప్రాంతాల నుంచి వచ్చే మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా ముంబైకి చేరుకున్నాయి. కల్వా-థానే మధ్య లోకల్ రైలు రద్దు కావడంతో అనేక మంది కాలిబాటన థానే వరకు నడుచుకుంటూ వెళ్లారు. రైలు నిలిపివేయడంపై ప్రయాణికులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా థానే రైల్వే పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగిన సమయంలో కోపోద్రిక్తులైన ప్రయాణికులు మోటర్‌మెన్, గార్డులపై దాడి జరిపిన సంఘటనలు అనేకం ఉన్నాయి. పాత ఘటనల దృష్ట్యా రైలు నడిపే మోటర్‌మెన్, గార్డుల వద్ద పోలీసులను భద్రత కోసం ఏర్పాటు చేశారు. కాగా, రైళ్లు ఆలస్యంగా నడవడంతోపాటు కొన్నింటిని రద్దు చేయడంతో రద్దీ తీవ్రంగా పెరిగింది. థానే రైల్వేస్టేషన్‌లోని ఐదు, ఆరో నంబరు ఫ్లాట్‌ఫాంలన్ని ప్రయాణికులతో నిండిపోయాయి. వైర్ తెగిపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

మరిన్ని వార్తలు