...అవి ప్రభుత్వ హత్యలే..

18 Feb, 2015 02:24 IST|Sakshi

రెండేళ్లలో 132 మంది రైతుల బలవన్మరణం
జేడీఎస్ అధ్యక్షుడు హెచ్.డి.కుమారస్వామి

 
బెంగళూరు : రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 132 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని జేడీఎస్ పార్టీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు హెచ్.డి.కుమారస్వామి తెలిపారు. రెండేళ్లుగా ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలవల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడం ద్వారా రైతులను ఆత్మహత్యలవైపు పురిగొల్పడంతో ఇవన్నీ ప్రభుత్వం సాగించిన హత్యలుగానే పరిగణిస్తున్నట్లు చెప్పారు. తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లిలో స్థానిక ఎమ్మెల్యే సి.బి.సురేష్ జన్మదినోత్సవ వేడుకల్లో ఆయన మంగళవారం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా 17వందల మందికి సామూహిక సీమంతాలు నిర్వహించారు. అనంతరం మీడియాతో కుమారస్వామి మాట్లాడుతూ... సరైన సమయంలో రైతులకు పంట రుణాలను అందించడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించారు. దీంతో వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రైవేట్ వ్యక్తుల అధిక వడ్డీకి రైతులు అప్పులు చేస్తున్నారని తెలిపారు. ఎంతో శ్రమతో పంట పండిస్తే రైతుకు గిట్టుబాటు ధర లభించడం లేదని, ఫలితంగా అప్పులు తీర్చే మార్గం కానరాక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వివరించారు. ఇకనైన ప్రభుత్వం రైతుకు గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాలని సూచించారు. లేకుంటే  బృహత్ పోరాటాలు చేపడతామని హెచ్చరించారు.
 

మరిన్ని వార్తలు