గుడ్‌ఫ్రైడేకి చర్చిల వద్ద భద్రత పెంపు

1 Apr, 2015 22:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కొంత కాలంగా నగరంలోని చర్చిలపై జరుగుతోన్న దాడులను దృష్టిలో ఉంచుకుని గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వేడుకలకు చర్చిల వద్ద ఢిల్లీ పోలీసులు విస్త్రతమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం రోజున చర్చిల వద్ద 10 వేల మందికి పైగా సిబ్బందితో నిరంతర గస్తీ ఏర్పాటు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి చర్చి బయట సాయుధ గార్డులను మొహరించనున్నట్లు చెప్పారు.

సవివరంగా మ్యాపింగ్ జరిపి సిబ్బందిని కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా తమ పరిధిలో ఉన్న చర్చిల జాబితాతో పాటు వాటికి సంబంధించిన వివరాలను అందించాలని స్టేషన్ హౌజ్ ఆఫీసర్స్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. చర్చిల బయట మొహరించిన సిబ్బందిని జాగ్రత్తగా బాధ్యతలు నిర్వహించవలసిందిగా అధికారులు ఆదేశించారు. ఆకతాయిచేష్టలకు పాల్పడే వారిని వెంటనే అదుపులోకి తీసుకోవలని చెప్పారు. గుడ్‌ఫ్రైడే రోజున పెట్రోలింగ్ వీలైనంత ఎక్కువగా నిర్వహించాలని ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు.

గుడ్‌ఫ్రైడే రోజున ట్రాఫిక్ సజావుగా సాగడం కోసం అన్ని ముఖ్యమైన కూడళ్ల వద్ద తగాన ఏర్పాట్లు చేయవలసిందిగా ట్రాఫిక్ పోలీసులను కోరినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. సీసీటీవీలు లేని చర్చిలకు అదనపు భద్రత కల్పిస్తారు. అన్ని చర్చిలకు ఒక కి.మీ దూరంలో చుట్టూరా బారికేడ్లను అమరుస్తారు. వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేయడం కోసం ఈ బారికేడ్ల వద్ద ఇద్దరు సబ్‌ఇన్స్‌పెక్టర్లు, ఇద్దరు ఏఎస్‌ఐలు, ముగ్గురు కానిస్టేబుల్స్‌ని మొహరిస్తారు.

మరిన్ని వార్తలు