గగనతలందాకా గట్టి నిఘా

14 Aug, 2014 22:48 IST|Sakshi

 న్యూఢిల్లీ: 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ రాజధాని నగరంలో భారీభద్రతా ఏర్పాట్లు చేశారు. భూఉపరితలం నుంచి గగనతలందాకా గట్టి నిఘా ఉంచారు. ఎర్రకోట పరిసరాల వద్ద భారీఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. ప్రధానమంత్రికి పలు ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసు శాఖతోపాటు పారామిలిటరీ బలగాలకు చెందిన దాదాపు 30 వేలమంది భద్రతా సిబ్బందికి నిఘా బాధ్యతలను అప్పగించారు. స్పెషల్ సెల్‌కు చెందిన ఐదు వేలమంది స్థానిక పోలీసులు కూడా ఈ నిఘా బాధ్యతల్లో పాలుపంచుకుంటున్నారు. మరోవైపువాహనాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు  ట్రాఫిక్ శాఖ తగు జాగ్రత్తలు తీసుకుంటోంది.
 
 ఈ విషయమై పోలీసు శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. తమకు నగరవాసులు అన్నివిధాలుగా సహకరించాలని ఆయన కోరారు. 17వ శతాబ్దం నాటి మొఘల్ కోటతోపాటు నగరంలోని అత్యంత ఎత్తయిన భవనాలపై ఎన్‌ఎస్‌జీకి చెందిన షార్ప్‌షూటర్లను మోహరించామన్నారు. దీంతోపాటు సత్వర స్పందన బృందాలు (క్యూఆర్‌ఎస్), బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్. ఎస్‌డబ్ల్యూటీ, వజ్ర బృందాలను కూడా రంగంలోకి దించామన్నారు. వేదిక సమీపంలో హెలికాప్టర్లతోపాటు ఎయిర్ డిఫెన్స్ మెకానిజంను కూడా సిద్ధం చేశారు. ఎర్రకోట పరిసరాల్లో 200 సీసీటీ వీ కెమెరాలను కూడా ఏర్పాటుచేశారు. దీంతోపాటు కంట్రోల్‌రూంను కూడా ఏర్పాటు చేశారు.
 
 రద్దీ ప్రదేశాల వద్ద అదనపు సిబ్బంది
 ఢిల్లీ మెట్రో, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, ఇంటర్ స్టేట్ బస్ టెర్మినస్‌ల వద్ద సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన అదనపు బలగాలను మోహరించారు. కాగా ఎర్రకోటకు వచ్చే నగరవాసుల కోసం ఉదయం ఆరు గంటల నుంచి  మధ్యాహ్నం 12 గంటల వరకు డీటీసీ బస్సులు, మెట్రో రైళ్లలో ఉచిత ప్రయా ణ సదుపాయం కల్పించారు. అంతేకాకుండా అల్పాహారం అందించడానికి కూడా తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, ఢిల్లీ బీజేపీతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ శాఖలు కూడా  ఏర్పాట్లు చేస్తున్నాయి.
 
 మోడీ ప్రసంగం ఆలకించేందుకు నగరం సిద్ధం
 న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం ఆలకించేందుకు నగరం సన్నద్ధమైంది. ఎర్రకోటపై శుక్రవారం జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని జాతినుద్దేశించి ఎర్రకోటనుంచి ప్రసంగించనున్నారు. మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన అనంతరం  మోడీ జాతినుద్దేశించి ఎర్రకోటనుంచి ప్రసంగించడం తొలిసారి. మోడీ ప్రసంగం అసాధారణ రీతిలో సాగుతుందని భావిస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసే సమయంలో ఆయన స్వాతంత్య్ర దినోత్సవాన్ని గొప్ప పండుగగా మార్చివేశారు. కాగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని చెరగని జ్ఞాపకంగా మార్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం సకల ఏర్పాట్లుచేసింది. 68వ ఇదిలాఉంచితే నగరంలోని అసోలా భట్టి వన్యపరిరక్షణ కేంద్రంలో మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. వారంరోజుల స్వాతంత్య్ర దిన వేడుకల్లో భాగంగా నగరవ్యాప్తంగా ఇప్పటికే 4.16 లక్షల మొక్కలను నాటిన సంగతి విదితమే.
 

>
మరిన్ని వార్తలు