‘భారత్ సూపర్ పవర్ ’ శాస్త్రవేత్తలతోనే సాధ్యం

22 Aug, 2014 01:44 IST|Sakshi
‘భారత్ సూపర్ పవర్ ’ శాస్త్రవేత్తలతోనే సాధ్యం

సాక్షి, బెంగళూరు : భారత్‌ను సూపర్ పవర్‌గా మార్చడం కేవలం శాస్త్రవేత్తల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని, ఈ విషయంలో రాజకీయ నాయకులు ఏమీ చేయలేరని మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ పేర్కొన్నారు. గురువారం ఆయన న గరంలోని నిమ్హాన్స్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటైన ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్‌ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.

రాజకీయ నాయకులు కేవలం దేశాన్ని సూపర్ పవర్‌గా మార్చేందుకు హామీలు మాత్రమే ఇవ్వగలరు కానీ, ఆ హామీలను కార్యరూపంలోకి తీసుకొచ్చి భారత్‌ను ప్రపంచ పటంలో సూపర్‌పవర్‌గా మార్చడం కేవలం శాస్త్రవేత్తల వల్లే సాధ్యమవుతుందని అన్నారు. తాను ప్రధానిగా ఉన్న సమయంలో రాజస్థాన్‌లోని పోక్రాన్‌లో అణు పరీక్ష నిర్వహించేందుకు సన్నద్ధమయ్యామని తెలిపారు. అయితే ఆ సమయంలో అణు పరీక్షలపై అమెరికా ఆంక్షలు విధించిందని గుర్తు చేశారు.

అయినా కూడా ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలామ్ సలహాతో అణు పరీక్షలకు సన్నద్ధమయ్యామని చెప్పారు. అయితే చుట్టుపక్కల ప్రాంతాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే అణు పరీక్షల నుంచి వెనకడుగు వేశాం తప్పితే అమెరికా ఆంక్షలకు బెదిరి కాదని అన్నారు. బెంగళూరు నగరం ఐటీ రాజధానిగా గుర్తింపు పొందడానికి  తాను ప్రధానిగా ఉన్న సమయంలో చేపట్టిన కార్యక్రమాలే ప్రధాన కారణమని దేవెగౌడ పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలో విద్యుత్, ఇతర ఇంధనాల తీవ్రత అధికంగా ఉందని, ఈ తీవ్రతను ఎదుర్కొనేలా దేశం స్వావలంబన సాధించేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో విశ్వేశ్వరయ్య టెక్నికల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ హెచ్.మహేషప్ప తదితరులు పాల్గొన్నారు.  
 
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా