ఇందిరా ఆవాస్ యోజనలో భారీ అక్రమాలు

12 Mar, 2015 00:34 IST|Sakshi

నకిలీ పేర్లు సృష్టించి
కోట్లాది రూపాయలు స్వాహా చేసిన అధికారులు
బీడీ హళ్లి పంచాయతీ పరిధిలో 594 ఇళ్ల బిల్లులు స్వాహా
బీడీహళ్లి గ్రామ పంచాయతీ సభ్యుల ఆరోపణ

 
బళ్లారి: ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాల ప్రజలతో పాటు నిరుపేదలందరికీ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలనే సదుద్ధేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు చేపట్టి ఇళ్లు నిర్మాణాలు చేపడుతుంటే కొందరు అధికారులు ఇళ్ల నిర్మాణాల్లో కాసుల పంట పండించుకున్న వైనం వెలుగు చూసింది. 2009-10వ సంవత్సరంలో ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద పేదలకు ఇళ్ల నిర్మాణాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు ఆధారాలతో సహా బయటపడ్డాయి. బళ్లారి తాలూకా బీడీ హళ్లి గ్రామ పంచాయతీ పరిధిలో 594 ఇళ్లకు సంబంధించిన బిల్లులను సంబంధిత గ్రామ పంచాయతీ అధికారి పరశురాంతో పాటు మరికొందరి భాగస్వామ్యంతో కోట్లాది రూపాయలు స్వాహా చేసినట్లు బీడీ హళ్లి గ్రామానికి చెందిన బళ్లారి  ఏపీఎంసీ మాజీ అధ్యక్షుడు భాస్కరరెడ్డితో పాటు పలువురు పేర్కొన్నారు. బుధవారం బీడీహళ్లి గ్రామ పంచాయతీలో ఇళ్ల నిర్మాణాల్లో జరిగిన అక్రమాలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సంజీవరెడ్డి, ప్రభాకరరెడ్డి, దుర్వాస్, చిదానందప్ప, నరేంద్రబాబులు కలిసి నగరంలోని ఓ హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు.

బీడీ హళ్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అశోక్‌నగర్ క్యాంపు, శివపుర, చాగనూరు, బీడీహళ్లి గ్రామాలలో ఇళ్లు నిర్మించకుండా 594 ఇళ్ల బిల్లులను సంబంధిత అధికారులే స్వాహా చేసినట్లు రికార్డులతో వివరించారు. ఈసందర్భంగా ఏపీఎంసీ మాజీ అధ్యక్షుడు భాస్కరరెడ్డి మాట్లాడుతూ 2009-10వ సంవత్సరంలో బీడీహళ్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పేదలకు, ఎస్‌సీ, ఎస్‌టీలకు దక్కాల్సిన ఇళ్లను సంబంధిత అధికారి నకిలీ దాఖలాలు సృష్టించి కోట్లాది రూపాయలు స్వాహా చేసినట్లు రికార్డులతో సహా బయటపెట్టారు. ఉదాహరణకు బీడీహళ్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అశోక్ నగర్ క్యాంపు 30 సంవత్సరాల క్రితం ఏర్పడిందని, అప్పుడే 115 ఇళ్ల నిర్మాణం చేపట్టారన్నారు. ప్రస్తుతం ఉన్నది కూడా 120 లోపు ఇళ్లు మాత్రమేనన్నారు. అయితే అదే అశోక్ నగర్ క్యాంపులో 242 ఇళ్లు నిర్మించినట్లు రికార్డులలో ఉందన్నారు. అధికారిక లెక్కల ప్రకారం 120 ఇళ్ల లోపు ఉంటే, 242 ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్లు నకిలీ దాఖలాలు సృష్టించారని ఆరోపించారు. అదే విధంగా బీడీ హళ్లిలో 59, శివపురలో 117, చాగనూరులో 176 ఇళ్లు నిర్మించినట్లు నకిలీ పేర్లు సృష్టించి బిల్లులు స్వాహా చేశారన్నారు.

ఒక్క అశోక్‌నగర్ క్యాంపులోనే 242 ఇళ్లకు గాను దాదాపు ఒక కోటి రూపాయలు స్వాహా చేశారన్నారు. మొత్తం పంచాయతీ పరిధిలో ఇదే తరహాలో కోట్లాది రూపాయలను సంబంధిత అధికారి స్వాహా చేశారన్నారు. ఈ విషయంపై తాము తాలూకా పంచాయతీ అధికారి, జెడ్పీ సీఈఓ, జిల్లాధికారికి ఫిర్యాదు చేశామన్నారు.అయితే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో తాము గురువారం బెంగళూరులోని లోకాయుక్త అధికారులకు బీడీహళ్లిలో జరిగిన అక్రమాలపై ఫిర్యాదు చేస్తామన్నారు. తాము ఫిర్యాదు చేసినా తనిఖీ కూడా చేయనందున సంబంధిత అధికారులందరిపై కూడా లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తామన్నారు. కోట్లాది రూపాయలు స్వాహా చేసిన పంచాయతీ సెక్రటరీ పరశురాం నుంచి నిధులు రాబట్టాలని, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని, క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే 2009 నుంచి 2014 వరకు గ్రామ పంచాయతీ పరిధిలోని ఉపాధి హామీ పథకంలో కూడా భారీగా అక్రమాలు జరిగాయని, వీటిపై కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.
 

మరిన్ని వార్తలు