బాత్‌రూమ్‌లో దాక్కున్న ఖైదీ!

4 Nov, 2015 09:11 IST|Sakshi
బాత్‌రూమ్‌లో దాక్కున్న ఖైదీ!

 మంగళూరు జైలును పరిశీలించిన కమల్‌పంత్
 
బెంగళూరు: మంగళూరులోని కారాగారంలో సోమవారం ఉదయం కొంతమంది ఖైదీల మధ్య ఘర్షణ జరిగిన అనంతరం కనిపించకుండా పోయిన ఖైదీ ఒకరు మంగళవారం ఉదయం జైలులోని ఓ బాత్‌రూమ్‌లో కనిపించాడు. వివరాలు....దొంగతనం చేసిన కేసులో బషీర్ అహ్మద్ అనే వ్యక్తి మంగళూరు కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. మంగళూరులోని కారాగారంలో సోమవారం ఉదయం ఖైదీల మధ్య జరిగిన ఘర్షణ  సమయంలో మడూరు యూసఫ్ హత్యను, అక్కడి వాతావరణాన్ని చూసి భయపడిపోయిన బషీర్ అహ్మద్ జైలులోని ఓ బాత్‌రూమ్‌లోకి వెళ్లి దాక్కున్నాడు. ఘర్షణ అనంతరం జైలులోని ఖైదీల గదులను పరిశీలించిన జైలు సిబ్బంది బషీర్ అహ్మద్ కనిపించక పోవడంతో అతను తప్పించుకొని వెళ్లి ఉండవచ్చని భావించారు.
 
 ఇదే విషయాన్ని అధికారులకు కూడా తెలియజేశారు. కాగా, మంగళవారం ఉదయం జైళ్ల శాఖ ఏడీజీపీ కమల్‌పంత్ మంగళూరులోని కారాగారాన్ని పరిశీలిస్తున్న సమయంలో బషీర్ అహ్మద్ జైలులోని ఓ బాత్‌రూమ్‌లో ఉండిపోయిన విషయాన్ని గుర్తించారు. జైలులో జరిగిన ఘర్షణను చూసి భయపడి బషీర్ అహ్మద్ బాత్‌రూమ్‌లో దాక్కున్నాడని అధికారులు చెబుతున్నారు. కాగా, మంగళూరులోని కారాగారాన్ని పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంగళూరు కారాగారంలో జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఈ ఘటనపై శాఖాపరమైన విచారణకు ఇప్పటికే ఆదేశించామని చెప్పారు.
 
 ఇదే సందర్భంలో మంగళూరు నగర పోలీసులు సైతం ఈ విషయమై విచారణ చేపట్టారని, రెండు నివేదికలను పరిశీలించిన అనంతరం ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. శాఖాపరమైన విచారణాధికారిగా మైసూరు సెంట్రల్ జైలు సూపరింటిండెంట్ ఆనందరెడ్డిని నియమించినట్లు కమల్‌పంత్ వెల్లడించారు. సిబ్బంది నిర్లక్ష్యమే ఘటనకు కారణమని తెలిస్తే మంగళూరు జైలు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

మరిన్ని వార్తలు