నాకు సంబంధం లేదు

19 Sep, 2018 12:58 IST|Sakshi

బుల్లితెర నటి నీలాణి ప్రియుడి ఆత్మహత్య కేసులో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నీలాణికి ఇంతకుముందే పెళ్లి అయ్యిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్టు తెలిసింది. భర్తను వదిలి పిల్లలతో నివశిస్తున్న నీలాణికి సహాయ దర్శకుడు గాంధీలలిత్‌కుమార్‌ పరిచయం కావడం, అతనితో ప్రేమ, సహజీవనం చేసిన విషయాలు బయటపడ్డాయి. తిరువణ్ణామలైకి చెందిన గాంధీలలిత్‌కుమార్‌కు తల్లిద్రండులు లేరు. అన్నయ్యనే పెంచి పెద్ద చేశాడు. సినిమారంగంపై ఆశతో చెన్నైకి వచ్చిన లలిత్‌కుమార్‌కు నటుడు ఉదయనిధిస్టాలిన్‌ సంస్థలో పని లభించింది. ఆ తరువాత సహాయ దర్శకుడిగా కొన్ని చిత్రాలకు పని చేశారు. 

తిరువణ్ణామలై ప్రాంతంలో ఉదయనిధిస్టాలిన్‌ అభిమాన సంఘం నిర్వాహకుడిగా ఉన్నాడు. కొంత కాలం తరువాత లలిత్‌కుమార్‌కు పని లేకుండా పోయింది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. దీంతో నిలాణీ, లలిత్‌కుమార్‌ను వదిలి ఒంటరిగా జీవిస్తోంది. ఇటీవల టీవీ సీరియల్‌ షూటింగ్‌లో ఉన్న నీలాణి వద్దకు వచ్చి పెళ్లి చేసుకుందామని లలిత్‌కుమార్‌ ఒత్తిడి చేశాడు. దీనిపై ఆమె మైలాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనస్తాపం చెంది లలిత్‌కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. ఇదిలాఉండగా నటి నీలాణితో లలిత్‌కుమార్‌  అనుబంధాన్ని తెలిపే వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

లలిత్‌కుమార్‌తో తనకు సంబంధం ఉన్న మాట నిజమే..
నటి నీలాణి మంగళవారం సాయంత్రం చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి వచ్చి లలిత్‌కుమార్‌ ఆత్మహత్మకు తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. అనంతనం మీడియా ముందుకు వచ్చి లలిత్‌కుమార్‌తో తనకు సంబంధం ఉన్న మాట నిజమేనని, ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నామని, అయితే ఇప్పుడే పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పానని తెలిపింది. లలిత్‌కుమార్‌ తన గురించి అసభ్యకరమైన దృశ్యాలను ఫేస్‌బుక్‌లో పెట్టడం, వేధించడంతోనే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని పేర్కొంది. అంతేగాకుండా తన వద్ద సొమ్ము తీసుకుని మోసం చేశాడని ఆరోపిస్తూ కంటతడి పెట్టింది.

మరిన్ని వార్తలు