లింగ నిర్ధారణ కేంద్రాలపై నిఘా

25 Jan, 2016 02:47 IST|Sakshi

 తిరువళ్లూరు: లింగ నిర్ధారణ చేసి ఆడ శిశువుల భ్రూణహత్యలకు ప్రోత్సహించే కేంద్రాలపై నిఘా ఉంచినట్టు తిరువళ్లూరు డీఎస్పీ విజయకుమార్ వివరించారు.   జాతీయ ఆడ శిశు దినోత్సవాన్ని  పురస్కరించుకుని తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేడీ డాక్టర్ దయాళన్ అద్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా డీఎస్పీ విజయకుమార్, విశిష్టఅతిథిగా భాస్కరన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ గతంలో కంటే ప్రస్తుతం భ్రూణహత్యలు తగ్గినట్టు పలు నివేదికలు ఇచ్చిన వివరాలను గుర్తు చేశారు.
 
  అయితే తిరువళ్లూరులోని స్కానింగ్ సెంటర్‌లపై ఇప్పటికీ నిఘా ఉందని వివరించారు. హర్యానా, పంజాబ్‌లలో ఆడ శిశు జననాల సంఖ్య ఆశాజనంగా ఉందని, మిగిలిన రాష్ట్రాల్లో అంతటి స్థాయిలో ఆడ శిశువులు లేరన్న అంశాన్ని ఆయన వివరించారు. ప్రస్తుత కాలంలో ఆడశిశువు పెంపకంతో పాటు వివాహ సమయంలో కట్న కానుకలంటూ వస్తున్న దోపిడే ప్రజల్లో అభద్రతా భావాన్ని పెంచుతున్నాయని ఆయన వివరించారు.
 
 అనంతరం చైర్మన్ భాస్కరన్ మాట్లాడుతూ  ఆడ శిశువులను ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో రాణించే సత్తా వారికుందని తెలిపారు.  భారతదేశంలో నేడు పురుషులకు సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో రాణించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇటీవల మైనర్ నిందితుడి వయసును తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చట్టాన్ని ప్రజలందరూ ఆహ్వానించాలని చైర్మన్ వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌లు యోగేంద్ర, జగదీషన్‌తో పలువురు పాల్గొన్నారు. ఆడ శిశువులకు ప్రభుత్వ కిట్‌తో పాటు ఇతర సహాయకాలను వారికి అందజేశారు.
 

మరిన్ని వార్తలు