అన్నాడీఎంకేలో అంతర్గత పోరు

30 Mar, 2016 02:15 IST|Sakshi

 తిరువళ్లూరు: ఐదేళ్లుగా బయటకు పొక్కని అధికార పార్టీ అంతర్గత విభేదాలు ఒక్క సారిగా భగ్గుమనడంతోపాటు  ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే స్థాయికి రావడంతో పార్టీ పరువు బజారున పడింది. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా అధికార అన్నాడీఎంకే పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. క్రమశిక్షణ గలిగిన పార్టీగా పేరున్న అన్నాడీఎంకేలో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్న సంఘటనలు లేవు. గతంలో గ్రూపు రాజకీయాలు ఉన్నా, మాజీ మంత్రి రమణ జిల్లా కార్యదర్శి పదవిని చేపట్టిన తరువాత వాటికి చెక్ పెట్టి పార్టీనీ ఏకతాటిపై నడిపించారు. చిన్నపాటి సమస్యలు వచ్చినా వాటినీ తానే చక్కదిద్దేవారు.
 
  అయితే రమణ తన సతీమణితో ఏకాంతంగా వున్న పోటోలు బయటకు రావడంతో మంత్రి పదవి, జిల్లా కార్యదర్శి తదితర జోడు పదవుల నుంచి ముఖ్యమంత్రి జయలలిత రమణనూ తొలగించారు. దీంతో రమణ జిల్లా రాజకీయాలకు దూరంగా వుంటూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇక విధిలేనీ పరిస్థితుల్లో కాంచీపురం జిల్లా కన్వీనర్‌గా వున్న వాలాజాబాద్ గణేషన్‌కు జిల్లా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం గణేష్‌కు రెండు జిల్లాల బాధ్యతలను చూడడం కష్టంగా మారింది. పైగా నియోజకవర్గం ప్రచారంలోనూ బిజీగా ఉండడంతో అయన తిరువళ్లూరుపై పెద్దగా దృష్టి పెట్టలేనీ పరిస్థితి ఏర్పడి ంది.
 
 ఈ నేపథ్యంలో రమణ ఉన్నంత వరకు నిశ్శబ్దంగా వున్న అంతర్గత విభేదాలు రమణ అనుకూల వ్యతిరేక వర్గాలుగా విడిపోయి రోడ్డున పడింది. గత రెండు వారాల క్రితం జరిగిన అన్నాడీఎంకే కార్యకర్తల సమావేశంలో అంతర్గత విబేధాలు బయటపడి ఇరువర్గాలు తన్నుకునే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి విభేదాలు అధికార పార్టీలో రావడంతో  ఒక్క సారీగా పార్టీ నేతలు షాక్ తిన్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీలో వర్గాలుగా చీలి ఘర్షణ పడడం వల్ల వచ్చే ఎన్నికల్లో పార్టీ శ్రేణులపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని పలువురు సీనీయర్ నేతలు సైతం వాపోతున్నారు.
 
 చైర్మన్‌పై ఫేస్‌బుక్‌లో ప్రచారం:  త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీ చేయడానీకి ఆసక్తి ఉన్న నేతల నుంచి అన్నాడీఎంకే  దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో భాగంగానే తిరువళ్లూరు నుండి పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్న మున్సిపల్ చైర్మన్ భాస్కరన్, ఇటీవల ఇంటర్వ్యూలకు సైతం హాజరయ్యారు. త్వరలోనే అభ్యర్థుల జాబితా విడుదల చేసే పరిస్థితి వున్న నేపథ్యంలో తిరువళ్లూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా భాస్కరన్‌ను ఎంపిక చేసిన ముఖ్యమంత్రి జయలలితకు థ్యాంక్స్ అంటూ కొందరు ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టారు. క్షణాల్లో సంబంధిత పోస్టు షేర్ కావడంతో పాటు అన్నాడీఎంకే పేజ్‌లోనే షేర్ చేశారు. వీటిని గమనించిన అధిష్టానం, మీకు ఎవరు సీటు ఇచ్చారు, సీటు ఇవ్వకుండానే ఇదేమీ ప్రచారం అంటూ నిలదీసినట్టు తెలిసింది. దీంతో తనకు సీటు రాకుండా తన వ్యతిరేక వర్గం ఇలా చేసిందని భావించిన భాస్కరన్ డీఎస్పీ విజయకుమార్‌కు ఫిర్యాదు చేశారు. తనపై ఫేస్‌బుక్‌లో వచ్చిన పోస్టింగ్‌ను వెంటనే నిలిపివేయడంతోపాటు పోస్టింగ్ పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలనీ కోరారు.
 
 నన్ను బెదించారు: భాస్కరన్‌పై వచ్చిన పోస్టింగ్‌ను తిరువళ్లూరు యువజన అన్నాడీఎంకే కార్యదర్శి జయవీరన్ పెట్టినట్టు గుర్తించారు. ఇతను భాస్కరన్ వ్యతిరేక వర్గం లో కొనసాగుతున్నట్టు గుర్తించిన భాస్కరన్ అతని ఇంటి వద్దకు వెళ్లి హత్య చేస్తానని బెదిరించారనీ తిరువళ్లూరు టౌన్ పోలీసులను ఆశ్రయించారు. తనకు భద్రత కల్పించడంతో పాటు హత్య చేస్తాననీ బెదిరించిన మున్సిపల్ చైర్మన్‌ను అరెస్టు చేయాలని ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇరు వర్గాల వద్ద విచారణ చేపడుతున్నారు. ఇది ఇలా వుండగా ఎన్నికలకు కేవలం రెండు నెలల వ్యవధి కూడా లేని పక్షంలో అన్నాడీఎంకేలో అంతర్గత కుమ్ములాటలు బయటకురావడం చర్చీనీయాం శంగా మారింది. అధికార పార్టీలో నానాటికీ పెరుగుతున్న కుమ్మలాటల వల్ల పార్టీకి ఎలాంటి పరిస్థితి పడుతుందోనన్న ఆందోళన కరుడుగట్టిన పార్టీ నేతల్లో ఏర్పడింది.  
 

>
మరిన్ని వార్తలు