సీఎంను తప్పించేందుకు యత్నం !

22 Oct, 2015 08:27 IST|Sakshi
సీఎంను తప్పించేందుకు యత్నం !

రాష్ట్ర కాంగ్రెస్‌లో ముదురుతున్న విభేదాలు
సిద్ధరామయ్యను తప్పించేందుకు యత్నం
నామమాత్రంగా వ్యవహరిస్తున్న అధిష్టానం
దళిత వర్గాలను మచ్చిక చేసుకునే పనిలో సీఎం
గట్టెక్కించాలంటూ ఎస్‌ఎం కృష్ణకు బాధ్యత
 
 
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని ప్రధాన నాయకుల మధ్య విభేదాలు బలపడుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను లక్ష్యంగా చేసుకుని పలువురు పావులు కదుపుతుండగా... పదవిని నిలబెట్టుకునేందుకు సిద్ధరామయ్య కూడా అదే స్థాయిలో ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ రాజకీయ చదరంగంలో ఏఐసీసీ  నామమాత్రంగా వ్యవహరిస్తూ సమస్య పరిష్కరించమంటూ రాష్ట్ర రాజకీయాల్లో అపర చాణుక్యుడిగా పేరుగడించిన ఎస్.ఎం.కృష్ణకు అప్పగించింది.
 
బెంగళూరు : రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లకు రుచించడం లేదు. దీనికి తోడు తనతో పాటు జేడీఎస్ నుంచి వలస వచ్చిన వారికి సిద్ధు ప్రాధాన్యమిస్తుండడం వారిని మరింత అసంతృప్తికి గురిచేసింది. ఇదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి బలపడేందుకు తన సర్వశక్తులు ఒడ్డిన కేపీసీసీ చీఫ్ పరమేశ్వర్‌కు ముఖ్యమంత్రి పదవి అందని ద్రాక్షలా మారింది.

ఆఖరుకు ఎలాగైనా ఉప ముఖ్యమంత్రి స్థానంలోనైనా ఉండాలనే ఆకాంక్షకు సిద్ధరామయ్య గండి కొడుతూ వచ్చారు. దీనికి తోడు రాష్ట్ర మంత్రి వర్గంలోని నాలుగు స్థానాలు ముఖ్యమంత్రి వద్ద నిలిచిపోయాయి. వీటిని భర్తీ చేయకుండా సిద్ధరామయ్య ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో అసమ్మతికి మరింత ఆజ్యం పోశాయి. ఈ విషయంలో పూర్తిస్థాయిలో జోక్యం చేసుకోకుండా అధిష్టానం నామమాత్రంగా వ్యవహరిస్తుండడం సీనియర్లను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

నివురుగప్పిన నిప్పులా ఉన్న సీనియర్ల అసంతృప్తి ఇటీవల ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కర్ణాటక పర్యాటనకు వచ్చినప్పుడు ఒక్కసారిగా భగ్గుమంది. యువరాజు ఎదుట ఏకంగా ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై ఫిర్యాదుల తుఫాన్ లేచింది. దీంతో ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఎస్.ఎం.కృష్ణ, జాఫర్ షరీఫ్, బి.కె.హరిప్రసాద్ వంటి సీనియర్లను కలుపుకుని ఏఐసీసీ చీఫ్ సోనియాగాంధీతో రాహుల్‌గాంధీ భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో కర్ణాటకలోని తాజా పరిస్థితిపై సమగ్రంగా చర్చించి ముఖ్యమంత్రి స్థానం నుంచి సిద్ధరామయ్యను తప్పించకపోతే పార్టీ మనుగడ ప్రశ్నార్థకమన్న నిర్ణయానికి వచ్చేశారు. అంతేకాక స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా చాటాలంటే సిద్ధరామయ్యను సీఎం పీఠం నుంచి తప్పించాలని తీర్మానించినట్లు విశ్వసనీయ సమాచారం. విషయం తెలుసుకున్న సిద్ధరామయ్య తన పీఠం కాపాడుకోవడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే తనకు ఇష్టం లేకపోయినా ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని పరమేశ్వర్‌కు అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఈ చర్య దళితులను తనకు దగ్గరగా చేస్తుందని సిద్ధు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని హైకమాండ్ దృష్టికి సిద్ధు తీసుకెళ్లారు. పరమేశ్వర్‌కు డిప్యూటీ సీఎం పదవినివ్వడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని తెలియజేశారు. అయితే సిద్ధు ప్రతిపాదనకు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంగీకరించడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత జేడీఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన వారే కీలక పదవుల్లో ఉన్నారని అందువల్ల సిద్ధరామయ్యను ఆ స్థానం నుంచి తప్పించాలని పట్టుబడుతున్నారు.

సిద్ధరామయ్యను సీఎంను పీఠం నుంచి దించి ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలైన దళిత వర్గానికి చెందిన మల్లికార్జున ఖర్గే లేదా పరమేశ్వను కూర్చోబెట్టాలని సదరు నేతలు పట్టుదలతో ఉన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన సమస్యను పరిష్కరించే బాధ్యత మాజీ సీఎం, రాష్ట్ర రాజకీయాల్లో చాణుక్యుడిగా పేరుగాంచిన ఎస్.ఎం.కృష్ణకు అధిష్టానం అప్పగించింది. ఆయన దసరా వరకు సమయం కోరినట్లు తెలుస్తోంది. దీంతో దసరా తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా