శాస్త్రి అంకితభావం అపూర్వం

23 Mar, 2014 22:43 IST|Sakshi
శాస్త్రి అంకితభావం అపూర్వం

న్యూఢిల్లీ: భారత్ రెండో ప్రధాని లాల్ బహదూర్  శాస్త్రి అంకితభావం అపూర్వమని టిబెటన్ మతగురువు దలైలామా కొనియాడారు. ఆయన మరికొన్ని రోజులు బతికిఉంటే దేశానికి మరింత సేవ చేసేవారని పేర్కొన్నారు. నగరంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘లాల్ బహదూర్ శాస్త్రి: లెస్సన్ ఇన్ లీడర్‌షిప్’ పేరుతో శాస్త్రి తనయుడు అనిల్ శాస్త్రి, పవన్ చౌదరి సంయుక్తంగా రాసిన జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
 
 ‘శాస్త్రి చాలా అంకితభావంతో దేశం కోసం పనిచేశారు. ఆయన మరికొన్ని సంవత్సరాలు బతికి ఉంటే దేశాభివృద్ది కోసం మరింత సేవ చేసేవారు. 1965లో పాక్‌తో యుద్ధం జరిగిన సమయంలో ఆయన చాలా ధైర్యంగా వ్యవహరించారు. భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు ఆయన ప్రతినిధిగా కనిపించేవారు.
 
 చాలా గొప్ప వ్యక్తి. ఆయనలోని అంకితభావాన్ని చాలా దగ్గరగా చూశాను. ఆయన అభిమానుల్లో నేనూ ఒకడిని. ప్రధానిగా ఉన్న సమయంలోనే నేను శాస్త్రిని కలిశాను. మాటలకు, చేతలకు పొంతన ఉండాలని భావించే వ్యక్తి.
 
 ఎదుటివారి పట్ల దయ, జాలి చూపే హృదయం ఆయన  సొంతం. చిన్నప్పుడు నేనో పుస్తకాన్ని కొనుక్కున్నాను. అది నా జీవితంలో ఎంతో మార్పు తీసుకొచ్చింది. అలాగే తండ్రి జీవితాన్ని అనిల్‌శాస్త్రి మనకు పుస్తకంగా అందిస్తున్నారు. ఇది ఎందరికో స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నానన్నారు.

మరిన్ని వార్తలు