బీజేపీలోకి జగదాంబికా పాల్, రాజు శ్రీవాస్తవ

20 Mar, 2014 00:08 IST|Sakshi
బీజేపీలోకి జగదాంబికా పాల్, రాజు శ్రీవాస్తవ

న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిననాటి నుంచి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ నేత జగదాంబికా పాల్, ప్రముఖ హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ బుధవారం కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీగా, ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాధ్యక్షుడిగా పనిచేసిన జగదాం బికా పాల్ ఇటీవలే లోక్‌సభలో ఎంపీ పదవితోపాటు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీ నామా చేసిన విషయం తెలిసిందే.
 
 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి  మూడుసార్లు ఎన్నికై, మంత్రి పదవులు కూడా సమర్థవంతంగా నిర్వహించిన ఈ సీనియర్ నేత పార్టీని వీడడం కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బగానే రాజకీయ పండితులు చెప్పుకుంటున్నారు. ఇక హాస్యనటుడిగా అందరికీ పరిచయమున్న వ్యక్తిగా చెప్పుకునే రాజు శ్రీవాస్తవకు కాన్పూర్ టికెట్ ఇస్తామంటూ సమాజ్‌వాదీ పార్టీ ఇప్పటికే ప్రకటించింది.
 
  అయితే ఆయన మాత్రం ఆ పార్టీలో చేరడానికి ఆసక్తి కనబర్చలేదు. బీజేపీలో చేరేందుకే ఆసక్తి చూపారు. చివరకు పార్టీ నుంచి ఎటువంటి హామీ లభించిందో తెలియదుగానీ మొత్తానికి కమలం తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సమక్షంలో బుధవారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో వీరు బీజేపీలో చేరారు.
 
 భారత రాజకీయ భవిష్యత్తు బీజేపీతోనే: రాజు
 భారత రాజకీయ భవిష్యత్తు బీజేపీతోనే ముడిపడి ఉందని హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ అన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సమక్షంలో బుధవారం పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘దేశం కాంగ్రెస్ పార్టీకి దాదాపు 60 సంవత్సరాల పాటు అధికారం ఇచ్చింది. 61 సంవత్సరం నుంచైనా బీజేపీ పార్టీకి ఇవ్వాలనుకుంటోందని నేను భావిస్తున్నా.
 
  దేశ రాజకీయ భవిష్యత్తు బీజేపీతోనే ముడిపడి ఉంది. మొదట సమాజ్‌వాదీ పార్టీలో చేరాలని భావించాను. అయితే ఆ పార్టీలో క్రమశిక్షణ లోపించిందనిపించింది. అంతేకాకుండా ఆ పార్టీలో అందరి నుంచి నాకు సరైన మద్దతు లభించలేదు. అందుకే నా ఆలోచనను విరమించుకున్నాన’ని చెప్పారు.
 
 తేజాబ్, మైనే ప్యార్ కియా, బాజిగర్ వంటి హిట్ చిత్రాల్లో హాస్యనటుడిగా తనదైన ముద్ర వేసిన రాజు కంటతడి పెట్టించే పాత్రల్లో కూడా ప్రేక్షకులను మెప్పించారు. ఇటీవలే సతీమణితోసహా నాచ్ బలియే-6 టీవీ షోలో పాల్గొన్నారు. బిగ్‌బాస్, శక్తిమాన్, అదాలత్ వంటివాటిలో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించారు.

మరిన్ని వార్తలు