జైన సన్యాసిని జీవసమాధి

5 May, 2019 03:32 IST|Sakshi
శ్రీసుబ్రబావుమతి మాతాజీ భౌతికకాయాన్ని ఊరేగింపుగా తీసుకెళుతున్న భక్తులు

టీ.నగర్‌(తమిళనాడు): ఏడు రోజులపాటు సల్లేఖన వ్రతం చేపట్టిన 65 ఏళ్ల జైన సన్యాసిని శుక్రవారం జీవసమాధి పొందారు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో చోటుచేసుకుంది. సల్లేఖన వ్రతంలో భాగంగా జైనులు క్రమంగా ఆహర స్వీకరణ తగ్గించి, చివరకు అన్నపానీయాల పూర్తిగా మానివేసి ప్రాణాలు విడుస్తారు. జైన సాంప్రదాయంలో ఈ వ్రతానికి చాలా ప్రాధాన్యత ఉంది. కర్ణాటక రాష్ట్రం హవారి ప్రాంతానికి చెందిన శ్రీ సుబ్రబావుమతి 2012 సంవత్సరంలో కుటుంబ జీవనాన్ని విడనాడి సన్యాసం చేపట్టారు. తర్వాత మాతాజీగా దీక్ష పొంది శ్రీసుబ్రబావుమతి మాతాజీగా వ్యవహరించబడ్డారు.

పలు ప్రాంతాల్లో ఉన్న జైన ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహించిన ఈమె జైనుల ప్రధాన కేంద్రమైన మేల్‌సిత్తామూరులోని మఠంలో సల్లేఖన వ్రతం చేపట్టి జీవసమాధి పొందేందుకు నిర్ణయించారు. దీంతో ఒకటిన్నర నెల క్రితం మాతాజి ఇద్దరు దిగంబరస్వాములు, 9 మంది మాతాజీల తో విల్లుపురం జిల్లా సెంజి సమీపంలోగల మేల సిత్తామూరు మఠం చేరుకున్నారు. ఈమె ఏప్రిల్‌ 27నుంచి ఆహారం, నీరు సేవించకుండా శుక్ర వారం రాత్రి 8.50 గంటలకు జీవసమాధి పొందారు. మాతాజీ అంత్యక్రియలు శనివారం జరిగాయి. అనేక మంది భక్తులు పూలమాలలు, నెయ్యితో పూజలు నిర్వహించారు. 

మరిన్ని వార్తలు