ఇక సమరమే!

23 Jan, 2017 02:20 IST|Sakshi

► నేటి నుంచి సభా పర్వం
► అసెంబ్లీ పరిసరాల్లో భారీ భద్రత
► గవర్నర్‌ ప్రసంగంతో శ్రీకారం
► సభా మందిరంలో మార్పులు చేర్పులు
► 24న అమ్మకు సంతాపం
► 25న జల్లికట్టు ముసాయిదా


సాక్షి, చెన్నై : అసెంబ్లీ సమరానికి సర్వం సిద్ధమైంది. జల్లికట్టు ప్రకంపనల నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య సభాపర్వం వాడివేడిగా సాగే అవకాశాలు ఉన్నాయి. గవర్నర్‌(ఇన్ )విద్యాసాగర్‌రావు ప్రసంగంతో సోమవారం పది గంటలకు అసెంబ్లీ సమావేశం కానుంది. ఇక, ఈనెల 24న అమ్మ జయలలిత మృతికి సంతాపం తీర్మానం, 25వ తేదీన జల్లికట్టుకు మద్దతుగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు చట్టబద్ధత కల్పించే విధంగా స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పదవీ కాలం విషయంగా ముసాయిదాలు దాఖలు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అన్నాడీఎంకే సర్కారు రెండోసారిగా అధికారంలోకి వచ్చినానంతరం దివంగత సీఎం జయలలిత నేతృత్వంలో గత ఏడాది బడ్జెట్‌ సమావేశాలు సాగాయి. తదుపరి చోటుచేసుకున్న పరిణామాలతో అమ్మ జయలలిత ఆసుపత్రి పాలు కావడం, చివరకు అందర్నీ వీడి అనంత లోకాలకు చేరడం చోటు చేసుకున్నాయి. సీఎంగా అమ్మ నమ్మిన బంటు పన్నీరుసెల్వం పగ్గాలు చేపట్టినా, రాష్ట్రంలో పాలన అంతంత మాత్రమే. ఇక, జల్లికట్టు నినాదం పన్నీరుసెల్వం ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలోనే పెట్టింది.

ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో తొలి అసెంబ్లీ సమావేశానికి తగ్గ ఏర్పాట్ల మీద సీఎం పన్నీరుసెల్వం దృష్టి పెట్టారు. ఆయా విభాగాల్లోని కేటాయింపులు, పథకాల తీరు తెన్నుల మీద మంత్రులు సమీక్షలు ముగించి, ప్రతి పక్షాల్ని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. సభాపర్వం తేదీని రాష్ట్ర ఇన్ చార్జ్‌ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు ప్రకటించడంతో అసెంబ్లీ సమావేశానికి తగట్టు సర్వం సిద్ధమైంది.

ఇక సమరమే...జల్లికట్టు ప్రకంపన తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశం అవుతుండడంతో ఉత్కంఠ నెలకొంది. అధికార పక్షంతో ఢీ కొట్టేందుకు బలమైన ప్రధాన ప్రతిపక్షం సిద్ధమైంది. దీంతో సభాపర్వం వాడి వేడిగా సాగే అవకాశాలు ఎక్కువే. గవర్నర్‌ ప్రసంగంతో ప్రారంభమయ్యే తొలి సమావేశం కావడంతో, ఇందులో ఏదేని కొత్త పథకాలను ప్రకటించేనా అన్న ఎదురు చూపుల్లో సర్వత్రా ఉన్నారు. అమ్మ పథకాల కొనసాగింపుతో పాటు, ఇతర పథకాల మీద పన్నీరు దృష్టి పెట్టేనా అని పెదవి విప్పే వాళ్లూ ఉన్నారు. అమ్మ జయలలిత లేని తొలి సమావేశం కావడంతో ఇక, అన్నాడీఎంకే వర్గాల్లో అమ్మ భక్తి ఏ మేరకు ఉంటుందో వేచి చూడాల్సిందే. ఇక, ఈ ఏడాదిలో తొలి సమావేశాన్ని ప్రారంభించేందుకు గవర్నర్‌ విద్యాసాగర్‌రావు సోమవారం ఉదయం 9.50 గంటలకు అసెంబ్లీ ఆవరణకు చేరుకుంటారు.

స్పీకర్‌ ధనపాల్, అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్  ఆయనకు మర్యాద పూర్వకంగా స్వాగతం పలుకుతారు. పది గంటలకు సరిగ్గా గవర్నర్‌ ఆంగ్ల ప్రసంగం ప్రారంభం అవుతుంది. తదుపరి ఆ ప్రసంగాన్ని స్పీకర్‌ ధనపాల్‌ తమిళంలో అనువదిస్తారు. ఇంతటితో తొలి రోజు సభ ముగుస్తుంది. తదుపరి స్పీకర్‌ ధనపాల్‌ నేతృత్వంలో అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, చర్చించాల్సిన అంశాలు, ముసాయిదాల గురించి సమీక్షించి ఇందులో నిర్ణయం తీసుకుంటారు.

రేపు అమ్మకు సంతాపం: అందరి అమ్మ జయలలిత భౌతికంగా దూరమైనానంతరం జరుగుతున్న తొలి సమావేశం కావడంతో సంతాప తీర్మానం, సందేశాలు సభలో సాగించాల్సి ఉంది. రెండో రోజు మంగళవారం అమ్మ జయలలిత మృతికి సంతాప తీర్మానం, నేతల ప్రసంగాలు ఉంటాయి. అదే రోజు మాజీ మంత్రి కోశిమణితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ గవర్నర్‌ బర్నాల, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫెడల్‌ క్యాస్ట్రోల మృతికి సంతాపంగా మౌనం పాటించనున్నారు.

ఈ ప్రక్రియతో రెండో రోజు సభ ముగియనుంది. ఇక మూడో రోజు బుధవారం నుంచి సభలో వాడివేడి ప్రసంగాలు సాగనున్నాయి. గవర్నర్‌ ప్రసంగానికి కృతజ్ఞతలు తెలుపడమే కాకుండా, చర్చలు, జల్లికట్టు ముసాయిదా సభ ముందు కు రానున్నాయి. అలాగే, స్థానిక సంస్థల ఎన్నిక లు ఆగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయా సంస్థలకు ప్రత్యేక అధికారుల్ని నియమిస్తూ  సభలోముసాయిదాను దాఖలు చేయనున్నారు. ఇక, అమ్మ జయలలిత సీఎంగా ఉన్న సమయంలో శాసనసభ పక్ష నేతగా పన్నీరు సెల్వం వ్యవహరించిన విషయం తెలిసిందే.

తాజాగా, ఆయన సీఎం పగ్గాలు చేపట్టిన దృష్ట్యా, శాసన సభ పక్షనేతగా ఎవరు వ్యవహరిస్తారోనన్న ఎదురుచూపులు అన్నాడీఎంకేలో పెరిగాయి. ఇక, అమ్మ సభలో లేని దృష్ట్యా, మందిరంలో కొన్ని మార్పులు చేర్పులు జరి గినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.అసెం బ్లీ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే, వాహనాల రాకపోకలకు ఆంక్షలు విధించారు. ఇదిలా ఉండగా, అధికార పక్షాన్ని ఢీకొట్టేందుకు సమాయత్తమయ్యే విధంగా డీఎంకే శాసనసభా పక్ష సమావేశం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు రాయపేటలోని ఆ పార్టీ కార్యాలయంలో జరుగనుంది.

మరిన్ని వార్తలు