కెప్టెన్ సీఎం

10 Mar, 2016 02:41 IST|Sakshi
కెప్టెన్ సీఎం

సాక్షి, చెన్నై : బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్ ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యలతో బుధవారం తమిళ మీడియాల్లో వెలువడ్డ సమాచారం డీఎంకే, డీఎండీకే  కేడర్‌నే కాదు, కమలం వర్గాల్ని విస్మయంలో పడేశాయి. అనూహ్యంగా రాజకీయ మలుపు తిరగడంతో చర్చ బయలు దేరింది.పది శాతం ఓటు బ్యాంక్ కల్గిన డీఎండీకే అధినేత విజయకాంత్ చుట్టూ రాజకీయం సాగుతున్న విషయం తెలిసిందే. నాన్చుడు ధోరణి అనుసరించే విజయకాంత్ ఇంత వరకు తన మదిలో మాటను బయటకు పెట్ట లేదు. భవిష్యత్తు దృష్ట్యా,ప్రాంతీయ పార్టీలతో కలిసి నడవడమే శ్రేయస్కరం అన్న నిర్ణయంతో ఆయన ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయి.
 
  అయితే, తమ వైపుకు విజయకాంత్‌ను తిప్పుకునేందుకు జాతీయ పార్టీ కమలం తీవ్రంగానే కుస్తీలు పడుతున్నది. అదే సమయంలో  ఊహా జనిత కథనాలపై ఇన్నాళ్లు నోరు మెదపని డీఎంకే అధినేత ఎం కరుణానిధి మంగళవారం  విజయకాంత్ తమ వెంటే అని ప్రకటించేశారు. దీంతో కమలం ఆశలు అడియాశలైనట్టు అయ్యాయి. ఒక ఒంటరిగా మిగాల్సిన పరిస్థితి వారికి రాష్ట్రంలో ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో బుధవారం ఢిల్లీలో తమిళ మీడియాతో బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్ , కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాతో మాట్లాడినట్టుగా తమిళ మీడియాల్లో వచ్చిన సమాచారం రాజకీయంగా కొత్త మలుపును తిప్పినట్టు అయింది.
 
 కెప్టెన్ సీఎం :
 జవదేకర్ మాట్లాడినట్టుగా కొన్ని చానళ్లు ఫ్లాష్ ..న్యూస్‌లతో సమాచారాల్ని  ప్రసారం చేశాయి. డీఎండీకే నేతృత్వంలో ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్టు జవదేకర్ వ్యాఖ్యానించారని అందులో పేర్కొన్నారు. అలాగే, డీఎండీకేకు 50 శాతం సీట్లు, ప్రజా కూటమిలో ఉన్న వీసీకే కలిసి వస్తే కొన్నిసీట్లు, ఇతర  చిన్న పార్టీలకు సర్దుబాటు పోగా, మిగిలిన స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని ప్రకటించారు. ఇక, డీఎండీకే నేతృత్వంలోని కూటమికి సీఎం అభ్యర్థిగా విజయకాంత్‌ను ప్రకటి ంచేందుకు తాము సిద్ధం అని జవదేకర్ వ్యాఖ్యానించినట్టుగా వచ్చిన ఆ ఫ్లాష్..న్యూస్..డీఎంకేకు షాక్ ఇచ్చినట్టు చేసింది.
 
 అలాగే, విజయకాంత్ సతీమణి ప్రేమలత పొత్తు మంతనాల్లో ఉన్నారని వ్యాఖ్యానించడంతో ఇక, పండు పక్వానికి వచ్చి పాలల్లో పడుతుందనుకుంటే, పక్కదారి పట్టిందేంటబ్బా...? అన్న డైలమాలో డిఎంకే వర్గాలు పడ్డాయి. అదే సమయంలో డీఎండీకే వర్గాలు సైతం విస్మయంలో పడ్డాయి. ప్రేమలత విజయకాంత్ జవదేకర్‌తో ఎప్పుడు సంప్రదింపులు జరిపినట్టు, ఢిల్లీ పెద్దల అపాయింట్ మెంట్‌ఎప్పుడు తీసుకున్నట్టు అన్న సందిగ్ధంలో పడ్డారు. ఇక, బీజేపీ వర్గాలకు సైతం ఈ ఫ్లాష్ ..న్యూస్‌లు ఆశ్చర్యాన్ని కల్గించాయి.
 
  తమతో కనీసం సంప్రదింపులు జరపకుండా జవదేకర్  ఎలా ప్రకటిస్తారన్న సందిగ్దంలో పడ్డారు. చివరకు ఢిల్లీకి వ్యవహారం చేరడంతో అవన్నీ తమిళ మీడియా సృష్టిగా తేలాయి. రాజ్య సభలో జవదేకర్ ఉన్నారని, అలాంటప్పుడు ఆయన మీడియాతో ఎలా మాట్లాడటం జరిగిందంటూ ఢిల్లీ నుంచి ప్రకటన వెలువడింది. అలాగే, రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ స్పందిస్తూ, తమతో సంప్రదింపులు జరపకుండా జవదేకర్ ఎలా ప్రకటిస్తారని, పొత్తు ,సీట్ల పందేరాల వ్యవహారాల్లో తమ ప్రమేయం కూడా ఉంటుందన్న విషయాన్ని మీడియా గుర్తించాలని ఈ సందర్భంగా ఆయన చురకలు అంటించారు.
 
 ఇక, డీఎంకే వర్గాలు మాత్రం, తమతో డీఎండీకే  పొత్తును చెడగొట్టడం లక్ష్యంగానే కొన్ని మీడియాలు ఈ ఫ్లాష్.... సృష్టించి ఉన్నాయని ఆయన మండి పడుతున్నారు. కేడర్‌లో గందరగోళం సృష్టించే విధంగా వ్యవహారాలు సాగిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ధ్వజమెత్తారు.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా