మరో సేవ

20 Jan, 2016 02:10 IST|Sakshi
మరో సేవ

అమ్మ కాల్ సెంటర్  ఆవిర్భావం
♦  ప్రజా సమస్యల  పరిష్కారానికి మరో వేదిక
♦  ప్రారంభించిన సీఎం జయ

 
 ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలా అమ్మ కాల్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది.
 అమ్మ కాల్ సెంటర్‌కు టోల్‌ఫ్రీ నంబరు 1100కు ఫోన్ చేయడం ద్వారా ప్రజలు ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న
 సహాయాన్ని అందుకోవచ్చు. చెన్నై టీనగర్‌లో నెలకొల్పిన అమ్మ కాల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి జయలలిత
 మంగళవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

 
 చెన్నై, సాక్షి ప్రతినిధి:   రాష్ట్రంలో ఇప్పటికే అమ్మ క్యాంటీన్లు, అమ్మ సిమెంట్, అమ్మ ఫార్మసీలు, అమ్మ మినరల్ వాటర్ బాటిల్, అమ్మ అముదం స్టోర్లు సేవలందిస్తున్నాయి. అమ్మ థియేటర్లకు ఏర్పాటు చేయాలని చెన్నై కార్పొరేష్‌న్ ప్రణాళికలు సిద్ధం చేసింది. అమ్మ పేరుతో ప్రవేశపెట్టిన అన్ని పథకాలు ప్రజాదరణ పొందాయి. నామమాత్రం ధరకు ఆహారం లభించే అమ్మ క్యాంటీన్లు బహుళ ప్రజాదరణ పొందడంతోపాటు ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచాయి.
 
 తాజాగా అమ్మ కాల్‌సెంటర్:ఈ కోవలోకి తాజాగా అమ్మ కాల్ సెంటర్ వచ్చి చేరింది. పేద, బలహీన, బడుగు వర్గాలు ప్రభుత్వ పరంగా తాము ఆశిస్తున్న సేవలు, సమస్యలపై పరిష్కారాల కోసం సచివాలయంలో సీఎం ప్రత్యేక విభాగం పనిచేస్తోంది. ఈ విభాగం ద్వారా నేరుగా లేదా పోస్టల్ శాఖ ద్వారా ఫిర్యాదులు పంపవచ్చు. ప్రజల నుండి వచ్చిన అభ్యర్థులను శాఖాపరంగా విభజించి ఆయా శాఖల అధికారులకు పంపుతారు. సమస్యను పరిష్కరించగానే సంబంధిత వ్యక్తికి సమాచారం ఇస్తారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో మరింత వేగం పాటించేందుకు వీలుగా అమ్మ కాల్‌సెంటర్ సేవలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
 
  చెన్నై టీ నగర్‌లో నెలకొల్పిన కాల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి జయలలిత మంగళవారం సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా   ప్రారంభించారు.  1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయడం ద్వారా ప్రజలు తమ కోర్కెను విన్నవించుకునే వెసులుబాటును కల్పించారు. చెన్నైలోని ఈ కాల్‌సెంటర్ 24 గంటలు సేవలందించేలా అందుబాటులోకి తెచ్చారు. తొలిదశగా రోజుకు 15 వేల విజ్ఞప్తులను నమోదుచేయగల సామర్థ్యం కలిగిన 138 సిబ్బందిని నియమించారు. ప్రజల స్పందనను బట్టీ సిబ్బంది సంఖ్యను పెంచుతారు. ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను ఈమెయిల్, ఎస్‌ఎమ్‌ఎస్ లేదా టెలిఫోన్ల ద్వారా సంబంధిత శాఖలకు పంపుతారు. ఏ శాఖకు, ఏ అధికారికి సదరు విజ్ఞప్తిని పంపారో ఆ వివరాలను, చేపట్టిన చర్యలను సంబంధిత వ్యక్తికి ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా తెలుపుతారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞానదేశికన్, ప్రభుత్వ సలహాదారు షీలా బాలకృష్ణన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.         

మరిన్ని వార్తలు