వరాల జల్లు

20 Feb, 2016 03:14 IST|Sakshi
వరాల జల్లు

ప్రభుత్వ ఉద్యోగులకు అనేక రాయితీలను కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు.
మొత్తం 11 రాయితీలపై నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం నాటి అసెంబ్లీ సమావేశంలో వివరించారు.
దీంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
సమ్మెపై ఉద్యోగ సంఘాలు నేడు నిర్ణయం తీసుకోనున్నాయి.

 
* ప్రభుత్వ ఉద్యోగులకు 11 రాయితీలు
* అసెంబ్లీలో సీఎం జయలలిత వెల్లడి
* సమ్మె విరమణపై నేడు నిర్ణయం  
* ఏపీ పోలీసుల వైఖరికి నిరసనగా వాకౌట్

చెన్నై, సాక్షి ప్రతినిధి: చట్టసభలో 110 నిబంధన కింద ముఖ్యమంత్రి జయలలిత ఒక ప్రకటన చేశారు. నిపుణతతో కూడిన బాధ్యాయుత పాలన అందించడం మంచి ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. ఈ మార్గంలోనే తన ప్రభుత్వం పయనిస్తూ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు.  

అయితే ప్రభుత్వ ఆశయాలను అమలు చేసేది, అర్హులైన ప్రజలకు చేరవేసేదీ ఉద్యోగులేనని చెప్పారు. ప్రభుత్వ పాలనలో ఇంతటి ప్రాధాన్యత కలిగి ఉన్న ఉద్యోగుల క్షేమం కోరడం సీఎంగా తన బాధ్యతని చెప్పారు. ఉద్యోగులు టీఏ, డీఏ, పెన్షన్ తదితర అంశాలపై అనేక కోర్కెలను కోరారని అన్నారు.  ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరపాలని సీనియర్ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించానని అన్నారు. ఈ చర్చల్లో ఉద్యోగ సంఘాల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వం కొన్ని రాయితీలను అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

కుటుంబ బీమా, సంక్షేమ నిధి మొత్తాన్ని రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచుతున్నట్లు ఆమె తెలిపారు. ఈ పెంపు వల్ల కలిగే రూ.6 కోట్ల అదనపు భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. వైద్య సహాయ ప్రొఫెసర్లు,  గ్రామ సేవకలకు పదోన్నతలు, పౌష్టికాహార సిబ్బందికి వేతనం రూ.1500లుగా పెంపు, కారుణ్య నియామకాల సిబ్బంది ఉద్యోగాల క్రమబద్ధీకరణ, పెన్షన్ మొత్తాల పెంపుపై పరిశీలన కమిటీ నియామకం తదితర 11 రాయితీలను జయ ప్రకటించారు.

ఏపీ పోలీస్ తీరుకు నిరసనగా వాకౌట్: శ్రీవారి దర్శనానికని తిరుపతికి వెళ్లిన తూత్తుకూడికి చెందిన భక్తులను ఎర్రచందన స్మగ్లర్లుగా పరిగణించి అరెస్ట్ చేయడంపై అసెంబ్లీలో దుమారం రేగింది. తమిళుల పట్ల ఏపీ పోలీసుల తీరును గర్హిస్తూ చట్టసభలో మాట్లేందుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్, పీఎంకే, వామపక్షాలు, పుదియతమిళగం పార్టీల సభ్యులు కోరారు. తమిళుల అరెస్ట్‌పై ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకుందో సభకు వివరించాలని స్పీకర్‌ను వారు కోరారు.

మీ కోర్కెలను రికార్డు చేశాము, మరొకరు మాట్లాడాల్సి ఉంది, కూర్చోండని స్పీకర్ ఆదేశించారు. అక్రమ కేసులతో ఏపీ జైళ్లలో మగ్గుతున్న తమిళులను విడిపించేందుకు చర్యలు తీసుకోక పోగా అసెంబ్లీ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని నిరసిస్తూ విపక్షాల సభ్యులంతా వాకౌట్ చేశారు. ఏ నేరం చేయని అమాయకులను ఎర్రచందనం ఎగుమతి చేసినట్లు చూపుతూ ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రిన్స్ ఆరోపించారు. ఇంతటి ముఖ్యమైన అంశాన్ని సైతం సభలో ప్రస్తావించేందుకు స్పీకర్ అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు.
 
సమ్మెపై నేడు నిర్ణయం: ప్రభుత్వ ఉద్యోగులకు 11 రాయితీలను కల్పిస్తూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. రాయితీలను తాము స్వాగతిస్తున్నామని సంఘాలు పేర్కొన్నాయి. అయితే ఆయా రాయితీలను లోతుగా విశ్లేషించుకోవాల్సి ఉందని అన్నారు. రాయితీల పూర్తి వివరాలను అందిన తరువాతనే తమ అభిప్రాయాన్ని వెల్లడిచేయగలమని కొందరు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం రాయితీలు ప్రకటించిన కారణంగా ఈనెల 10వ తేదీ నుంచి జరుపుతున్న సమ్మెను విరమించాలా లేక కొనసాగించాలనే అనే అంశంపై కార్యాచరణ కమిటీ శనివారం సమావేశం కానుంది.

మరిన్ని వార్తలు