నిరాశ!

1 Oct, 2014 00:30 IST|Sakshi
నిరాశ!

 సాక్షి, చెన్నై: ‘అమ్మ’ బెయిల్ విషయమై కర్ణాటక కోర్టు ఏదేని నిర్ణయం తీసుకుంటుందన్న ఆశతో ఉన్న అన్నాడీఎంకే వర్గాలకు చివరకు మిగిలింది నిరాశే. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం కూడా శాంతియుతంగా నిరసనలు కొనసాగాయి. మదురై, తిరుచ్చి, కరూర్‌లలో బంద్ వాతావరణం నెలకొంది. ఆత్మహత్యకు యత్నించిన ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రుల్లో మృతి చెం దారు. ఆలయంలో పూజలు చేయబోనంటూ ఓ పూజారి కృష్ణగిరిలో వినూత్న నిరసనకు దిగారు. డీజీపీ కార్యాలయం ఎదుట ఓ పోలీసు హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్యకు యత్నిం చడం కలకలం రేపింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కటకటాల్లో ఉండడాన్ని ఆ పార్టీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. జయలలిత విడుదలకు డిమాండ్ చేస్తూ నిరసనలు తెలియజేస్తున్నాయి. కర్ణాటక హైకోర్టులో బెయిల్ లభిస్తుందన్న ఆశతో ఎదురు చూసిన అభిమానులు, పార్టీ శ్రేణులు మంగళవారం ఉదయం నుంచి టీవీలకు అతుక్కు పోయారు. అయితే, విచారణను ఆరో తేదీకి న్యాయమూర్తి వాయిదా వేయడంతో ఇంకెన్నాళ్లు తమ అమ్మ కారాగార వాసం అనుభవించాలో? అన్న మనో వేదనలో పడ్డారు. బెయిల్ వస్తుందన్న ఆశ ఆడియాశ కావడంతో మౌన దీక్షలు, నిరసన దీక్షల్లో నిమగ్నమయ్యారు.
 
 నిరసనలు: రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడీఎంకే శ్రేణులు వివిధ రూపాల్లో తమ నిరసనను తెలియజేశాయి. చెన్నైలో పలు చోట్ల నిరసన దీక్షలు నిర్వహించారు. నల్ల చొక్కాలు ధరించి డీఎంకే అధినేత ఎం కరుణానిధి, బీజేపీ నేత సుబ్రమణ్య స్వామికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు. కోయంబేడులో భారీ నిరసన చేపట్టారు. ఇందులో పలువురు కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం చేయడంతో నాయకులు అడ్డుకున్నారు. మదురై, తిరుచ్చి, కరూర్‌లో బంద్‌ను తలపించాయి. పలుచోట్ల భారీ మానవ హారాలు నిర్మించారు. దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. బస్సు సేవలు అంతంత మాత్రంగానే ఉండడంతో రోడ్లు నిర్మానుష్యమయ్యాయి. తంజావూరు, పుదుకోట్టై, పెరంబలూరుల్లోని ప్రజలు స్వచ్ఛందంగా నిరసనలో పాల్గొనడంతో పాక్షికంగా బంద్ వాతావరణం నెలకొంది. పురిట్చి భారతం నేత జగన్ మూర్తి నేతృత్వంలో పులిది వాక్కంలో నిరసన జరిగింది.
 
 పోలీసు ఆత్మహత్యాయత్నం : డీజీపీ కార్యాలయం ఎదుట ఓ పోలీసు ఆత్మహత్యకు యత్నించాడు. ఉదయాన్నే మెరీనా తీరంలోని డీజీపీ కార్యాలయం వద్దకు చేరుకున్న ఓ వ్యక్తి, జయలలిత విడుదలకు డిమాండ్ చేస్తూ, తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను మీద పోసుకుని నిప్పంటించుకునే యత్నం చేశారు. ఈ హఠాత్పరిణామాన్ని గుర్తించిన అక్కడి భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారించగా, అతడు తేని జిల్లా వరపట్టి స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వేల్ మురుగన్‌గా గుర్తించారు. జయలలిత జైలుకు వెళ్లడంతో మదురైలో ఆత్మహత్యాయత్నం చేసిన మురుగన్ కుమార్తె నాగలక్ష్మి, తంజావూరులో ఆత్మహత్యాయత్నం చేసిన కుప్పుస్వామి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఇక కృష్ణగిరిలో కావేరి అనే పూజారి వినూత్న నిరసన చేపట్టాడు. జయలలిత విడుదలయ్యే వరకు తంజైమారియమ్మన్ ఆలయంలో పూజలు చేసేది లేదని, భక్తులు కూడా దైవ దర్శనానికి రాకూడదంటూ భక్తులను అడ్డుకోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు