మిస్టరీ తేల్చాల్సిందే!

21 May, 2017 02:47 IST|Sakshi
మిస్టరీ తేల్చాల్సిందే!

తేనంపేటలో న్యాయవాది పుగలేంది ఫిర్యాదు
జయ మృతిపై 186 మందిపై అనుమానాలు
జాబితాలో పన్నీరు, శశికళ పేర్లు
కేంద్ర, రాష్ట్ర హోంశాఖలకు కూడా


సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మరణం వెనుక దాగి ఉన్న మిస్టరీని ఛేదిం చాల్సిందేనని పట్టుబడుతూ ఎంజీఆర్‌ నగర్‌కు చెందిన న్యాయవాది పుగలేంది తేనాంపేట పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. చిన్నమ్మ శశికళ, మాజీ సీఎం పన్నీరుసెల్వంతోపాటు 186 మందిపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ ఓ జాబితాను ఫిర్యాదుకు జత పరిచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హోం శాఖలకు, డీజీపీలకు సైతం ఫిర్యాదు చేశారు. తమిళుల అమ్మ జయలలిత మరణం వెనుక మిస్టరీ దాగి ఉందన్న ప్రచారం రాష్ట్రంలో సాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. అమ్మ నమ్మిన బంటు పన్నీ రుసెల్వం సైతం అనుమానం వ్యక్తం చేయడంతో ఆ ప్రచారానికి బలం చేకూ రింది.

విచారణ కమిషన్‌ ఏర్పాటు చేయాల్సిందేనని పన్నీరు శిబిరం పట్టుబడుతూ వస్తోంది. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా విచారణ జరిపించి తీరుతామన్న వ్యాఖ్యలను డీఎంకే వర్గాలు చేస్తూ వస్తున్నాయి. వ్యవహారం కోర్టుల వరకు వెళ్లిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో న్యాయవాది పుగలేంది శనివారం తేనాంపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మళ్లీ అమ్మ మరణం మిస్టరీ నినాదం తెర మీదకు వచ్చింది. ఈ ఫిర్యాదులో 186 మంది పేర్లను చేర్చడం గమనార్హం. దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హోం శాఖలకు, రాష్ట్ర డీజీపీకి సైతం ఆయన పంపించారు.

మిస్టరీ తేల్చాల్సిందే: న్యాయవాది పుగలేంది తేనాంపేట ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అందులో... అమ్మ ఆస్పత్రి పాలు, ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అన్నాడీఎంకే వర్గాలు స్పందిస్తూ వచ్చిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఆరోగ్యంగా తమ సీఎం ఉన్నారని ప్రజలందరూ భావిస్తూ వచ్చారని పేర్కొన్నారు. అయితే, డిసెంబర్‌ ఐదో తేదీ అర్ధరాత్రి జయలలిత ఇక లేదని ప్రకటించడం తమిళ ప్రజల్ని తీవ్ర ఆందోళనకు, ఆవేదనకు గురి చేసిందని గుర్తు చేశారు. అదే రోజు అర్ధరాత్రి నుంచి సీఎంగా పన్నీరుసెల్వం కొనసాగినట్టు పేర్కొన్నారు. అయితే, ఫిబ్రవరి ఏడో తేదీ వరకు ఎనిమిదిన్నర గంటల సమయంలో జయలలిత సమాధి వద్ద పన్నీరు సెల్వం చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో అనుమానాలు రేపినట్టు గుర్తు చేశారు. అమ్మ మరణంలో మిస్టరీ ఉందని, ఆయన సంధించిన వ్యాఖ్యల్లో ఆమె నెచ్చలి శశికళ కుటుంబం చుట్టూ అనుమానాలు బయలు దేరినట్టు వివరించారు.

 ఇందుకు సమాధానం ఇచ్చే రీతిలో ఆరోగ్య మంత్రి విజయభాస్కర్‌ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా పన్నీరు మీద నిందల్ని వేశారని గుర్తు చేశారు. జరిగిన, జరుగుతున్న ఘటనలు, సాగుతున్న పరిణామాలను బట్టి చూస్తే, జయలలిత హత్యకు గురయ్యారా? అన్న అనుమానాలు బయలు దేరాయని, రాజకీయ స్వలాభం కోసం ఉమ్మడిగా కుట్ర జరిగినట్టు తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు. సీఎంను పథకం ప్రకారం మట్టుబెట్టి , సహజమరణంగా చిత్రీకరించినట్టుగా అనుమానాలకు బలం చేకూరుతున్నట్టుగా తాజా పరిణామాలు ఉన్నాయన్నారు.

 మాజీ సీఎం పన్నీరుసెల్వం, శశికళ, అన్నాడీఎంకేకు చెందిన 127 మంది ఎమ్మెల్యేలు, అన్వర్‌ రాజా, సెంగొట్టవన్, గోపాలకృష్ణన్, జనార్దన్, వనరోజ, ఎస్‌ఆర్‌ విజయభాస్కర్‌ తదితర 37 మంది పార్లమెంట్‌ సభ్యులు, ముత్తుకరుప్పన్, సెల్వరాజ్, విజిలా సత్యనాంద్, నవనీతకృష్ణన్, వైద్యలింగం, ఎస్‌ఆర్‌ బాలసుబ్రమణియన్‌ తదితర 11 మంది రాజ్య సభ సభ్యులు, అన్నాడీఎంకే నేతలు పొన్నయ్యన్, మధుసూదనన్, బన్రూటి రామచంద్రన్, వలర్మతి, గోకుల ఇందిర, సీఆర్‌ సర్వతిలతో పాటు అపోలో ఆస్పత్రి డాక్టర్‌ ప్రతాప్‌ సీ రెడ్డి, ఆయన కుమార్తె సంగీత రెడ్డిల మీద అనుమానాలు ఉన్నాయని, జయలలిత మరణం గురించి వీళ్లందరికీ తప్పకుండా తెలిసి ఉంటుందని, అందుకే మిస్టరీ ఛేదింపునకు విచారణ జరిపించాల్సిందేనని పట్టుబట్టే పనిలో పడ్డారు.  పలు సమస్యలపై మీద తరచూ కోర్టుల్లో పిటిషన్లు వేయడంలో పుగలేంది ముందున్న విషయం తెలిసిందే. తాజా ఫిర్యాదు మీద పోలీసులు స్పందించని పక్షంలో, 186 మంది పేర్లతో కూడిన పిటిషన్‌ను మరికొద్ది రోజుల్లో కోర్టులో వేసినా వేయవచ్చు.

మరిన్ని వార్తలు