అమ్మ వరాలు

29 Sep, 2016 02:01 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ప్రజలకు దీపావళి అత్యంత ముఖ్యమైన పండుగ. పేద గొప్ప అనే తేడా లేకుండా ఆర్థిక పరిస్థితిని బట్టి దీపావళి పండుగను అట్టహాసంగా జరుపుకుంటారు. పెళ్లయిన తరువాత వచ్చే మొదటి దీపావళిని ‘తల దీపావళి’గా పరిగణించి కొత్త జంటను అత్తారింటి వారు ఆహ్వానిస్తారు. ఇలా అనేక ఆకర్షణలు కలిగిన దీపావళి పండుగను అప్పులు చేసైనా సందడి చేసుకుంటారు. ఇలా పలుకోణాల్లో ప్రాముఖ్యత కలిగిన దీపావళిని ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వ ఉద్యోగులకు పలు వరాలను ప్రకటించారు.

ఉద్యోగులు, కార్మికుల శ్రమకోర్చి కష్టించి పనిచేయడమే రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మూలకారణమని ఆమె వివరించారు. అపరిమితమైన శ్రమను తట్టుకుంటూ పలురకాల ఉత్పత్తులను అందించడం ద్వారా ఆర్థిక ప్రగతికి బాటలు వేయడంలో కార్మికుల పాత్ర బహు గొప్పదని చెప్పారు. అందుకే కార్మికులు, ఉద్యోగుల పనిభారానికి తగినట్లుగా ఫలితం పొందాలన్న ఉద్దేశంతోనే 2015-16 ఆర్థిక సంవత్సరంలో బోనస్, కారుణ్య భృతిని అందజేశానని సీఎం గుర్తు చేశారు. సవరించిన బోనస్ చట్టం-2015 ప్రకారం బోనస్ పొందేందుకు గరిష్ట వేతనం రూ.21 వేలు ఉండాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా పెంచబడినట్లు తెలిపారు. కేంద్రం చేసిన సవరణలతో నిమిత్తం లేకుండా సీ, డీ కేటగిరిలకు చెందిన ఉద్యోగులు, కార్మికులందరికీ బోనస్ ఇవ్వాలని తాను నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

బోనస్ జారీకి ఇప్పటికే రూ.3500గా ఉండిన నెలసరి గరిష్ట వేతనం సవరించిన బోనస్ చట్టాన్ని అనుసరించి రూ.7 వేలుగా పెంచబడిందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని 2015-16 ఆర్థిక సంవత్సర బోనస్, కారుణ్య భృతిని పంపిణీ చేసినట్లు సీఎం తెలిపారు. గరిష్ట వేతనంలో సవరణలు చేయడం వల్ల ఉద్యోగులు కనీసం రూ.8,400 పొందుతారని వివరించారు.

పజా పనులశాఖలో లాభాలు ఆర్జించిన, నష్టాలను ఎదుర్కొన్న విభాగాలను వేర్వేరుగా గుర్తించి బోనస్ అందజేస్తున్నట్లు తెలిపారు. సహకార, విద్యుత్‌శాఖల వారు కూడా 20 శాతం బోనస్‌కు అర్హులని ఆమె తెలిపారు. గృహ నిర్మాణ శాఖ వారికి 10 శాతం బోనస్ లభిస్తున్నట్లు తెలిపారు. వివిధ శాఖల ద్వారా బోనస్ కింద 3.67 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగికీ బోనస్ రూపేణా కనీసం రూ.8,400  నుంచి రూ.16,800 లభించడం ఖాయమని ఆమె స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తలు