‘రారాజు’కుసత్కారం

26 Nov, 2013 02:42 IST|Sakshi
 సాక్షి, చెన్నై : రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. దేశంలోనే తొలిసారిగా చెన్నైలో ప్రపంచ చెస్ చాంపియన్ టోర్నీ నిర్వహిం చేందుకు చర్యలు తీసుకుంది. ఇందుకు రూ.29 కోట్లను కేటాయించింది. ఈ నెల ఏడో తేదీన నెహ్రూ స్టేడియంలో ప్రపంచ చెస్ చాంపియన్ టోర్నీని ముఖ్యమంత్రి జయలలిత లాంఛనంగా ప్రారంభించారు. ఎనిమిదో తేదీ నుం చి నగరంలోని ఓ స్టార్ హోటల్‌లో చెస్ టోర్నీ ఆరంభం అయింది. టైటిల్ గెలుచుకోవడం లక్ష్యంగా భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్, నార్వేకు చెందిన 22 ఏళ్ల యువకుడు స్వెన్ మాగ్నస్ కార్ల్‌సెన్ తలపడ్డారు. పన్నెండు రౌండ్ల మ్యాచ్‌లో 6.5 పాయింట్లు సాధించిన వారే విజేతగా నిలుస్తారు. అయితే, పది రౌండ్లలోనే విజయం కార్ల్‌సెన్‌ను వరించింది. తొలుత డ్రా దిశగా రౌండ్లు సాగినా, ఐదు, ఆరు, తొమ్మిది రౌండ్లు కార్ల్‌సెన్‌కు అనుకూల వాతావరణాన్ని కలిగించడంతో ప్రపంచ చెస్ రారాజుగా నిలిచాడు.
 
 బహుమతి ప్రదానోత్సవం: ప్రపంచ చెస్ టైటిల్ దక్కిం చుకున్న విజేతకు బహుమతి ప్రదానోత్సవం సోమవారం ఉదయం నగరంలోని ఓ హోటల్‌లో ఘనంగా నిర్వహించారు. ఇందులో ప్రపంచ చెస్ రారాజు కార్ల్‌సెన్‌ను నీలగిరుల్లో లభించే అరుదైన ఆలివ్ ఆకులతో తయారు చేసిన హారంతో రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. ఈ వేడుక నిమిత్తం హోటల్ వద్దకు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి మహ్మద్ మజీముద్దీన్, క్రీడల అభివృద్ధి శాఖ కార్యదర్శి కే రాజారామన్, ఫిడే ప్రతినిధి హరిహరన్ ఘన స్వాగతం పలికారు. అఖిల భారత చెస్ సమ్మేళనం అధ్యక్షుడు జేసీడీ ప్రభాకర్ పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానించారు. ఫిడే అధ్యక్షుడు ఇల్లిం షినోను తమిళనాడు చెస్ సంఘం అధ్యక్షుడు వెంకటరామరాజ ఆహ్వానం పలికారు. ముందుగా తమిళ్ తాయ్ వాల్త్, ఫిడే పాటల్ని ప్రార్థనా గీతంగా ఆలపించడం విశేషం. 
 
 సత్కారం: ఫిడే ప్రపంచ చెస్ టోర్నీ టైటిల్ విజేత కార్ల్‌సెన్, రన్నరప్‌గా నిలిచిన ఆనంద్‌ను బంగారు, వెండి పతకాలతో ఆ సంస్థ అధ్యక్షుడు ఇల్లిం షినో సత్కరించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత చేతుల మీదుగా సత్కారం చేశారు. ఆనంద్‌కు 1350 గ్రాముల వెండితో తయారు చేసిన షీల్డ్‌ను, రూ.ఆరు కోట్ల  మూడు లక్షల నగదు బహుమతితో కూడిన చెక్‌ను అందజేశారు. అనంతరం రారాజు కార్ల్‌సెన్‌కు నీలగిరి కొండల్లో లభించే అరుదైన ఆలివ్ ఆకులతో తయారు చేసిన హారాన్ని జయలలిత అందజేశారు. అలాగే, 3.5 కిలోల బంగారం పూతతో సిద్ధం చేసిన షీల్డ్‌ను బహుకరించారు. రూ. 9.90 కోట్ల ఫ్రైజ్ మనీని చెక్కు రూపంలో అందజేశారు. చివరగా భారత జాతీయ గీతంతో పాటుగా నార్వే జాతీయ గీతంతో 2013 చెస్ టోర్నీ టైటిల్ విజేత బహుమతి ప్రదానోత్సవాన్ని ముగించారు. 
 
మరిన్ని వార్తలు