ఫ్రీ ఫోన్లు.. సగం ధరకే స్కూటీలు

6 May, 2016 04:56 IST|Sakshi
ఫ్రీ ఫోన్లు.. సగం ధరకే స్కూటీలు

* జయలలిత ఎన్నికల హామీలు
* 100 నుంచి 750 యూనిట్ల వరకూ ఉచిత కరెంటు
* ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం.. రైతు రుణాల మాఫీ

సాక్షి, చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో తాము గెలిస్తే రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఉచితంగా మొబైల్ ఫోన్లు అందిస్తామని, మహిళలకు 50% రాయితీపై స్కూటర్లనూ అందిస్తామని పేర్కొంటూ అధికార అన్నా డీఎంకే అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత పలు ‘ఉచిత’ హమీలను ప్రకటించారు. పొంగల్ పండుగ సమయంలో కో-ఆప్టెక్స్ నుంచి చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడానికి రూ.500 విలువచేసే కూపన్లు పంపిణీ చేస్తామన్నారు.

11, 12 తరగతుల విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు అందించే పథకాన్ని కొనసాగిస్తామనీ, ఉచిత ఇంటర్నెట్ సదుపాయాన్నీ కల్పిస్తామని చెప్పారు. రైతు రుణాలను మాఫీ చేస్తామని.. గృహ వినియోగదారులకు 100 యూనిట్ల వరకు, నేత కార్మికులకు కేటగిరీల వారీగా 200 నుంచి 750 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తామని ప్రకటించారు. గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్తు వల్ల 78 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ నెల 16న జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి అన్నా డీఎంకే పార్టీ మేనిఫెస్టోను గురువారం ఈరోడ్ జిల్లా పెరుందురైలో జయలలిత విడుదల చేశారు.

గురువారం నాడే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, తమ మిత్రపక్షమైన డీఎంకే అధినేత కరుణానిధితో కలిసి తమిళనాడులో ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. అన్నాడీఎంకే వ్యూహాత్మకంగా ఇదే రోజు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. మేనిఫెస్టో ముఖ్యాంశాలు
 
* వృత్తి విద్యా శిక్షణనిచ్చి ప్రతి ఇంటి నుంచి ఒకరికి ఉద్యోగం
* దశల వారీగా రాష్ట్రంలో మద్యనిషేధం అమలు
* బహిరంగ ప్రదేశాల్లో ఉచిత వైఫై సౌకర్యం
* ప్రభుత్వ ఆధీనంలో నడిచే కేబుల్ టీవీ సంస్థల కనెక్షన్లు తీసుకునే వారికి ఉచిత సెట్ టాప్ బాక్సుల పంపిణీ
* ప్రసూతి సెలవులు తొమ్మిది నెలలకు పెంపు, ప్రసూతి సాయం రూ. 12,000 నుంచి 18,000 కు పెంపు
* ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణాలకు రూ. 40 లక్షల వరకు సాయం
* ఈఎంఐ తరహాలో అమ్మ బ్యాంకింగ్ కార్డులు  
* అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రత్యేక ఫౌండేషన్
* పెళ్లి చేసుకునే జంటలకు  ఇస్తున్న మంగళసూత్రాల్లో బంగారం 4 గ్రాముల నుంచి 8 గ్రాములకు పెంపు
* లోకయుక్త ఏర్పాటు
 

మరిన్ని వార్తలు