వదంతులకు చెక్

2 Oct, 2016 07:00 IST|Sakshi
వదంతులకు చెక్

 గవర్నర్ ప్రకటనతో ఊరట
 అన్నాడీఎంకే శ్రేణుల్లో ఆనందం

 
 అమ్మ జయలలిత ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు చెక్ పెట్టే పరిణామం శనివారం చోటు చేసుకుంది. రాష్ట్ర గవర్నర్ (ఇన్‌చార్‌‌జ) విద్యాసాగర్‌రావు అమ్మను పరామర్శించారు. అనంతరం విడుదల చేసిన ప్రకటన అన్నాడీఎంకే శ్రేణుల్లో ఆనందాన్ని నింపింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం జయలలిత త్వరగా కోలుకోవాలని గవర్నర్ ఆకాంక్షించడం గమనార్హం.
 
 సాక్షి, చెన్నై: జ్వరం, డీ హైడ్రేషన్‌తో సీఎం జయలలిత గత నెల 22వ తేదీ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరిన జయలలితకు అక్కడ వైద్య బృందం మెరుగైన సేవల్ని అందిస్తూ వస్తున్నారు. వారం రోజుల పాటు అమ్మ ఆరోగ్యంపై ఆసుపత్రి వర్గాలు బులిటెన్ విడుదల చేశారు. తదుపరి బులిటెన్‌లు ఆగడం, అన్నాడీఎంకే వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
 
 అదే సమయంలో సీఎం జయలలితకు వ్యతిరేకంగా గత రెండు రోజులుగా వదంతులు హోరెత్తే పనిలో పడ్డాయి. అదే సమయంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి స్పందిస్తూ, సీఎం ఆరోగ్యంపై అధికారిక ప్రకటన, ఫొటోతో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అయితే, అలాంటి ప్రయత్నాలు జరగని దృష్ట్యా, వదంతులు మరింతగా హల్‌చల్ చేశాయి. వీటిపై పోలీసులు తీవ్రంగా స్పందించే పనిలో పడ్డారు. వదంతులు సృష్టించే వారిపై చర్యలకు సిద్ధం అవుతూ, తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ పరిస్థితుల్లో శనివారం ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. లండన్ నుంచి వచ్చిన డాక్టర్ రిచర్డ్ అమ్మకు వైద్య సేవల్ని విస్తృతం చేసే పనిలో పడ్డారు.
 
 వదంతులకు చెక్:
 శనివారం అమ్మ ఆరోగ్యంపై పుకార్లు షికార్లు చేయడంతో ఉత్కంఠ బయలు దేరింది. అయితే, అమ్మ ఆరోగ్యంగానే ఉన్నారని, ఆమెకు చికిత్స కొనసాగుతుందని , ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అపోలో ఆసుపత్రి వద్ద ఉన్న అన్నాడీఎంకే అధికార ప్రతినిధి వలర్మతి భరోసా ఇస్తూ వచ్చారు. ప్రజల గురించి ఆలోచించే అమ్మ జయలలిత ప్రజా సేవను ఆసుపత్రి నుంచే కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు.  అలాగే,  ఆ పార్టీ నేత బన్రూటి రామచంద్రన్ స్పందిస్తూ, డాక్టర్ రిచర్డ్ నేతృత్వంలో అమ్మకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని, త్వరితగతిన కోలుకుని ప్రజల్లోకి వస్తారన్న ధీమా వ్యక్తం చేశారు.
 
అయితే, ఫొటోలు విడుదల చేయాల్సిన అవసరం లేదని, ప్రజలకు తాము సమాధానం ఇవ్వాలేగానీ, ప్రతి పక్షాలకు కాదని పరోక్షంగా కరుణానిధికి చురకలు అంటిస్తూ, అమ్మ ఆరోగ్యంగా ఉన్నారన్న ధీమాను మరో మారు వ్యక్తం చేశారు. అయినప్పటికీ వదంతులు సాగడం, రాష్ట్ర గవర్నర్(ఇన్‌చార్‌‌జ) విద్యాసాగర్ రావు అపోలో ఆసుపత్రికి సాయంత్రం ఆరేడు గంటలకు రానున్న సమాచారంతో అధికారిక ప్రకటన వెలువడొచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో ఆ పరిసరాల్లో భద్రతను మరింత పటిష్టం చేయడంతో మీడియా దృష్టి అంతా అపోలో ఆసుపత్రి వైపుగా మరలింది. ఆరున్నర గంటల సమయంలో ఆసుపత్రికి చేరుకున్న గవర్నర్ విద్యా సాగర్‌రావు అర గంట పాటు అక్కడ  ఉండి తిరుగు పయనం అయ్యారు. కాసేపటికి రాజ్ భవన్ నుంచి విడుదలైన ప్రకటనతో అన్నాడీఎంకే వర్గాల్లో ఆనందం వికసించింది. అలాగే, వదంతులకు చెక్ పెట్టినట్టు అయింది.
 
 ప్రకటనతో ఊరట:
 అమ్మ చికిత్స పొందుతున్న  వార్డులోకి తాను వెళ్లినట్టు, అక్కడ అందిస్తున్న వైద్య పరీక్షలను పరిశీలించినట్టు గవర్నర్ విద్యాసాగర్‌రావు తన ప్రకటనలో వివరించారు. వైద్యుల్ని అడిగి చికిత్సా వివరాలు తెలుసుకున్నట్టు పేర్కొన్నారు. సీఎం జయలలిత కోలుకుంటున్నట్టు వైద్యులు తన దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఆమె త్వరితగతిన కోలుకోవాలని తాను ఆశాభావం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా వైద్య బృందానికి గవర్నర్ ధన్యవాదాలు తెలియజేశారు. ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, రాష్ట్ర మంత్రులు ఓ పన్నీరు సెల్వం, ఎడపాడి పళనిస్వామి, తంగమణి, ఎస్‌పీ వేలుమణి, సి.విజయ భాస్కర్, రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు, సలహాదారు షీలా బాలకృష్ణన్ గవర్నర్ విద్యా సాగర్ రావుతో ఉన్నారు.
 

>
మరిన్ని వార్తలు