ఆశ... నిరాశ

8 Oct, 2014 02:45 IST|Sakshi
ఆశ... నిరాశ

బెంగళూరు : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ అర్జీ విచారణ సందర్భంగా హైకోర్టు ఎదుట మంగళవారం హైడ్రామా నెలకొంది. ఉదయం నుంచే అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు, జయలలిత అభిమానులు పెద్దసంఖ్యలో కోర్టు వద్దకు చేరుకున్నారు. దీంతో  పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.  ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే హైకోర్టు ఆవరణంలోకి అనుమతించారు. నగరంలో తమిళులు అత్యధికంగా నివసించే శ్రీరాంపుర, హలసూరు, జీవన్‌బీమానగర్, ఇందిరానగర్, హెచ్‌ఎఎల్ పరిసర ప్రాంతాలు, ఐటీఐ గేట్, పులకేశీనగర్, ఎంఎస్‌పాళ్య, జేపీనగర రెండవ స్టేజ్, జయనగర ఐదు, తొమ్మిదవ బ్లాక్‌లు, మురగేష్ పాళ్య, దొమ్మలూరు, భారతీ నగర్, గౌతమ్ నగర్ తదితర ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి అదనపు బలగాలను మొహరింపజేశారు.  

తొలుత హైకోర్టులో వాదనలు జరుగుతుండగానే జయలలితకు బెయిల్ చిక్కిదంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో కోర్టు బయట ఉన్న జయలలిత అభిమానులు ఒక్కసారిగా బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచారు. హొసూరు రోడ్డులోని హొసరోడ్డు జంక్షన్, చందాపుర, అత్తిబెలె తదితర ప్రాంతాల్లోనూ సంబరాలు నిర్వహించారు. ఈ ఉత్సాహం కొద్దిసేపటిలోనే నీరుగారిపోయింది. బెయిల్ నిరాకరణ అయినట్లు తెలియడంతో చెన్నైకు చెందిన సరళ(40) ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆమెను అంబులెన్స్‌లో సెయింట్ జాన్స్ ఆస్పత్రికి తరలించారు. రెండు గంటలకు పైగా అభిమానులు తమ చేతుల్లో జయలలిత చిత్రాన్ని ఉంచుకుని బోరుమని విలపించారు. అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా...  జయలలితకు బెయిల్ నిరాకరణ కావడంతో హొసూరు రోడ్డులోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న బెంగళూరు నగర అదనపు పోలీస్ కమిషనర్ అలోక్‌కుమార్ హుటాహుటిన అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వెంటనే అదనపు బలగాలను రంగంలోకి దింపారు. పరప్పన అగ్రహార కేంద్ర కారాగారం చుట్టూ ఒక కిలో మీటరు వరకు నిషేదాజ్ఞలు విధించారు. నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఏసీపీ హెచ్చరించారు. ముందు జాగ్రత్త చర్యగా హొసూరు రోడ్డులోని పలు ప్రాంతాల్లో టియర్ గ్యాస్ వాహనాలను సిద్ధంగా ఉంచారు.

తమిళనాడుకు కేఎస్‌ఆర్టీసీ     బస్సు సర్వీసులు రద్దు

హైకోర్టు తీర్పుతో వెంటనే కేఎస్‌ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. తమిళనాడులోని ఉన్న తమ సంస్థకు చెందిన వాహనాలను తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ సురక్షిత ప్రాంతంలో ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కేఎస్‌ఆర్టీసీ బస్సులపై దాడులు చేయవచ్చునన్న అనుమానంతో తమిళనాడుకు బస్సు సర్వీసులను రద్దు చేశారు. దీంతో చెన్నైలో కేఎస్‌ఆర్టీసీకి చెందిన 150 బస్సులు నిలిచిపోయాయి.  తమిళనాడు బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే బెంగళూరులోకి అనుమతిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు