పన్నీరుకే పగ్గాలు

13 Oct, 2016 04:57 IST|Sakshi

    జయ కోసం రోడ్డుపైనే  పూజలు
     21 రోజులుగా ఆసుపత్రిలోనే అమ్మ
     నేడు లండన్ వైద్యుల రాక
     అమ్మ కోసం ఆత్మాహుతి యత్నం
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దశలో రాష్ట్ర పరిపాలనా పగ్గాలను సీనియర్ మంత్రి పన్నీర్‌సెల్వం చేపట్టారు. సీఎం జయ పర్యవేక్షిస్తున్న శాఖలను పన్నీర్‌సెల్వంకు అప్పగిస్తూ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు మంగళవారం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అంతేగాక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంశానికి తెరపడింది. ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్న హోం, ప్రజాపనులు, ఐఏఎస్, ఐపీఎస్ తదితర శాఖలను ఇక పన్నీర్‌సెల్వమే పర్యవేక్షిస్తారని గవర్నర్ పేర్కొన్నారు. ఇకపై జరిగే కే బినెట్ సమావేశాలకు సైతం పన్నీర్‌సెల్వం అధ్యక్షత వహిస్తారు. గవర్నర్ ప్రకటన వెలువడగానే ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పన్నీర్‌సెల్వంను కలిశారు. ముఖ్యమంత్రిగా జయలలితనే కొనసాగుతారని రాజ్‌భవన్ స్పష్టం చేసింది.
 
సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత కోలుకోవాలని ప్రార్థిస్తూ పార్టీ శ్రేణులు జరుపుతున్న పూజలతో అపోలో ఆసుపత్రి పరిసరాలు ఆలయాలను తలపిస్తున్నాయి. జయ ఫొటో చేతపట్టుకుని ప్రార్థనల్లో మునిగి తేలుతున్నారు.

అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరి బుధవారానికి 21 రోజులైంది. అమ్మ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడే వరకు ఆసుపత్రిలోనే మరికొంత కాలం గడపాలని అపోలో వైద్యులు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. కొంతకాలం అనే మాటలతో గడువును పొడిగిస్తూ పోతున్నారు. అమ్మ నేడో రేపో విడుదల అవుతారనే ఆశలతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఉదయం నుంచి రాత్రి వరకు ఆసుపత్రి వద్దనే పడిగాపులు కాస్తున్నారు. కొందరు నేతలు ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద పూజలు, హారతులు ఇస్తూ అపోలో ఆలయ పరిసరాలను ఆలయ ప్రాంగణంలా మార్చివేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కేపీ కందన్ చెన్నై తిరువాన్మియూరు మరుందీశ్వరర్ ఆలయంలో అమ్మ కోసం మృత్యుంజయ యాగాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి వలర్మతి ఎంజీఆర్ నగర్‌లోని వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. కోవైలో 25 వేల పాలకలశాలతో ఊరేగింపు నిర్వహించారు. అలాగే చెన్నైలోని ఐదు వేల పాలకలశాలతో ప్రార్థనలు చేశారు. అనేక ఆలయాల్లో పూజలు నిర్వహించి అపోలోకు చేరుకున్న మాజీ మంత్రి గోకుల ఇందిరకు చేదు అనుభవం ఎదురైంది. ఆలయాల్లో పూజలు చేసిన ప్రసాదాన్ని జయకు అందజేస్తానని అపోలో ఆసుపత్రిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు గట్టిగా అడ్డుకున్నారు. దీంతో చేసేదేమి లేక అక్కడి మహిళా నేతలతోనే ఉండిపోయారు.

 అపోలో వద్ద అరుణ్‌జైట్లీ, అమిత్‌షా:
జయను పరామర్శించే నిమిత్తం కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా బుధవారం అపోలోకు వచ్చారు. కొద్దిసేపు వైద్యులతో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.

నేడు లండన్ వైద్యుల రాక:
జయకు చికిత్స నిమిత్తం గతంలో రెండుసార్లు చెన్నైకి వచ్చిన అంతర్జాతీయ వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ జాన్‌బీలే గురువారం మరోసారి లండన్ నుండి వస్తున్నారు. ఐదు రోజులపాటూ చెన్నైలోనే ఉండి జయకు చికిత్స అందిస్తారు.

వదంతులపై పోలీస్ సీరియస్:
జయ అనారోగ్యంపై సామాజిక మాధ్యమాల ద్వారా వదంతులు పుట్టిస్తున్న వారిపై పోలీస్ శాఖ సీరియస్‌గా ఉంది. ఇప్పటికే  సతీష్‌కుమార్, మాడస్వామి అనే ఇద్దరు యువకులను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. బెంగళూరుకు చెందిన మరో యువతిని అరెస్ట్ చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే 52 మందిపై కేసులు బనాయించగా, వారందరి సామాజిక మాధ్యమాల అకౌంట్‌లను సైబర్ క్రైం పోలీసులు స్తంభిపజేస్తున్నారు.

ఆత్మాహుతి యత్నం:       
అమ్మ ఆనారోగ్యానికి గురికావడాన్ని తట్టుకోలేక చెన్నై  తాంబరం సమీపంలో సద్గుణం అనే  యువ  కార్యకర్త బుధవారం సాయంత్రం ఆత్మాహుతి యత్నానికి పాల్పడ్డాడు. తీవ్రగాయాలకు గురైన అతడిని క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
 

మరిన్ని వార్తలు