సామరస్యమేనా?

1 Jul, 2014 04:43 IST|Sakshi
సామరస్యమేనా?

 సాక్షి, చెన్నై:రాష్ర్ట ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, ఆమె నెచ్చిలి శశికళపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ,  ఆదాయపు పన్ను ఎగవేత కేసుల విచారణ సాగుతున్న విషయం తెలిసిందే. ఆస్తులు గడించిన కేసు బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానంలో, పన్ను ఎగవేత కేసు చెన్నై ఎగ్మూర్ కోర్టులోనూ ఏళ్ల తరబడి సాగుతోంది. ఆదాయపు పన్ను ఎగవేత : జయలలిత, శశికళ భాగస్వామ్యంలోని శశి ఎంటర్ ప్రెజైస్‌కు సంబంధించి 1991-92,1992-93 సంవత్సరానికి గాను ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయలేదు. అలాగే, 1993-94కు గాను జయలలిత, శశికళ వ్యక్తిగతంగా తమ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయలేదు. దీన్ని గుర్తించిన డీఎంకే సర్కారు కేసులు దాఖలు చేసింది. ఆదాయపు పన్ను ఎగవేత వ్యవహారం చెన్నై ఎగ్మూర్ ప్రధాన మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో ఆర్థిక నేరాల విచారణ కోర్టులో సాగుతోంది. ఏళ్ల తరబడి వాయిదాల మీద వాయిదాలతో విచారణ సాగుతోంది.
 
 విముక్తి : ఈ కేసు నుంచి తమకు విముక్తి కల్పించాలంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌కు చుక్కెదురు కావడంతో జయలలిత, శశికళ చివరకు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే, విచారణను నాలుగు నెలల్లో ముగించి తీర్పు ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో ఎగ్మూర్ కోర్టు న్యాయమూర్తి దక్షిణా మూర్తి నేతృత్వంలో విచారణ వేగం పెరిగింది. నిర్విరామంగా వాయిదాలతో విచారణ సాగుతోంది. ఈ సమయంలో పలు మార్లు కోర్టుకు రావాలంటూ జయలలిత, శశికళకు కోర్టు నోటీసులు పంపింది. అయితే, వారు డుమ్మాల పర్వం కొనసాగించారు. దీంతో విచారణను తుది దశకు చేర్చేందుకు న్యాయమూర్తి దక్షిణామూర్తి నిర్ణయించారు.
 
 మలుపు : సోమవారం విచారణ సందర్భంగా కేసు మలుపు తిరిగింది. జయలలిత, శశికళ తరపున కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆదాయపు పన్ను శాఖకు జయలలిత, శశికళలను ఓ విజ్ఞప్తి చేసుకున్నట్టు వివరించారు. సామరస్య పూర్వకంగా, జరిమానాలతో సమస్యను పరిష్కరించుకుందామని అందులో సూచించినట్టు పేర్కొన్నారు. దీన్ని పరిశీలించిన న్యాయమూర్తి దక్షిణామూర్తి ఆదాయపు పన్ను శాఖ తరపు న్యాయవాది రామస్వామికి ప్రశ్నల్ని సంధించారు. జయలలిత, శశికళ తరపు వచ్చిన విజ్ఞప్తి వాస్తవేమనని, ఆ విజ్ఞప్తి పరిశీలనలో ఉందని స్పష్టం చేశారు. ఆదాయపు పన్ను శాఖ నిబంధనల మేరకు సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరించుకునేందుకు వీలుందని గుర్తు చేశారు. అదే సమయంలో తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేయాలని, అంతలోపు సమస్య సామరస్య పూర్వకం అవుతుందంటూ జయలలిత తరపు న్యాయవాదులు వాదన వినిపించారు. దీంతో తదుపరి విచారణను జూలై 24వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయించారు. ఆదాయపు పన్ను ఎగవేత కేసు సామరస్యంగా పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో అధికారంలో అన్నాడీఎంకే ప్రభుత్వం ఉన్న దృష్ట్యా, ఇక జయలలిత తరపున సామరస్య పూర్వక పరిష్కార విజ్ఞప్తి వచ్చిన దృష్ట్యా, సానుకూలంగా జరిమానాలతో కేసును ముగించేయడం తథ్యం.
 

>
మరిన్ని వార్తలు