సింగపూర్‌కు జయలలిత తరలింపు?

24 Sep, 2016 18:27 IST|Sakshi
సింగపూర్‌కు జయలలిత తరలింపు?

తీవ్రజ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను మెరుగైన చికిత్స కోసం సింగపూర్ తరలిస్తున్నట్లు కథనాలు వచ్చాయి. ఆమెకు మధుమేహం ఎక్కువ స్థాయిలో ఉండటం, దానికి తోడు కిడ్నీ సంబంధిత సమస్య కూడా ఉండటంతో చికిత్స కోసం ఆమెను సింగపూర్ పంపుతున్నట్లు ఆస్పత్రి వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఛానళ్లు పేర్కొన్నాయి.ఆమెకు జ్వరం తగ్గింది గానీ ప్రస్తుతం ఇంకా అబ్జర్వేషన్‌లో ఉన్నారని వైద్యులు అంటున్నారు. జయలలిత త్వరగా కోలుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు, పూజలు జరుగుతున్నాయి. ప్రస్తుతం జ్వరం తగ్గడంతో ఆమెకు సాధారణ ఆహారాన్నే ఇస్తున్నట్లు అపోలో ఆస్పత్రి ఓ ప్రకటనలో తెలిపింది.

అయితే.. అమ్మకు అంతా బాగానే ఉందని, అందువల్ల ఆమెను సింగపూర్ తరలించడం లేదని.. అపోలో ఆస్పత్రి నుంచి కూడా త్వరలోనే డిశ్చార్జి అవుతారని అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. దీనిపై అధికారికంగా మాత్రం ఇంతవరకు ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.

ఆస్పత్రి బయట పలువురు మంత్రులతో పాటు అన్నాడీఎంకే మద్దతుదారులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. జయలలిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమెకు బొకే పంపారు. అందుకు ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. సీఎం అనారోగ్యంతో ఆస్పత్రి పాలు కావడం ఆందోళనకరంగా ఉందని.. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తమిళనాడు ఇన్‌చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు. సీఎం జయలలిత త్వరితగతిన కోలుకోవాలని దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమలహాసన్ ట్విట్టర్ ద్వారా ఆకాంక్షించారు.

 

మరిన్ని వార్తలు