నేడే అమ్మ పట్టాభిషేకం

23 May, 2016 06:53 IST|Sakshi
నేడే అమ్మ పట్టాభిషేకం

సాక్షి, చెన్నై : తమిళనాట ఈ సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు ఇచ్చిన తీర్పు రికార్డులకు దారి తీశాయి. 134 స్థానాల్ని అమ్మకు కట్టబెట్టిన ఓటర్లు, 89 స్థానాల్ని డీఎంకేకు అప్పగించి బలమైన ప్రతి పక్షాన్ని నిలబెట్టారు. ఓటరు తీర్పు అధికార పక్షానికి ఆనందాన్ని ఇచ్చినా, అదే సమయంలో బలమైన ప్రతిపక్షం ఎదురుగా కూర్చుం టుండడం కొంత మేరకు ఇరకాటమే. ఈ పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం కొలువు దీరేందుకు సర్వం సిద్ధమైంది. ఆరోసారిగా అమ్మ జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు రెడీ అయ్యారు.

ఆమెతో పాటుగా 29 మంది మంత్రులు ప్ర మాణ స్వీ కారం చేయనున్నారు. ఇందు కు వేదికగా మద్రాసు వర్సి టీ అన్నా శత జయంతి స్మారక  ఆడిటోరియం నిలవనుంది. 2011లో ఇదే వేదిక నుంచే పగ్గాలు చేపట్టిన జయలలిత మళ్లీ ప్రజాహిత సుపరిపాలన అందించాలన్న కాంక్షతో కొత్త ఉద్వేగంతో పరుగులు తీయడానికి సిద్ధమయ్యారు.
 
సర్వం సిద్ధం : మద్రాసు వర్సిటీ సెంటినరీ హాల్‌లో ప్రమాణ స్వీకారోత్సవానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లను అధికార వర్గాలు పూర్తి చేశాయి. అసెంబ్లీకి ఎన్నికైన అధికార, ప్రతిపక్షాలకు చెందిన 232 మందికి , రాష్ట్రంలోని 39 మంది పార్లమెంట్ సభ్యులు, అన్ని పార్టీల రాజ్య స భ సభ్యులకు, ఆయా రాష్ట్రాల్లో ముఖ్యులుగా ఉన్న ప్రధాన పార్టీల అధినేతలకు ఆహ్వానాలు పలికి ఉన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్ పర్యటనకు వెళ్లడంతో ఆయన తరఫున ప్రమాణ స్వీకారోత్సవానికి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, రవిశంకర్ ప్రసాద్ హాజరు కానున్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్,  ఉత్తర ప్రదేశ్ సీఎం అఖిలేష్‌యాదవ్, బీహార్ సీఎం నితీష్‌కుమార్ హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

వీరందరితో పాటుగా 3,150 మందికి ప్రమాణ స్వీకార ఆహ్వాన పత్రిక రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెళ్లి ఉన్నది. డీఎంకే అధినేత కరుణానిధి, కోశాధికారి ఎంకే స్టాలిన్‌లకు కూడా అధికారులు ఆహ్వానం ఇచ్చినట్టు సమాచారం. ఇక, అమ్మ ప్రమాణ స్వీకారోత్సవాన్ని అన్నాడీఎంకే వర్గాలు, ప్రజలు తిలకించేందుకు వీలుగా 32 జిల్లాల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఉన్నారు. అలాగే, 72 ప్రధాన ప్రాంతాల్లో మొబైల్ ఎల్‌ఈడీ స్రీన్స్‌తో కూడిన వాహనాల్ని సిద్ధం చేశారు.

అలాగే, వేడుక జరిగే సెంటినరీ హాల్  పరిసరాల్లో మూడు భారీ స్కీన్స్‌ను ఏర్పాటుచేశారు. సరిగ్గా పదిన్నర పద కొండు గంటలకు పోయెస్ గార్డెన్ నుంచి జయలలిత , మంత్రుల బృందం ఆడిటోరియానికి బయలు దేరనుంది. పన్నెండు గంటల ప్రాంతంలో రాష్ర్ట గవర్నర్ రోశయ్య అక్కడికి చేరుకుంటారు. తదుపరి ప్రమాణ స్వీకారోత్సవ వేడుక జరుగుతుంది. ప్రమాణ స్వీకారోత్సవం నిమిత్తం పోయెస్ గార్డెన్ నుంచి రాధాకృష్ణన్ సాలై మీదుగా మెరీనా తీరం వెంబడి మద్రాసు వర్సిటీకి వెళ్లే అమ్మకు బ్రహ్మరథం పట్టేందుకు అన్నాడీఎంకే వర్గాలు సిద్ధమయ్యాయి.

దారి పొడవున ఆమెకు పుష్పాలు చల్లి ఆహ్వానం పలికేందుకు ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఆ తీరం వెంబడి అమ్మకు ఆహ్వానం పలికే హోర్డింగ్స్, ఫ్లెక్సీలు వెలిసి ఉన్నాయి. ఇక, కాన్వాయ్‌లోకి జనం చొచ్చుకు రాకుండా ఆ తీరం వెంబడి బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. నిఘాను కట్టుదిట్టం చేశారు. సెంటినరీ హాల్ పరిసరాల్ని భద్రతా వలయంలోకి తీసుకొచ్చారు. ఆహ్వాన పత్రిక లు ఉన్న వాళ్లను మాత్రమే ఆ హాల్‌లోకి అనుమతిస్తారు.

ఇక, ఈ ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం సీఎం జయలలిత , మంత్రుల బృందం సచివాలయానికి వెళ్లనున్నారు. అక్కడ తమ తమ చాంబర్‌లలో బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా, 2011లో అధికార పగ్గాలు చేపట్టగానే, ఐదు కీలక హామీల అమలుకు తొలి సంతకం చేసిన జయలలిత 2016లో ఏ ఏ అంశాల్ని కీలకంగా తీసుకుని తొలి సంతకం పెడతారో అన్న ఎదురు చూపులు పెరిగాయి.

మరిన్ని వార్తలు