సామరస్యం!

31 May, 2014 00:47 IST|Sakshi
సామరస్యం!

కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంతో సామరస్య పూర్వకంగా మెలిగేందుకు సీఎం జయలలిత నిర్ణయించారు. ప్రధాని మోడీతో సీఎం జయలలిత భేటీకి అధికార యంత్రాంగం ముహూర్తం కుదిర్చింది. ఈనెల మూడో తేదీన ఢిల్లీకి జయలలిత బయలుదేరనున్నారు. రాష్ట్రంలోని సమస్యల్ని కొత్త ప్రధానికి ఏకరువు పెట్టేందుకు వినతి పత్రం సమర్పించనున్నారు.
 
- మోడీతో జయ భేటీకి ముహూర్తం
- మూడున ఢిల్లీకి పయనం
- సమస్యలతో వినతి పత్రం

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సర్కారు రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి యూపీఏ సర్కారు సవతి తల్లి ప్రేమను చూపిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. విద్యుత్ వాటాలో కోత, కిరోసిన్ కోటా తగ్గింపు, అభివృద్ధి నిధుల పంపిణీలో చిన్న చూపు, కరువు సాయంలో కోతలు.. ఇలా అనేక రకాల ఇబ్బందులను కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో లోక్‌సభ ఎన్నికల ద్వారా అత్యధిక సీట్లను కైవశం చేసుకుని పీఎం కుర్చీ చేజిక్కించుకోవడం లేదా, కేంద్రప్రభుత్వంలో కీలక భూమి పోషించాలన్న లక్ష్యంగా ముందుకు సాగిన జయలలితకు నిరాశ తప్పలేదు. రాష్ట్రంలో 37 స్థానాలను చేజిక్కించుకున్నా, కేంద్రంలో పూర్తిస్థాయి మెజారిటీతో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టడంతో మిన్నుకుండిపోయారు.

మోడీ నుంచి ఆహ్వానం :
నరేంద్రమోడీ జయలలితకు మంచి మిత్రుడన్నది అందరికీ తెలిసిందే.  పీఎం కుర్చీ లక్ష్యంగా సాగిన ఎన్నికల సమరంలో విజయం మోడీని వరించడం పరోక్షంగా జయలలితకు ఆనందమే. అయితే, రాజకీయాలు కాబట్టి మెట్టు దిగలేదు. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం రావడంతో తొలుత ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. అయితే, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేను ఆహ్వానించడంతో వెనక్కుతగ్గారు. అదే సమయంలో రాష్ట్రంలో నిరసన సెగలు రేగడంతో తన ప్రతినిధిని కూడా మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి జయలలిత పంపించలేదు.

అన్నీ సద్దుమణిగిన తరువాత తన 37 మంది కొత్త ఎంపీలు, రాజ్యసభ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లేందుకు నిర్ణయించారు. ఆ మేరకు ప్రధాని కార్యాలయం నుంచి జయలలితకు ఆహ్వానం రావడంతో ఢిల్లీకి వెళ్లేందుకు ఆమె సిద్ధం అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని తన ఎంపీలతో కలిసేందుకు సిద్ధమయ్యారు.

సామరస్యం:
యూపీఏ సర్కారు తీరుపై, ఆ ప్రభుత్వంతో జయలలిత తీవ్రంగానే ఢీకొట్టారు. తాజాగా, కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో వారితో సామరస్య పూర్వకంగా మెలిగేందుకు నిర్ణయించారు. మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంతో కలసి రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకునేందుకు వ్యూహ రచన చే శారు. జూన్ మూడో తేదీన ఢిల్లీలో ప్రధాని మోడీతో ఆమె భేటీ కానున్నారు. చెన్నై నుంచి ఆ రోజు ఉదయం ఢిల్లీకి వెళ్లే జయలలిత నేరుగా ప్రధాని మోడీ కార్యాలయూనికి వెళ్లనున్నారు.

అక్కడ భేటీ అనంతరం రాష్ట్రంలోని సమస్యలను మోడీకి ఏకరువు పెట్టనున్నారు. దీనిపై సీఎంవో వర్గాలు అధికారికంగానే ప్రకటించాయి. అయితే, అందులో ఎలాంటి అంశాలు ఉంటాయన్నది గోప్యంగా ఉంచారు. అలాగే, ఢిల్లీ పయనం అనంతరం ఎనిమిదో తేదీన సీమాంధ్ర పర్యటనకు జయలలిత వెళ్లొచ్చంటూ సచివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ రోజున సీమాంధ్ర సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న దృష్ట్యా, ఆ కార్యక్రమానికి ఆమె వెళ్లొచ్చని సీఎంవో అధికారులు చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు