జేడీఎస్‌ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిశోర్‌!

26 Feb, 2020 20:17 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ఎన్నో రాజకీయ పార్టీలు అధికారలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెల్సిందే. తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ తిరిగి గెలుపొందడంతో ప్రశాంత్‌ కిషోర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఆయనతో కలిసి పనిచేయడానికి పలు పార్టీలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ పార్టీ నాయకులు కుమారస్వామి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో పనిచేసే ఐప్యాక్ సేవలను వినియోగించుకుంటున్నామని తెలిపారు. చదవండి: సీఎం జగన్‌తో టాలీవుడ్‌ అగ్ర నిర్మాతల భేటీ

అందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్‌తో కుమారస్వామి మంగళవారం భేటీ అయ్యారు. పార్టీ భవిష్యత్తు కోసం ఏం చేయాలనే అంశాన్ని చర్చించారు. తొలి విడత చర్చలు జరిగాయని, మిగతా అంశాలను త్వరలో వెల్లడిస్తానని కుమారస్వామి తెలిపారు. కాగా.. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ 37 సీట్లను గెలుపొందింది. కాంగ్రెస్ మద్దతుతో కుమారస్వామి సీఎం అయ్యారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో. కొందరు ఎమ్మెల్యేల రాజీనామాతో విశ్వాస పరీక్షలో నెగ్గలేక ఆ ప్రభుత్వం పడిపోయింది. తరువాత మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తదనంతరం జరిగిన 2019 లోక్‌సభ ఎన్నికల్లో 28 సీట్లకు గానూ ఆ పార్టీ కేవలం ఒక్క చోట మాత్రమే గెలుపొందిన విషయం తెలిసిందే.

చదవండి: గాంధీ వైపా? గాడ్సే వైపా? 

మరిన్ని వార్తలు